నేరడిగొండ, వెలుగు: ఓ డ్రైవర్ వద్ద రూ.15 వేలు డిమాండ్ చేసిన హోంగార్డ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టీ ఘాట్ సమీపంలో హైవేపై గత నెల 21న ఓ ఐచర్ వాహనానికి, ఓ బైక్‌కు ప్రమాదం జరిగింది. దీంతో ఐచర్ డ్రైవర్ తన హెహికల్ను హైవే పక్కనే ఉన్న ఓ దాబా వద్ద నిలిపాడు. ఖర్చుల కోసం డ్రైవర్‌కు తన యజమాని రూ.25 వేలు అకౌంట్లో వేయగా.. వాటిని డ్రా చేసి దాబాలో పనిచేస్తున్న సావంత్రం అనే వ్యక్తి వద్ద భద్రపరిచాడు.
అయితే వెహికల్‌ను విడుదల చేయాలంటే తనకు రూ.15 వేలు ఇవ్వాలని ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీస్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న జాదవ్ గోవింద్ డిమాండ్ చేశాడు. డబ్బులు ఉన్న సావంత్రంను వేధించాడు. దీంతో సావంతం గత నెల 25న రాత్రి నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హోంగార్డ్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్ తెలిపారు. నిందితుడిపై శాఖా పరమైన చర్ల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు.
