చెల్లి కోసం హాస్పిటల్​ కట్టిండు.. కరోనా కోసం సర్కారుకు ఇచ్చిండు

చెల్లి కోసం హాస్పిటల్​ కట్టిండు.. కరోనా కోసం సర్కారుకు ఇచ్చిండు
  • పెద్ద మనసు చాటుకున్న బెంగాల్​ క్యాబ్​ డ్రైవర్​

కోల్​కతా: మహ్మద్​ సైదుల్​ లష్కర్.. బెంగాల్​కు చెందిన ఓ క్యాబ్​ డ్రైవర్. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన చెల్లి కోసం.. నాలుగు ట్యాక్సీలు, భార్య బంగారు నగలు అమ్మి ఓ హాస్పిటల్​ కట్టించాడు. ఇప్పుడు కరోనాతో బెంగాల్​ అల్లాడుతుండటంతో 50 పడకల ఆ ఆస్పత్రిని క్వారంటైన్​ సెంటర్​గా మార్చేందుకు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

సొంత స్థలంలో.. క్యాబ్​లను అమ్మి హాస్పిటల్​నిర్మాణం
2004లో లష్కర్​ చెల్లెలు మరుఫా న్యుమోనియాతో చనియింది. దీంతో ఆమె లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో తన నాలుగు ట్యాక్సీలు, భార్య నగలు అమ్మి.. తాను ఎప్పుడో కొన్న స్థలంలో 50 పడకల హాస్పటల్​ కట్టాడు. బరువిపూర్​ జిల్లా పున్రి గ్రామంలో ఈ హాస్పిటల్​ నిర్మించాడు. రోజు ఇక్కడ 300 మంది వరకూ పేషెంట్లకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. ‘‘నా చెల్లెలికి గుర్తుగా నేను ఎప్పుడో కొన్న స్థలంలో ఈ హాస్పిటల్​ కట్టా. ఇందుకోసం నా భార్యా, నేను తిండి కూడా తినకుండా డబ్బులు కూడబెట్టాం. ప్రతి ఇటుకను దగ్గరుండి మరీ మేమే కట్టించాం. కానీ కరోనా పై పోరాటం కోసం ఏమైనా చేయాలని భావించాను. అందుకే ప్రభుత్వానికి అవసరమైతే క్వారంటైన్​ సెంటర్​గా మార్చేందుకు మా హాస్పిటల్​ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం”అని లష్కర్​ చెప్పాడు.

హాస్పిటల్​ ఎంప్లాయిస్​కు కరోనాపై ట్రైనింగ్
ఇప్పటికీ ఆ ఆస్పత్రికి అవసరమైన లేటెస్ట్​ మెడికల్​ ఎక్విప్​మెంట్​ కోసం నిధులు సమీకరించేందుకు లష్కర్​ ప్రయత్నిస్తున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో తన ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేశాడు. “నా భార్య, స్నేహితులు, బంధువులతో చర్చించిన తర్వాత నా హాస్పిటల్​ను క్వారంటైన్​ సెంటర్​గా మార్చాలని జిల్లా అధికారులను కలిశాను. ఈ ప్రతిపాదనను హెల్త్​ డిపార్ట్​మెంట్​కు, సీఎంవోకు పంపుతామని వారు చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది” అని తెలిపాడు. ఇప్పటికే స్టేట్​ గవర్నమెంట్ రిలీఫ్​ ఫండ్​కు రూ.5 వేలు విరాళం ఇచ్చిన లష్కర్​.. తన హాస్పిటల్​లోని పది మంది పారామెడిక్​ ఎంప్లాయిస్​కు కరోనా కేసులను హ్యాండిల్​ చేయడంపై ట్రైనింగ్​ ఇస్తామని చెప్పాడు.