మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యం

మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యం
  • హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సమస్మరణ దినం

హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని  హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని ఆయన కితాబిచ్చారు. శాంతి  భద్రతలు అదుపు లో ఉంటే ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. గోశామహల్  స్టేడియంలో జరిగిన  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ( పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో  హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. 1959 లో   బార్డర్ లో చైనాతో జరిగిన పోరాటంలో 10 మంది పోలీసులు వీర మరణం పొందారని, అమరవీరులైన పోలీసులను స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 264 మంది పోలీసులు వీర మరణం పొందారని చెప్పారు. గణేష్ ఉత్సవాలు,  నిమజ్జనం, బోనాలు, బతుకమ్మ వేడుకల్లో  పోలీసుల పని తీరు ప్రశంస నీయం అన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం: డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాదు సిటీలో 6 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సమాజ భద్రత కోసం పోలీసులు నిరంతరం నూతన టెక్నాలజీ తో కృషి చేస్తున్నారని వివరించారు. నేర నివారణ శాంతి పరిరక్షణలో సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. 
సైబర్ నేరాల నియంత్రణకు ఐ 4సి తో రక్షణ కల్పిస్తున్నాం
మొబైల్ ఫోన్ల వాడకం పెరిగాక సైబర్ నేరాలు పెరుగుతున్నాయని.. వీటిని కంట్రోల్ చేసి అరికట్టేందుకు 4సితో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పోలీసుల కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మహిళలు, పిల్లల,భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.