హోలీ మదర్​ శారదా మాత

హోలీ మదర్​ శారదా మాత

శారదా దేవి భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి.  రామకృష్ణ బోధనలు భావితరాలకు అందించడంలో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్​లు విస్తరించడంలో శారదాదేవి ముఖ్యపాత్ర పోషించారు. శారదామాత 1853లో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జయరాంబాటి అనే కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు. తల్లికి ఇంటిపనుల్లో సాయపడటం, పొలానికి వెళ్లి తండ్రికి ఆహారాన్ని అందించడం ఇలా ఆమె జీవితం సాగిపోయేది. కానీ, ధ్యానంపై ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది. ఆమె బాల్యం బయటకు సర్వసాధారణంగానే కనిపించినా లోపల మాత్రం ఆమె సాధకురాలే.

రామకృష్ణ పరమహంసతో పెండ్లి

శారదాదేవిని ఐదవ ఏట కాళికాదేవి మందిరంలో పూజారిగా పనిచేసే గదాధర ఛటోపాధ్యాయకిచ్చి (రామకృష్ణ పరమహంస అసలుపేరు) పెండ్లి చేశారు. అప్పటికి శారదాదేవి వయసు ఐదేండ్లు, రామకృష్ణకు 23ఏండ్లు. శారదాదేవికి 18 ఏళ్ల వయసు రాగానే రామకృష్ణునితో కలిసి ఉండేందుకు దక్షిణేశ్వరానికి చేరుకున్నారు. ఆమెను చూసిన వెంటనే రామకృష్ణులు ‘నన్ను ఈ ఐహిక ప్రపంచంలోకి దింపడానికే వచ్చావా?’ అని అడిగారట. శారదాదేవి చిరునవ్వుతో  లేదు.. నేను మీ లక్ష్యసాధనలో సాయం చేసేందుకే వచ్చాను’ అని బదులిచ్చారట. అన్నట్లుగానే శారదాదేవి, రామకృష్ణున్ని కంటికిరెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆయన సాధనలకు ఏ అడ్డు లేకుండా జాగ్రత్తపడేవారు. భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం వారిది. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతు లిరువురూ జీవించినంతకాలం సన్యాసులవలే కఠోర బ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్లు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్లు జయరాంబాటిలో, ఇంకొన్నాళ్లు  కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉండేవారు. 

శిష్యులకు కన్నతల్లిలా..

రామకృష్ణుల శిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకున్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక సలహాలకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. తీర్థయాత్రల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా కామార్పుకూర్లో జీవించారు. అక్కడ దుర్బర పేదరికంలో  బతికారు. కొన్నాళ్ళు కేవలం ఇంట్లో కాసిన్ని ఆకుకూరలు తిని బతికారు. 1888లో ఈ విషయం తెలిసిన రామకృష్ణుల శిష్యగణం ఆమెను కలకత్తాకు రమ్మని ఆహ్వానించారు. స్వామి శారదానంద అనే శిష్యుడు అప్పుచేసి శారదాదేవి కోసం కలకత్తాలో ఇల్లు కట్టించారు. అప్పుడు వారు బెంగాలి భాషలో ప్రచురించిన ఉద్బోధన్ పేరుతో ఆ ఇంటిలోనే చాలా కాలం ఆవిడ గడిపారు.

నారీ లోకానికి ఆదర్శమూర్తి

రామకృష్ణ సంప్రదాయంలో ఆవిడను చాలా ఉన్నతస్థానంలో ఉంచుతారు. రామకృష్ణులు బతికి ఉన్నప్పుడే ‘ఆవిడ లోకానికంతటికీ అమ్మ’, ‘నా తర్వాత నా కార్యాన్ని నెరవేర్చేది ఆమే’, తనకూ ఆమెకూ మధ్య భేదం లేదని చెప్పారు. రామకృష్ణ పరమహంస స్వర్గస్తులు అయిన 34 సంవత్సరాల వరకూ శారదాదేవి తన శిష్యులను కాచుకున్నారు. 1920, జులై 20న ఆమె కైవల్యాన్ని పొందారు. శారదాదేవి మరణించే కొద్ది రోజుల ముందుగా ఆమె చెప్పిన మాటలు, ఆమె పరిణతిని సూచిస్తాయి. ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. బదులుగా మీ లోపాలేమిటో గుర్తించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా సొంతం చేసుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో అంతా మీవారే అని గుర్తిస్తారు’  ఇంతకంటే అమూల్యమైన సలహాను ఏ మాతృమూర్తి మాత్రం ఇవ్వగలదు.  సమస్త నారీ లోకానికి   రాబోయే మూడు వేల సంవత్సరాలకు సరిపడా స్ఫూర్తినిస్తోంది ఆదర్శమూర్తి  శారదా మాత జీవితం.  

-  డి. సంధ్య