
- గుండె ఆపరేషన్లలో కీలక ముందడుగు.. హైదరాబాద్ నిమ్స్లో హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంకు
- హ్యూమన్ హార్ట్ వాల్వ్‌లు సేకరించి అడ్వాన్స్‌డ్ ప్రిజర్వేషన్
- ప్రస్తుతం మెటల్, జంతువుల వాల్వ్‌లు ఉపయోగిస్తున్న డాక్టర్లు
- స్టోరేజ్ బ్యాంకుతో అందుబాటులోకి రానున్న నేచురల్ వాల్వ్‌లు
- ఈ నెలలోనే ప్రారంభించడానికి అధికారుల సన్నాహాలు
- తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య రంగంలో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నది. అక్టోబర్ లో ప్రారంభించేందుకు నిమ్స్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బ్రెయిన్ డెడ్, సర్క్యులేటెడ్ డెత్ అయిన దాతల నుంచి సేకరించిన హార్ట్ వాల్వ్స్‌ను శుద్ధి చేసి, అత్యంత తక్కువ టెంపరేచర్ల వద్ద నిల్వ చేసే ఈ బ్యాంక్, క్లిష్టమైన గుండె ఆపరేషన్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. ముఖ్యంగా.. ఆర్టిఫిషియల్ వాల్వ్‌లు పనిచేయని పరిస్థితుల్లో గుండెకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా సోకిన రోగులకు ఈ నేచురల్ వాల్వ్స్ ప్రాణదాతగా నిలవనున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 6 ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వాల్వ్ బ్యాంకులు ఉండగా, త్వరలో నిమ్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నది.
ఈ వాల్వ్ స్టోరేజీ బ్యాంకు అందుబాటులోకి వస్తే.. లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యం.. ఇతర ప్రైవేట్ బ్యాంకులపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతోనే పేదలకు సైతం చేరువ కానున్నది. నిమ్స్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా గుండె సంబంధ రోగులు వస్తుంటారు.
ఈ వాల్వ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తే, తక్కువ ఖర్చుతో..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వాల్వ్స్‌కు, పుట్టుకతోనే గుండె సమస్యలున్న చిన్నారులకు హోమోగ్రాఫ్ట్స్ ప్రాణదాతగా నిలుస్తాయని నిమ్స్ కార్డియాలజీ నిపుణులు చెబుతున్నారు.
హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందంటే?
మన గుండెలోని వాల్వ్స్ పాడైతే రక్తం సరైన దిశలో ప్రవహించక, ఆయాసంతో ప్రాణాల మీదికి వస్తుంది. ఇలాంటి వారికి వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. హోమోగ్రాఫ్ట్ అంటే ఒకే జాతి (మానవులు) జీవి నుంచి సేకరించిన కణజాలం. బ్రెయిన్ డెడ్, సర్క్యులేటెడ్ డెత్(చనిపోయి 24 గంటల లోపు అయిన వ్యక్తి నుంచి) లాంటి దాతలనుంచి జీవన్‌దాన్ అవయవదాన కార్యక్రమాల ద్వారా మంచి కండిషన్‌లో ఉన్న హార్ట్ వాల్వ్స్‌ను సేకరిస్తారు.
వీటిని ప్రత్యేకమైన యాంటీబయాటిక్ ద్రావణాల్లో పెట్టి, బ్యాక్టీరియా, వైరస్ లేకుండా పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత క్రయోప్రిజర్వేషన్ అనే అత్యాధునిక పద్ధతిలో మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో ఉంచి ఘనీభవింపజేస్తారు. ఇలా చేయడం వల్ల ఈ వాల్వ్స్ రెండు నుంచి మూడేండ్లపాటు చెడిపోకుండా సురక్షితంగా ఉంటాయి. రోగికి అవసరమైనప్పుడు ఈ బ్యాంక్ నుంచి వాల్వ్‌ను తీసి, సిద్ధం చేసి సర్జరీ చేస్తారు.
ఆర్టిఫిషియల్ వాల్వ్స్‌తో నష్టాలు.. హోమోగ్రాఫ్ట్స్‌తోనే మేలు
ప్రస్తుతం హోమోగ్రాఫ్ట్స్ లభ్యత తక్కువగా ఉండటంతో చాలామంది రోగులు ఆర్టిఫిషియల్ (మెకానికల్) వాల్వ్స్, జంతువుల నుంచి సేకరించిన బయోప్రాస్థటిక్ వాల్వ్స్‌ను అమర్చుకుంటున్నారు. వీటి ధర రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల పైనే ఉండగా, సర్జరీ ఖర్చుతో కలిపి మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు అవుతుంది. కానీ వీటితో అనేక నష్టాలున్నాయి. మెకానికల్ వాల్వ్స్ అమర్చుకున్న వారు జీవితాంతం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు బ్లడ్ థిన్నర్ మందులు కచ్చితంగా వాడాలి. దీనివల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. మందులు సరిగ్గా వాడకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
అలాగే, పిల్లలకు అమర్చిన ఆర్టిఫిషియల్ వాల్వ్స్ వారు పెరిగే కొద్దీ వారితో పాటే పెరగవు. దీంతో మళ్లీ సర్జరీలు తప్పవు. ఇక బయోప్రాస్థటిక్ వాల్వ్స్ సాధారణంగా 10 నుంచి-15 సంవత్సరాలే పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్లీ మార్చాల్సి వస్తుంది, ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా ఉంటుంది. అయితే హోమోగ్రాఫ్ట్స్‌కు ఈ నష్టాలు లేవు. బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు. ఇన్ఫెక్షన్లు తక్కువ. పిల్లల పెరుగుదలకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి.
ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది
గుండె సంబంధిత ఆపరేషన్లకు నిమ్స్ కేరాఫ్‌గా మారింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు నిమ్స్‌లో చికిత్స చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడికి రెఫరల్స్ వస్తున్నాయి. పుట్టుకతో వాల్వ్స్ పాడైపోయిన పిల్లలు, ఇన్ఫెక్షన్ సోకిన పెద్దల కేసులు చాలా వస్తుంటాయి. చాలామందికి హోమోగ్రాఫ్ట్ వాల్వ్స్ లభించవు. ఇప్పుడు ఈ వాల్వ్ స్టోరేజ్ బ్యాంకు అందుబాటులోకి వస్తే దాదాపు అందరికీ హోమోగ్రాఫ్ట్ వాల్వ్‌లు అందుబాటులోకి వస్తాయి.
ఈ సేవల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ హోమోగ్రాఫ్ట్ వాల్వ్స్, సర్జరీ లక్షల ఖర్చుతో కూడుకున్నవి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వీటి ఖర్చంతా భరిస్తుంది. ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా వాల్వ్స్, సర్జరీలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఫ్రీగా అందనున్నాయి. ఆ వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.
– డాక్టర్ అమరేశ్ రావు, కార్డియో థొరాసిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ, నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్