
India-Us Tade Deal: గతవారం నుంచి అమెరికా అధ్యక్షుడు వరుసగా ప్రపంచ దేశాలతో ఒకదాని తర్వాత మరొకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పెద్ద డీల్ చర్చల్లో ఉన్నట్లు చెప్పటంతో అది ఈసారి ఇండియాతోనే అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి ముందే చైనా, యూకేలతో ట్రంప్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
ఇప్పటికే భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం కొంత మందితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. ట్రంప్ కొత్త వాణిజ్య ఒప్పందం గురించి ప్రకటన చేసిన సమయంలోనే ఈ వార్త రావటంతో అందరూ సానుకూల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరిగే నాలుగు రోజుల చర్చలలో, గోయల్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌లతో సమావేశం కానున్నారు.
గతవారం ఇండియా-పాక్ మధ్య ఘర్షణను నిలువరించేందుకు అమెరికా చేసిన కృషి ఫలించిందని ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన మాట వినకపోతే రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని చెప్పినట్లు సోమవారం వైట్ హౌస్ వెల్లడించింది. అలాగే ప్రస్తుతం తన అధికారులు ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు కూడా ట్రంప్ ఈ క్రమంలో వెల్లడించారు. త్వరలోనే పాకిస్థానుతో కూడా వ్యాపార చర్చలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొనబడింది.
ప్రస్తుత చర్చల్లో అమెరికా-ఇండియాలు రెండుదేశాలకు సానుకూలమైన ఒప్పందం దిశగా నడుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఈ ఏడాది అక్టోబరులో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ ప్రకటించబడవచ్చని వారు చెబుతున్నారు. అలాగే జూలై 9, 2025 వరకు అమెరికా భారత్ నుంచి దిగుమతులపై 26 శాతం సుంకాన్ని నిలిపివేసింది. అయితే ఇప్పటికే ప్రాథమిక 10 శాతం సుంకం మాత్రం ఇంకా అమలులోనే ఉంది.
ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను వ్యతిరేకిస్తూ భారత్ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించాలని విజ్ఞప్తి చేసింది. అయితే రానున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద సమయంలో దీనిపై కూడా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇండియా.. టెక్స్ స్టైల్, జ్యూవెలరీ, రత్నాలు, లెథర్ వస్తువులు, వస్త్రాలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు చర్చలు జరపనుందని తెలుస్తోంది.