ఇన్​స్పిరేషన్ : హెచ్​ఎంటీ దేశ్​కా ధడ్కన్

 ఇన్​స్పిరేషన్ : హెచ్​ఎంటీ దేశ్​కా ధడ్కన్

హెచ్​ఎంటీ అంటే... బ్రాండ్​ మాత్రమే కాదు. దేశ్​కా ధడ్కన్​. ఇండియాలో యూత్​కి హెచ్​ఎంటీ వాచ్​ పెట్టుకోవడం ఒక డ్రీమ్​. అందుకే పెండ్లిళ్లప్పుడు కట్నాల కింద కూడా హెచ్​ఎంటీ వాచ్​లు పెట్టేవాళ్లు. గ్రాడ్యుయేషన్​లో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు తల్లిదండ్రులు ఈ వాచ్​లనే గిఫ్ట్‌‌గా ఇచ్చేవాళ్లు. ప్రేమికురాలి మనసు దోచుకునేందుకు ప్రేమికుడు హెచ్​ఎంటీ వాచ్​ గిఫ్ట్​గా ఇచ్చేవాడు. అంతలా జనాదరణ పొందిన ఈ బ్రాండ్​ 1980, 1990 జనరేషన్​కు బాగా తెలుస్తుంది. ఎక్కువ మోడల్స్​ లేకున్నా.. ఈ వాచ్​లు మాత్రం చాలా మోడర్న్​​గా ఉండేవి.

భారతీయ పారిశ్రామిక చరిత్రలో  హిందూస్తాన్ మెషిన్ టూల్స్ (హెచ్​ఎంటీ) వాచ్ కంపెనీది ప్రత్యేక స్థానం. ఇండియన్​ ఇన్నొవేషన్​ సక్సెస్​కి హెచ్​ఎంటీని ఎగ్జాంపుల్​గా చెప్తుంటారు. ఇండియన్ మార్కెట్​లోకి వచ్చిన మొదటి ఇండియన్​ వాచ్ ఇది​. ఈ కంపెనీ ప్రభుత్వ ఆధీనంలో నడిచేది. 1961లో మొదలైన కంపెనీ.. తక్కువ టైంలోనే ప్రపంచంలోని అతిపెద్ద వాచ్ తయారీ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. మొత్తంగా 115 మిలియన్లకుపైగా వాచ్​లు ఉత్పత్తి చేసింది. 

సొంత టెక్నాలజీ

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అప్పటి నాయకులు గుర్తించారు. ముఖ్యంగా మెషినరీ తయారీ రంగంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే 1953 సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ మెషిన్ టూల్స్​ని స్థాపించారు. విమానం నుండి క్షిపణుల వరకు, ఓడల నుండి జలాంతర్గాముల వరకు ఎలాంటి అధునాతన యంత్రాలైనా డెవలప్​ చేయడానికి వీలుండే విధంగా ఏర్పాటు చేశారు దీన్ని. అందుకే పండిట్ జవహర్​లాల్​ నెహ్రూ హెచ్​ఎంటీని ‘ఆధునిక భారతదేశంలోని దేవాలయాల్లో ఒకటి’ అన్నారు. 

వాచ్​లకు డిమాండ్​

హెచ్​ఎంటీ స్థాపించిన టైంలో దేశంలో రిస్ట్‌ (చేతి) వాచ్​లకు డిమాండ్ పెరిగింది. కానీ.. అప్పటివరకు మన దగ్గర వాటిని తయారుచేసే కంపెనీలు లేవు. దాంతో దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. విదేశాల నుంచి వాచ్​లను దిగుమతి చేసుకోవడంతో పాటు కొన్ని చిన్న సంస్థలు విడిభాగాలను తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్​ చేసి అమ్మేవి. అయితే ఇండియాలో ‘వెస్ట్ ఎండ్, ఆంగ్లో-స్విస్’ వాచ్​ల అమ్మకాలు ఎక్కువగా ఉండేవి. కానీ డిమాండ్​కు తగ్గ సరఫరా ఉండేది కాదు. దాంతో గవర్నమెంట్​ మన దేశంలో వాచ్​లు తయారుచేయడానికి ఉన్న వనరులు, టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. హెచ్​ఎంటీ ద్వారా వాచ్​లు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

