లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్ స్ర్కైబ్ చేయండి.. ఫాలోవర్స్ ను అభ్యర్థించిన మోదీ

లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్ స్ర్కైబ్ చేయండి.. ఫాలోవర్స్ ను అభ్యర్థించిన మోదీ

యూట్యూబ్ ఛానెల్ లో కనిపించే వాళ్లు వీడియో ఎండింగ్ లేదా బిగినింగ్ లో చేసే రిక్వెస్ట్.. 'మా వీడియో నచ్చినట్లయితే లైక్‌ చేయండి. సబ్‌స్ర్కైబ్‌ చేయండి. షేర్‌ చేయండి. మరిన్ని అప్‌డేట్‌ల కోసం బెల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి' అని. అదే తరహాలో ప్రధాని మోదీ సైతం ఫాలోవర్లను అభ్యర్థించారు. తన ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండని సూచించారు.

యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 5వేల మంది కంటెంట్‌ క్రియేటర్లను ఉద్దేశించి సెప్టెంబర్ 27న ప్రసంగించిన ఆయన.. కంటెంట్ క్రియేట్ చేయడంలో తాను ఒకరినని భావించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారి కంటెంట్ దేశ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో తాను గమనిస్తున్నానన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్‌ ద్వారా దేశానికి, ప్రపంచానికి తాను అనుసంధానమైనట్లు ప్రధాని చెప్పారు. తనకు కూడా మంచి సంఖ్యలోనే సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 17.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు మోదీ తెలిపారు. మనమంతా కలిసి దేశ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకురావచ్చన్నారు. తన ఛానల్‌లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయన్నారు. అయితే పరీక్ష సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకత పెంపు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విషయాలపై యూట్యూబ్‌ ద్వారా విద్యార్థులతో సంభాషించడం తనకు అత్యంత సంతృప్తినిస్తాయని చెప్పారు.

ప్రధాని తన ఐదు నిమిషాల ఈ ప్రసంగంలో, స్వచ్ఛ్ భారత్, డిజిటల్ చెల్లింపులు, వోకల్ ఫర్ లోకల్ గురించి కూడా మాట్లాడారు. ఇలాంటి ప్రచారాలలో భాగం అయ్యేలా ఎక్కువ మందిని ప్రేరేపించాలని యూట్యూబర్‌లను కోరారు. ఇక యూట్యూబర్లు ప్రతి వీడియో చివరిలో ప్రజలు ఆలోచించేలా ప్రశ్నలను లేవనెత్తాలని, తద్వారా ప్రజలతో భాగస్వామ్యం మెరుగుపడుతుందని, తమతో వాటిని పంచుకుంటారని అన్నారు. వీడియో చివర్లో.. మరిన్ని అప్‌డేట్ల కోసం తన ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయండి.. బెల్‌ ఐకాన్‌ నొక్కండి అంటూ నెటిజన్లను ప్రధాని మోదీ కోరడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకున్న ఆదరణ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. మోదీని ట్విట్టర్ లో 9.2 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.