తెలంగాణ చరిత్ర : భద్రాచలం మన్యంలో 200 ఏళ్ల నాటి సమాధులు.. బాంబులతో పేల్చిన చెక్కుచెదరలేదు..!

తెలంగాణ చరిత్ర : భద్రాచలం మన్యంలో 200 ఏళ్ల నాటి సమాధులు.. బాంబులతో పేల్చిన చెక్కుచెదరలేదు..!

ఈ సమాధుల వయసు రెండు వందల ఏళ్లు

చరిత్ర

రెండు వందల ఏళ్లనాటి సమాధులు అయినా.. చెక్కు చెదరలేదు. బాంబు పెట్టి పేల్చినా.. పాక్షికంగా దెబ్బతిన్నాయి కానీ, ధ్వంసం కాలేదు. అంత పటిష్టంగా ఉన్నాయి ఆ సమాధులు. భద్రాచలం మన్యంలోని దుమ్ముగూడెం మండలం ములకపాడులో ఉన్న ఆధారాలుగా నిలుస్తున్నాయి. వాళ్లు దేశం వదిలి వెళ్లిపోయినా.. వాళ్ల పూర్వీకుల సమాధులు మాత్రం ఇంకా ఇక్కడ పదిలంగానే ఉన్నాయి.
!!!: భద్రాచలం, వెలుగు

బ్రిటిష్ వాళ్లు పాలించేటప్పుడు మనదేశంలో కొన్ని క్రిష్టియన్ మిషనరీలు ఉండేవి. దుమ్ముగూడెంలో కూడా ఒక మిషనరీ స్కూల్, హాస్టల్, చర్చి ఉండేవి. అందులో చాలామంది బ్రిటిష్ వాళ్లు పనిచేసేవాళ్లు. వాళ్లలో ఎవరు చనిపోయినా.. ఈ ప్రాంతంలోనే ఖననం చేసేవాళ్లు. ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని శ్మశానవాటికలో వాళ్ల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టినా.. వాటిలో కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ సమాధులు కట్టేందుకు సున్నపురాయి, కోడిగుడ్డు సొన, బంకమట్టి వాడబట్టే ఇంకా పటిష్టంగా ఉన్నాయి.

అందర్నీ ఇక్కడే..

కెయిన్ పేట చర్చి ప్రాంతంలో బ్రిటిష్ వాళ్లవి భవనాలు ఉండేవి. వాటిలో ఉండేందుకు 1815లో కెయిన్ అనే ఒక బ్రిటిషర్ భార్యతో కలిసి వచ్చాడు. తర్వాత పుల్లెం, కెఎంతో పాటు మరికొందరు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ల కాలంలోనే ఇక్కడ మిషనరీ హాస్టల్ ను స్థాపించారు. ఒక చర్చిని కూడా కట్టించారు. ఆ మిషనరీ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం దుమ్ముగూడెం, ములకపాడు, లక్ష్మీనగరం, బుర్రవేముల ప్రాంతాల్లోని పేదలకు పాలపొడి, పాలు ఉచితంగా ఇచ్చేవాళ్లు. 

అంతేకాకుండా ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేసేవాళ్లు. తర్వాత కొంతకాలానికి 1817 లో కెయిన్ భార్య చనిపోయింది. ఆమె శవాన్ని ఇక్కడే ఖననం చేసి, సమాధి కట్టించారు. తర్వాత కొంత కాలానికి కెయిన్ కూడా 1834 మార్చి 15న అనారోగ్యంతో చెన్నైలో చనిపోయాడు. ఆయన శవాన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఖననం చేశారు. తర్వాత ఈ దంపతుల కుటుంబీకులు, మిషనరీలో పనిచేసేవాళ్ల శవాలను కూడా ఈ ప్రాంతంలోనే ఖననం చేశారు. 

సమాధులు కూడా కట్టించారు. వాటిలో చాలా సమాధులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1969లో వచ్చిన భూ ప్రకంపనల వల్ల మిషనరీ, హాస్టల్ భవనాలు, చర్చి దెబ్బతిని శిథిలావస్థకు వచ్చాయి. దుమ్ముగూడెంలోని కొందరు ప్రముఖులు వీధి నాటకాలు వేసి అప్పట్లోనే రూ.50వేల రూపాయల విరాళాలు సేకరించి చర్చిని పునర్నిర్మించారు. కెయిన్ ఇక్కడ చాలాకాలం ఉన్నందుకే దీన్ని 'కెయిన్ పేట'గా పిలుస్తున్నారు.

బాంబులతో పేల్లినా

బ్రిటిష్ కాలంనాటి ఈ సమాధుల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతో కొంతమంది వాటిని తవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కెయిన్ కొడుకు సమాధిని గునపాలతో పెకిలించినా రాకపోవడంతో బాంబులతో పేల్చారు. అయినప్పటికీ ఆ సమాధి చెక్కు చెదరలేదు. ఈ సమాధుల ప్రాంతంలోనే ప్రస్తుతం క్రిస్టియన్ల శ్మశాన వాటిక కట్టించారు.