ఇలా మొదలైంది

హెచ్​ఎంటీ దగ్గర అప్పటివరకు వాచ్ తయారీకి అవసరమైన మైక్రో-ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు. అందుకే జపాన్‌కు చెందిన ఫేమస్​ వాచ్​ కంపెనీ ‘సిటిజన్’ సాయం తీసుకుంది. ఆ కంపెనీ ఇచ్చిన టెక్నాలజీ సాయంతో ఇండియాలోనే వాచ్​ల తయారీ మొదలుపెట్టింది. 1961లో మొదటగా బెంగళూరులో సంస్థను స్థాపించారు. 1963 నాటికి మొదటి బ్యాచ్ హ్యాండ్ వైండింగ్ మెకానికల్ రిస్ట్‌వాచ్‌లు తయారు చేశారు. వాచ్‌మేకింగ్​లో కంపెనీ​ సక్సెస్​ అయ్యింది. తక్కువ ధరలో క్వాలిటీ వాచ్​లను తయారు చేయగలిగింది. ఈ వాచ్​లకు బాగా డిమాండ్​ పెరిగింది. ఒక టైంలో వాచ్​ అంటే ‘హెచ్​ఎంటీ’ మాత్రమే అనేలా మారిపోయింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా వాచ్​లను తయారుచేయడానికి దేశవ్యాప్తంగా ఐదు మాన్యుఫాక్చరింగ్​ యూనిట్లు ఏర్పాటు చేసింది. 

మూడు లక్షల లక్ష్యంతో...

జూన్ 29, 1970న బెంగళూరులోని పాత ఫ్యాక్టరీ దగ్గర్లోనే మరో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీతో కాశ్మీర్‌లో ప్రత్యేకంగా ఒక వాచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మే 13, 1971న అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి జి.ఎం. సాదిక్ దానికి శంకుస్థాపన చేశారు. 1975లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. సంవత్సరానికి మూడు లక్షల హ్యాండ్ వైండింగ్ వాచ్‌ల ఉత్పత్తి దీని లక్ష్యం. హెచ్​ఎంటీ తయారు చేసిన మోడళ్లలో ‘చినార్, కమల్, స్పోర్ట్‌స్టార్, స్పోర్ట్స్ వాచ్, శివ, జనతా, కోహినూర్, పైలట్, అవినాష్​’ బాగా ఫేమస్​ అయ్యాయి. చినార్, కమల్ మోడల్స్​లో చినార్ లీఫ్  బొమ్మను ప్రింట్​​ చేసేవాళ్లు. 

దిగుమతులకు పన్నులు 

హెచ్​ఎంటీ డెవలప్​ అవుతున్న టైంలో దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది గవర్నమెంట్​. దాంతో వాచ్​ల దిగుమతికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ అది స్థానిక వస్తువుల ఉత్పత్తికి అనుకూలంగా మారింది. విదేశీ వాచ్​ల దిగుమతులు తగ్గడంతో... హెచ్​ఎంటీ వాచ్​ల డిమాండ్​ పెరిగింది. పైగా హెచ్​ఎంటీ వాచ్​లు జపాన్​ టెక్నాలజీతో తయారుచేయడం వల్ల అవి సిటిజన్​ వాచ్​లకు దగ్గరగా ఉండడంతో క్రేజ్​ పెరిగింది. ముఖ్యంగా1980ల వరకు హెచ్​ఎంటీ వాచ్​లకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. వాచ్ కోసం ఆర్డర్​ ఇచ్చి వెయిట్​ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ‘‘టైమ్‌ కీపర్స్ టు ది నేషన్”, ‘‘దేశ్​ కి ధడ్కన్​’’ లాంటి అడ్వర్టైజ్​మెంట్స్​ కూడా హెచ్​ఎంటీని జనాల్లోకి తీసుకెళ్లాయి. 

