మధ్యప్రదేశ్‌‌లో సెక్స్​ స్కాండల్ కలకలం

మధ్యప్రదేశ్‌‌లో సెక్స్​ స్కాండల్ కలకలం
  •                హీరోయిన్లు, స్టూడెంట్స్​తో నేతలు, అధికారులకు హనీ ట్రాప్
  •                 టార్గెట్​ లిస్టులో గవర్నర్​, మాజీ సీఎం పేర్లు
  •                 4వేల వీడియో, ఆడియో క్లిప్పులు.. వాటితో బ్లాక్​మెయిల్

మధ్యప్రదేశ్‌‌ లో భారీ సెక్స్​ స్కాండల్​ బయటపడింది. కాలేజ్​ అమ్మాయిలు, బాలీవుడ్​ బీ గ్రేడ్​ హీరోయిన్లతో రాజకీయ నేతలు, అధికారులను హనీట్రాప్​ చేసి, ఆపై బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు ల్యాప్​ టాప్​లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిలో 4వేలకు పైగా సెక్స్​ వీడియోలు, ఆడియోలు, చాటింగ్​ స్క్రీన్​షాట్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల దగ్గరున్న టార్గెట్​ లిస్టులో గవర్నర్​, మాజీ సీఎంల పేర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్​ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) సంజీవ్ షామి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్​ బృందంతో ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ బట్టబయలుచేసింది. వీడియోల ఆధారంగా వాటిని ఎక్కడి నుంచి అప్​లోడ్ చేశారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సంజీవ్​ తెలిపారు. కేసుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

సీక్రెట్​ వీడియోలతో అధికారుల్ని బ్లాక్​మెయిల్​ చేస్తున్నారన్న ఆరోపణలపై భోపాల్​కు చెందిన శ్వేతా స్వప్నిల్ జైన్‌‌(48), ఆర్తీ దయాల్​(34), శ్వేతా సునీల్​ జైన్​(39), బర్ఖా సోనీ(35) అనే నలుగురు మహిళలతోపాటు వాళ్ల కారు డ్రైవర్ ఓం ప్రకాశ్​ కోరి(34)​, 18 ఏండ్ల కాలేజ్​ స్టూడెంట్​ను సిట్​ బృందం బుధవారం అరెస్టుచేసింది. శ్వేతా స్వప్నిల్​ జైన్​ సూత్రధారిగా పనిచేసే ఈ టీమ్​.. భోపాల్​, ఇండోర్​ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ముఖ్య శాఖల అధికారులే టార్గెట్​గా శ్వేతా జైన్ హనీట్రాప్ చేయిస్తున్నారని తేలింది. ముందుగా టార్గెట్ చేసుకున్న వ్యక్తుల్ని పరిచయం చేసుకుని, ఆ తర్వాత ఫైవ్​స్టార్​ హోటల్​ లేదా గెస్ట్​హౌస్​​కు పిలిపించి, వాళ్లతో అమ్మాయిలను పంపుతారు. లోపల జరుగుతున్న తతంగాన్ని స్పై కెమెరాలు లేదా మొబైల్స్​తో సీక్రెట్​గా వీడియో తీసి భద్రంగా దాచుకుంటారు. నేతలు, అధికారులు కోరుకుంటే బాలీవుడ్​ హీరోయిన్లతో టూర్లు కూడా ఏర్పాటుచేయిస్తారు.  శ్వేతా జైన్​ తన భర్త స్వప్నిల్​తో కలిసి ఓ ఎన్​జీవోకు ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకునేందుకే ఈ రాకెట్​ను నడిపిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్​ మాజీ సీఎం ఓ బిల్డింగ్​ను గిఫ్ట్​గా ఇచ్చారని శ్వేతా జైన్​ వెల్లడించినట్లు తెలిసింది. సెక్స్​ స్కాండల్​ వ్యవహారంలో కమల్​నాథ్​ సర్కార్​ కేవలం బీజేపీ నేతల్ని టార్గెట్​ చేసిందన్న ఆరోపణలపై కాంగ్రెస్​ అధికార ప్రతినిధి కేకే మిశ్రా స్పందిస్తూ, హనీ ట్రాప్​లో చిక్కుకున్న నేతల్లో 80 శాతం బీజేపీ వాళ్లుంటే, 20 శాతం మంది కాంగ్రెస్​ నేతలున్నారని చెప్పారు.