రేవంత్ రెడ్డి ప్రస్థానం : అతడే ఒక సైన్యం.. జడ్పీటీసీ నుంచి సీఎం దాకా..

రేవంత్ రెడ్డి ప్రస్థానం : అతడే ఒక సైన్యం.. జడ్పీటీసీ నుంచి సీఎం దాకా..

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ.. ఇప్పుడు పవర్​లోకి రావడం వెనుక ఆ పార్టీ నేతల సమిష్టి కృషితోపాటు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అనుసరించిన వ్యూహాలు కీలకంగా మారాయి. కురు వృద్ధ కాంగ్రెస్​ను గెలుపు తీరానికి చేర్చిన యువ నేతగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్​ షోలతో రాష్ట్రమంతా రేవంత్​ కలియతిరిగి.. పార్టీకి విజయం అందించారు. కాంగ్రెస్​లో అతి తక్కువ కాలంలో ఈ స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరూ లేరు. పార్టీలో ఒక పదవి దక్కాలంటే దశాబ్దాల పాటు శ్రమిస్తే తప్ప కల సాకారం కాదు. కానీ, రాష్ట్ర కాంగ్రెస్​ పగ్గాలు చేపట్టిన రెండేండ్లకే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి

రేవంత్​రెడ్డి.. 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది మిడ్జిల్​ మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా కింద స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో రెండో దఫా పోటీ చేసి సక్సెస్​ అయ్యారు. 2017 వరకు టీడీపీకి ఫ్లోర్​ లీడర్​గా వ్యవహరించారు. అదే ఏడాది అక్టోబర్​లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు.

కాంగ్రెస్​లో అంచెలంచెలుగా ఎదుగుతూ

రేవంత్​రెడ్డి కాంగ్రెస్​లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2018లో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పదవి పొందారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది నెలలకు 2019​లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మల్కాజ్​గిరి స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 2021, జూన్​ 26న ఆయనను పీసీసీ చీఫ్​గా నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. అదే ఏడాది జులై 7న రేవంత్​ పీసీసీ చీఫ్​గా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు సాగించారు. పార్టీలోని అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని కొందరు ముఖ్య నేతలకే నమ్మకం లేని స్థితి నుంచి రాష్ట్రమంతా ‘మార్పు కావాలి–కాంగ్రెస్​ రావాలి’ అనే నినాదంతో రేవంత్​ ముందుకు కదిలారు. పార్టీలోని చాలా మంది ముఖ్య నేతలు, స్టార్​ క్యాంపెయినర్లు తమ తమ  నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం సాగించగా రేవంత్​ మాత్రం రాష్ట్రమంతా కలియదిరుగుతూ అభ్యర్థులకు అండగా ఉంటూ వచ్చారు. అధికార పార్టీ బీఆర్​ఎస్​పై ఘాటు విమర్శలు కురిపిస్తూ.. తొమ్మిదిన్నరేండ్ల పాలనలోని తప్పులను వేలెత్తి చూపిస్తూ.. జన చైతన్యాన్ని రగిలించారు. అతడే ఒక సైన్యమై కాంగ్రెస్​ను విజయ తీరానికి చేర్చగలిగారు