
- చోటు నిలుపుకున్న దిల్‌ప్రీత్, లక్రా
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ కోసం18 మంది సభ్యులతో కూడిన మెన్స్ హాకీ టీమ్‌ను బుధవారం ప్రకటించారు. ఈ జట్టు ఎంపికలో ఎటువంటి పెద్ద ఆశ్చర్యాలు లేవు. మిడ్ ఫీల్డర్ రాజిందర్ సింగ్, ఫార్వర్డ్స్ శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్ జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. స్టార్ డ్రాగ్ -ఫ్లికర్ హర్మన్ సింగ్ టీమ్‌ను నడిపిస్తాడు. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ నుంచి రిటైర్ అయిన ఫార్వర్డ్ లలిత్ ఉపాధ్యాయ స్థానంలో లక్రా, గుర్జంత్ సింగ్ స్థానంలో దిల్‌ప్రీత్ జట్టులోకి వచ్చారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ విజేత వచ్చే ఏడాది జరిగే ఎఫ్ఐహెచ్ మెన్స్ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.
దాంతో ఆసియా కప్ ఇండియాకు చాలా కీలకం కానుంది. టీమ్‌పై హెడ్ కోచ్ ఫుల్టన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండిన అనుభవజ్ఞులైన జట్టును ఎంచుకున్నాం. ఆసియా కప్ మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమే మా ప్రధాన లక్ష్యం. మా జట్టులో బ్యాలెన్స్ ఉంది. డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్, ఫార్వర్డ్స్ వంటి అన్ని విభాగాలను నడిపించే సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నారు. వారి సమష్టి బలం మాకు చాలా ఉత్సాహాన్నిస్తోంది. ఈ జట్టు ఆడే విధానం మాకు అతి పెద్ద బలంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నాడు. కాగా, ఈ మెగా టోర్నీలో ఇండియా, జపాన్, చైనా, కజకిస్తాన్‌తో కలిసి పూల్ –ఎలో బరిలో నిలిచింది. ఈ నెల 29న చైనాతో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. తదుపరి గ్రూప్ మ్యాచ్‌ల్లో 31న జపాన్‌తో, సెప్టెంబర్ 1న కజకిస్తాన్‌తో ఇండియా తలపడుతుంది.
ఇండియా టీమ్:
గోల్ కీపర్స్: కృష్ణన్ బి పాఠక్, సూరజ్ కర్కర; డిఫెండర్స్: సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్; మిడ్‌ఫీల్డర్స్: రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్; ఫార్వర్డ్స్: మన్‌దీప్ సింగ్, శిలానంద్ లక్రా, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్; ఆల్టర్నేట్ అథ్లెట్స్: నీలం సంజీప్ క్సెస్, సెల్వమ్ కార్తీ.