పాకిస్థాన్​లో చారిత్రాత్మక హిందూ దేవాలయం కూల్చివేత

పాకిస్థాన్​లో చారిత్రాత్మక హిందూ దేవాలయం కూల్చివేత

పాక్‌లో ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆప్ఘన్ సరిహద్దుకు సమీపంలోని లండీ కోతాల్ బజార్‌లో ఉన్న ఈ దేవాలయాన్ని కమర్షియల్ భవనం నిర్మాణం కోసం కూల్చివేసినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరిగే దాడుల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. ఇక హిందూ ఆలయాల కూల్చివేతలు అక్కడ సర్వసాధారణమే. తాజాగా పాకిస్థాన్‌లో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ ఆలయాన్ని కూల్చివేసి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.  దేశ విభజన జరగక ముందు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ ఆలయాన్ని కూల్చివేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లాండి కోటల్ బజార్‌ పట్టణంలో ఉన్న పురాతన హిందూ ఆలయాన్ని తాజాగా అక్కడి అధికారులు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయాన్ని ఖైబర్‌ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. 1947 దేశవిభజన సమయంలో స్థానిక హిందువులు పాక్‌ను వీడిన తరువాత ఈ దేవాలయం మూత పడింది. దాని బాగోగులు చూసేవారు లేకపోవడంతో క్రమంగా ఆలయంలోని ఒక్కో భాగం కనుమరుగవడం ప్రారంభించింది. తాజాగా ఆలయాన్నే తొలగించేందుకు అధికారులు అంగీకరించడంతో అది కనుమరుగైపోయింది. 15 రోజుల క్రితం అక్కడ కమర్షియల్ భవన నిర్మాణం ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కాగా, గుడి కూల్చివేత అక్రమమంటూ స్థానిక గిరిజన జర్నలిస్టు ఇబ్రహీం షిన్వారీ గొంతెత్తారు. గుడి విషయం అధికారిక రికార్డుల్లో లేదని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖైబర్ దేవాలయంగా పేరు పడ్డ ఆ గుడి గురించి తాతముత్తాతల ద్వారా తనకు తెలిసిందన్నారు. 1992లో భారత్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా స్థానిక మతపెద్దలు ఈ దేవాలయాన్ని పాక్షికంగా కూలగొట్టారని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఏయే నిర్మాణాలు ఉన్నాయో పక్కాగా లెక్కలు రికార్డు చేయడం రెవెన్యూ యంత్రాంగం బాధ్యత అని చెప్పారు. రికార్డుల్లో గుడి ప్రస్తావన లేదంటూ బాధ్యతల నుంచి అధికారులు తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆలయం ఉన్న ప్రాంతంలో అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం జరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉన్నట్లు తమ వద్ద ఎలాంటి రెవెన్యూ రికార్డులు లేవని అధికారులు చెప్పడం గమనార్హం. 

 ఖైబర్‌ టెంపుల్‌ను కూల్చివేయడంపై పాక్‌లోని దేవాలయ నిర్వహణ కమిటీకి చెందిన హరూన్ సర్బాడియాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీలకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం పాక్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని తెలిపారు.