సూపర్​ క్వాలిటీ

హెచ్​ఎంటీకి డిమాండ్​ పెరగడానికి వాటి క్వాలిటీ కూడా కారణమే. హై క్వాలిటీ మెటీరియల్​తో వాచ్​లను తయారుచేసేవాళ్లు.1985లో బెంగళూరులోని వాచ్ ఫ్యాక్టరీలో మెయిన్ స్ప్రింగ్, హెయిర్ స్ప్రింగ్, షాక్ అబ్జార్బర్ కాంపోనెంట్స్​ని తయారుచేయడానికి ప్రత్యేకంగా ఒక యూనిట్​ ఏర్పాటు చేశారు. దీంతో మెకానికల్ వాచ్-మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా డెవలప్​ అయ్యింది. ఫ్యాక్టరీలోనే 100 శాతం విడిభాగాలు తయారయ్యేవి. వాచ్ కేస్  నుంచి అసెంబ్లింగ్​ వరకు అన్నీ కంపెనీలోనే జరిగేవి. వేడి చేసిన ముడి ఇత్తడి బిల్లెట్, ప్రెస్సింగ్ డైస్‌ని ఉపయోగించి హాట్ ఫార్మింగ్ ప్రక్రియలో కేసు చేసేవాళ్లు. తర్వాత క్రోమ్, బంగారంతో అయాన్/కెమికల్ పూత పూస్తారు.

అసెంబ్లింగ్​ పూర్తయ్యాక చివరగా కేస్‌బ్యాక్ సీరియల్ నంబరింగ్, లోగో స్టాంపింగ్ చేసేవాళ్లు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే.. ఇవన్నీ చేయడానికి కావాల్సిన మెషిన్లు, టూల్స్‌ అన్నీ హిందుస్తాన్​ మెషిన్ టూల్స్‌లోనే తయారుచేశారు. కొన్ని ప్రత్యేకమైన యంత్రాలు మాత్రమే దిగుమతి చేసుకున్నారు. 

పైలట్ల కోసం..  

పైలట్ల కోసం కూడా హెచ్​ఎంటీ ప్రత్యేకంగా వాచ్​లను తయారు చేసింది. ఇవి చాలా ఆక్యురేట్​గా పనిచేసేవి. 1971 ఇండో–పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ కాన్‌బెర్రా బాంబర్ విమానాన్ని నడుపుతున్న భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్‌లకు ప్రత్యేకంగా ఈ వాచ్​లను ఇచ్చారు. అప్పట్లో విమానంలో కాక్‌పిట్ వాచ్​ ఉండేది. కానీ క్రోనోగ్రాఫ్ లేదా కౌంట్‌డౌన్ ఫీచర్ ఉండేది కాదు. అందుకే పైలెట్లు ఈ వాచ్​లను వాడేవాళ్లు. బాంబు దాడుల టైంలో ఈ వాచ్​లు బాగా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా.. మిలిటరీ, రైల్వేలు, సిగ్నల్స్ యూనిట్లలో కూడా ఈ హెచ్​ఎంటీ వాచ్​లనే వాడేవాళ్లు. 

క్వార్ట్జ్ సంక్షోభం 

ఇప్పుడంటే అన్నీ డిజిటల్​ వాచ్​లే కనిపిస్తాయి. కానీ.. అప్పట్లో ఉన్న అనలాగ్​ వాచీలు మాత్రమే ఉండేవి. అందులోనూ ముందుగా మెకానికల్​ వాచ్​లు వచ్చాయి. ఆ తర్వాత క్వార్ట్జ్ వాచ్​లు అందుబాటులోకి వచ్చాయి. మెకానికల్​ వాచ్​లకు బ్యాటరీతో పనిలేదు. కీ ఇస్తే.. వాటి కెపాసిటీని బట్టి ఒకట్రెండు రోజులు పనిచేస్తాయి. అడ్వాన్స్​డ్​ మెకానికల్​ వాచ్​లకు కీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. హ్యాండ్​ మోషన్​ సాయంతో పనిచేస్తాయి. అయితే.. వీటిని నాలుగైదు రోజులు పక్కన పెడితే మాత్రం మళ్లీ కీ ఇవ్వాలి. హెచ్​ఎంటీ ఎక్కువగా ఇలాంటి వాచ్​లను తయారు చేసేది. 1969లో వచ్చిన క్వార్ట్జ్  వాచ్​లు బ్యాటరీ పవర్​తో పనిచేస్తాయి. కాబట్టి ప్రతి రోజు కీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే.. వాటి ధర కాస్త ఎక్కువగా ఉండడం వల్ల మొదట్లో పెద్దగా డిమాండ్​ ఉండేది కాదు.

