మణిపూర్​లో మళ్లీ అల్లర్లు.. పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు.. పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి

న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కుకీ తెగకు చెందిన వేర్పాటువాదులు మైతీ కమ్యూనిటీ గిరిజనులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ‘‘నాలుగు రోజుల్లో 40 మంది సాయుధ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి” అని సీఎం బీరెన్ సింగ్ ఆదివారం చేసిన కామెంట్లపై కుకీ తెగకు చెందిన వేర్పాటువాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ప్రకటన తర్వాత రాష్ట్రంలోని పలుచోట్ల అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. ఇప్పటి దాకా ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 80కి చేరింది.

25 మంది వేర్పాటువాదుల అరెస్ట్

కుకీ వేర్పాటువాదులు ఆదివారం సెరౌ, సుగుణు ఏరియాల్లోని ఇండ్లకు నిప్పుపెట్టారు. మొత్తం 8 గ్రామాలపై దాడులు చేశారు. తర్వాత అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్​నెట్ సేవలు నిలిపేశారు. ఈ క్రమంలోనే సోమవారం 25 మంది వేర్పాటువాదులను ఆర్మీ అరెస్ట్ చేసింది. వీరు ఇంఫాల్ ఈస్ట్ డిస్ట్రిక్​లోని భద్రతా బలగాలపై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఐదు 12 బోర్ డబుల్ బ్యారెల్ రైఫిళ్లు, 3 సింగిల్ బ్యారెల్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి పర్యటన

మణిపూర్​లో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా స్వయంగా రంగంలోకి దిగారు. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రమే ఆయన ఇంఫాల్​కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మణిపూర్​లో సాధారణ పరిస్థితి తీసుకొచ్చే విషయమై అక్కడి అధికారులతో మాట్లాడనున్నారు. మైతి, కుకీ తెగకు చెందిన లీడర్లతో కూడా వేర్వేరుగా చర్చలు జరిపే అవకాశాలున్నాయి.