హోం ట్యూషన్స్ను జీవనాధారంగా మార్చుకున్న నారాయణి

హోం ట్యూషన్స్ను జీవనాధారంగా మార్చుకున్న నారాయణి

నారాయణి సొంతూరు కేరళలోని కాసరగోడ్‌‌. బాగా చదువుకొని టీచర్‌‌‌‌ కావాలనేది ఆమె కోరిక. కానీ, ఆ కోరికకు చిన్న వయసులో జరిగిన పెండ్లి అడ్డుపడింది. పెండ్లి తరువాత భర్త సాయంతో 1971లో పదో క్లాస్‌‌ పరీక్ష రాసి పాస్‌‌ అయింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. చదువు మీద ఉన్న ఇష్టాన్ని వదల్లేక పదిహేనేండ్ల వయసునుంచే ట్యూషన్స్‌‌ చెప్పడం మొదలుపెట్టింది. అలా తన పదిహేనేండ్ల వయసులో ఒకరిద్దరు స్టూడెంట్స్‌‌తో మొదలైంది ఆమె టీచింగ్‌‌ జర్నీ, భర్త అనారోగ్యం వల్ల అదే ఆమె జీవనాధారం అయింది. దాంతో పిల్లల ఇండ్లకి వెళ్లి హోం ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. అలా నారాయణి ‘ట్యూషన్‌‌ టీచర్‌‌‌‌’గా ఆ ఊళ్లో ఫేమస్‌‌ అయింది. 

అనారోగ్య సమస్యల వల్ల
చదువు ఆపేసి భర్తతో పుస్తకాలు తెప్పించుకొని చదివేది నారాయణి. అలా ఇంగ్లీష్‌‌, హిందీ, మలయాళం, సంస్కృతం నేర్చుకుంది. శ్రద్ధతో నేర్చుకున్న ఆ భాషలే ఆమెకు ఆధారమయ్యాయి. ఆ చదువుతోనే ఇప్పుడు పదో క్లాస్‌‌ వరకు ట్యూషన్లు చెప్తోంది. ట్యూషన్స్‌‌ చెప్పడం కూడా అంత ఈజీగా ఏం కాలేదు. ‘ట్యూషన్స్‌‌ చెప్తామ’ని ఇంటిముందు ఒక బోర్డ్‌‌ తగిలించింది. సిటీకి ఇల్లు దూరంగా ఉండటంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ట్యూషన్‌‌కి పంపడానికి వెనకాడారు. అలా ఇంటికి వచ్చే పిల్లల సంఖ్య రోజురోజుకి తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలా? అని ఆలోచించి తనే పిల్లల ఇండ్లకి వెళ్లి హోం ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. రోజూ ఉదయం 4.30 గంటలకు నిద్ర లేస్తుంది. ఇంటి పని చేసుకొని బయటికి వెళ్తుంది. మొదటి ట్యూషన్‌‌ క్లాస్‌‌ ఉదయం ఆరున్నరకు తీసుకుంటుంది. అలా తొమ్మిది గంటల వరకు చెప్పి ఇంటికెళ్తుంది. మళ్లీ సాయంత్రం ఐదు గంటలనుంచి తొమ్మిది గంటల వరకు ట్యూషన్‌‌ క్లాసులు చెప్తుంది. ట్యూషన్స్‌‌ చెప్పడానికి రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తుంది. కొవిడ్‌‌ టైంలో కూడా పిల్లల ఇండ్లకి వెళ్లే ట్యూషన్లు చెప్పేది. ‘మీ కోసం మేమంతా కలిసి మొబైల్‌‌ కొనిస్తాం. ఆ ఫోన్‌‌తో ఆన్‌‌లైన్ క్లాస్‌‌లు చెప్పండి. ఈ టైంలో రిస్క్‌‌ ఎందుక’ని పిల్లల తల్లిదండ్రులు అన్నా వినలేదు. ‘ఆన్‌‌లైన్‌‌ చదువు పిల్లలకు ఏం నేర్పదు. పైగా దానివల్ల మొబైల్‌‌కి ఎక్కువ అలవాటు పడతారు. వచ్చింది మర్చిపోతారు’ అనేది నారాయణి. పుస్తకాల్లో ఉన్న పాఠాలే కాదు, అందరితో ఎలా ఉండాలి? జీవితంలో ఎలా పైకి రావాలి? గోల్స్ ఎలా పెట్టుకోవాలనే విష యాల గురించి కూడా చెప్తుంటుంది నారాయణి.
‘పిల్లలతో గడుపుతున్నందుకు సంతోషంగా ఉంటుంది. నేను ట్యూషన్‌ చెప్పిన పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు. వాళ్లు నన్ను గుర్తు పట్టి పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు. ఎలాగైనా సొంత ఇల్లు కొనుక్కోవాలి’ అని చెప్పింది నారాయణి.