అదే టైంలో మార్కెట్​లోకి ఇండియన్​ కంపెనీ  టాటా 1984లో ఎంట్రీ ఇచ్చింది. టాటా గ్రూప్​ వాచ్​లను తయారు చేయడం మొదలైనప్పటి నుంచి హెచ్​ఎంటీ వాచ్​లకు డిమాండ్​ తగ్గింది. టాటా టైటాన్ అనే పేరుతో తెచ్చిన వాచ్​లు క్వార్ట్జ్ టెక్నాలజీతో తక్కువ ధరల్లో దొరికేవి. అయితే.. హెచ్​ఎంటీ కూడా1986 నుంచి ఇండియాలో క్వార్ట్జ్ వాచ్​లను ఉత్పత్తి  చేసింది. కానీ.. వాటి ధరలు చాలా ఎక్కువ. అందుకే హెచ్​ఎంటీ మెకానికల్ వాచ్​ల ఉత్పత్తి మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. అంతలోనే టైటాన్ తన క్వార్ట్జ్ వాచ్​లతో మార్కెట్ వాటాను గెలుచుకోవడం మొదలుపెట్టింది. 

2016లో మూత 

హెచ్​ఎంటీ తన తప్పును1990 నాటికి గుర్తించింది. అప్పటినుంచి క్వార్ట్జ్​ వాచ్​ల ప్రొడక్షన్​ పెంచింది. కానీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే టైంలో దిగుమతుల మీద ఆంక్షలు తగ్గాయి.  భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ఇంటర్నేషనల్​ బ్రాండ్స్​కు వెల్​కం​ చెప్పింది. దాంతో భారతీయ వినియోగదారులు విదేశీ వాచ్ బ్రాండ్‌లను కొనడం మొదలుపెట్టారు. అయినా.. దాని బ్రాండ్​ వాల్యూ వల్ల 2000 సంవత్సరం వరకు అమ్మకాలు బాగానే జరిగాయి. ఆ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. దాంతో భారత ప్రభుత్వం చివరకు మే 2016లో హెచ్​ఎంటీ వాచ్ ప్రొడక్షన్​ని ఆపేసింది. అయినా.. ఇప్పటికీ కొన్ని స్టోర్లలో హెచ్​ఎంటీ వాచ్​లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ మూసేశాక వాటికి డిమాండ్​ పెరిగింది. 

ఇండియన్ మిలిటరీ 

భారత సైన్యం, వైమానిక దళానికి రిస్ట్​ వాచ్​లను సరఫరా చేసే బాధ్యత హెచ్​ఎంటీ 1970 –80ల్లో తీసుకుంది. అందుకోసం హెచ్​ఎంటీ జవాన్ అనే ప్రత్యేకమైన మోడల్‌ని తెచ్చింది. వాటిపైన ప్రత్యేకంగా ఒక నెంబరింగ్​ ఉండేది. అంతకుముందు బ్రిటిష్​ సైన్యానికి కూడా ఇలాగే నెంబరింగ్​ చేసిన వాచ్​లను ఇచ్చేవాళ్లు. అందుకే హెచ్​ఎంటీ కూడా ఆర్మీ స్టాక్ ఇష్యూ కోడ్ సిస్టమ్ ప్రకారం కేస్‌పై సీరియలింగ్​ గుర్తులు వేసింది. యూనిట్ రన్ క్యాంటిన్​ ద్వారా కూడా ఈ వాచ్​లను సబ్సిడీ ధరతో అమ్మేవాళ్లు. ఇలాంటి వాచ్​లకు బాగా డిమాండ్ ఉండేది. ఇప్పటికీ పాత వాచ్​ సెంటర్లలో ఈ వాచ్​లు కనిపిస్తుంటాయి. వీటిని సెకండ్​ హ్యాండ్​లో చాలామంది కొనేవాళ్లు.