రైతులకు హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం

రైతులకు హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం
  • ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసిన రైతు సంఘాలు
  • రిజల్ట్ ను బట్లే తదుపరి నిర్ణయం ఉంటుందని వెల్లడి 

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ, మిగతా డిమాండ్ల కోసం ఆందోళన కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు కూడా ఒప్పుకున్నాయి. శనివారం ఢిల్లీలోని సింఘూ బార్డర్ లో నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ‘‘నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. మీరు కోరినట్టుగానే అగ్రి చట్టాలను రద్దు చేశామని చెప్పారు. మిగతా డిమాండ్లను పరిష్కరించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వంతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేశాం” అని రైతు నేత యుధవీర్ సింగ్ చెప్పారు. ‘‘చర్చల్లో వచ్చే రిజల్ట్ పై ఈ నెల 7న మళ్లీ మీటింగ్ నిర్వహిస్తాం. చర్చలు సఫలమైతే బార్డర్ల నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది” అని తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేశామని బీకేయూ లీడర్ రాకేశ్ తికాయత్ వెల్లడించారు. కమిటీలో బల్బీర్ సింగ్ రాజేవాల్, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చారుణి, యుధవీర్ సింగ్, అశోక్ ధావలే ఉన్నారని చెప్పారు. నిరసనల సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసే వరకూ ఆందోళనలు ఆపేదిలేదని మీటింగ్​లో నిర్ణయించామని రైతు నేత దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి స్పష్టమైన సిగ్నల్ పంపామన్నారు.