రుణమాఫీపై.. చిగురిస్తున్న ఆశలు

రుణమాఫీపై.. చిగురిస్తున్న ఆశలు
  • తీరనున్న రైతుల బ్యాంకు కష్టాలు
  • వనపర్తి జిల్లాలో 88,948 మందికి మేలు
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ.2,736 కోట్ల మాఫీ
  • వివరాల సేకరణలో నిమగ్నమైన ఆఫీసర్లు

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ బాకీలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాలతో పంటలు సరిగా పండకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తీసుకున్న రైతులు వాటిని కట్టలేక, తిరిగి రుణం పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ప్రకటనతో మరో రెండు నెలల్లో తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులు తమ రుణాలను రెన్యువల్​ చేసుకోకుండా మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు బ్యాంకుల వారీగా రైతులు తీసుకున్న లోన్లు, వడ్డీ ఎంత ఉందనే వివరాలను తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తే వనపర్తి జిల్లాలో 88,948 మంది రైతులకు రూ.340 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి. రుణమాఫీకి సంబంధించిన  విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. 

గతంలో రుణమాఫీ అయినా!

గత ప్రభుత్వం రూ.లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేసింది. ముందుగా రూ.50 వేల లోపు వారికి, తరువాత రూ.99 వేల వరకు రుణమున్న వారికి మాఫీ చేసింది. బ్యాంకులు ఈ డబ్బులను బకాయి కింద జమ చేసుకున్నాయి. కొందరి రుణాలు రూ.లక్ష వరకు మాఫీ కాగా, వడ్డీ పెరగడంతో  బకాయి పూర్తిగా క్లియర్​ కాలేదు. వడ్డీ కట్టాల్సిందేనంటూ బ్యాంకులు స్పష్టం చేశాయి. దీంతో చేసేది లేక కొందరు రైతులు మిగిలిన డబ్బు చెల్లించగా, కొందరు రెన్యువల్​ చేసుకోకుండా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ పొందిన వారిని మినహాయించి, తాజాగా ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందా? లేక అందరికీ వర్తింపజేస్తారా? అనే చర్చ జరుగుతోంది. 

అందరికీ రుణమాఫీ చేస్తే 2023లో రుణమాఫీ పొందిన వారికి, మిగిలిన రూ.లక్ష మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఏప్రిల్​ 2019 నుంచి గత ఏడాది డిసెంబరు 10 వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు​జిల్లాలో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇప్పటికే బ్యాంకర్లు రెడీ చేసుకున్నారు. గత సర్కారు మాదిరిగా కాకుండా ఒకేసారి రుణమాఫీ వర్తింపజేస్తే, తమకు రుణభారం తప్పుతుందని రైతులు ఆశగా 
ఎదురుచూస్తున్నారు.

అప్పు రెండింతలైంది..


గత సర్కారు రుణమాఫీ ప్రకటించే సమయానికి బ్యాంకులో రూ.60వేల అప్పు ఉండే. అప్పటి నుంచి మాఫీ అయితదని ఎదురుచూస్తిమి. గత ఏడాది ఆగస్టు 19న మాఫీ అన్నారు. బ్యాంక్​కు పోయి ఎంత మాఫీ అయిందని అడిగితే, మాఫీ ఎక్కడిది. ఇంకా మాకే రూ.33 వేలు బకాయి ఉన్నావన్నారు.
- బాలమ్మ, పెద్దమందడి

అయిదేండ్ల వడ్డీ అడుగుతున్రు..


2018లో బ్యాంక్​లో  రూ.60,669 వ్యవసాయ రుణం తీసుకున్నా. దీనికి గత ఏడాది ఆగస్టు నాటికి వడ్డీ రూ.46,486 కట్టాలని, అసలు, వడ్డీ కలిపి రూ.1,07,155 అయ్యిందన్నారు. 2018 డిసెంబర్​ నుంచి వడ్డీ కట్టమంటున్నారు.  
- రాములు, వనపర్తి