
- రెవెన్యూ కోసం ఇతర మార్గాలు చూసుకోవలంటున్న హాస్పిటల్ వర్గాలు
- మెజార్టీ ప్రజలపై ట్యాక్స్ ఎఫెక్ట్ ఉండదంటున్న ప్రభుత్వం
బిజినెస్ డెస్క్, వెలుగు: ఖర్చెక్కువని ఇప్పటికీ హాస్పిటల్స్‌కు వెళ్లడానికి ఆలోచించే పేషెంట్లు దేశంలో చాలా మందే ఉన్నారు. హెల్త్‌కేర్ సెక్టార్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ రూమ్స్‌పై జీఎస్‌టీ వేయడం, ఈ ట్యాక్స్ సిస్టమ్ కిందకు హెల్త్‌కేర్ సెక్టార్‌ను తీసుకురావడంతో పేషెంట్ల ఆర్థిక కష్టాలు మరింత పెరుగుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. రోజువారి రెంట్ రూ. 5 వేలకు పైన ఉన్న ఐసీయూ కాని బెడ్లపై 5 శాతం జీఎస్‌టీ విధించాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. హాస్పిటల్స్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందే వీలులేకుండా చేయడంతో ఈ ట్యాక్స్ భారాన్ని పేషెంట్లకు హాస్పిటల్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. దీంతో పేషెంట్ల మెడికల్ ఖర్చు మరింత పెరుగుతుంది. హాస్పిటల్ రూమ్స్‌పై జీఎస్‌టీ వేయడాన్ని ప్రతిపక్షాలు, హాస్పిటల్స్ తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ సంపాదించాలనుకుంటే ఇతర మార్గాలు చాలా ఉన్నాయని, ట్యాక్స్ వేయాలనుకుంటే హెల్త్‌కేర్ సెక్టార్ చివరిది కావాలని చెబుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు జీఎస్‌టీ నుంచి మినహాయింపులు పొందుతున్న హెల్త్‌కేర్ సెక్టార్, తాజాగా ఈ ట్యాక్స్ సిస్టమ్ కిందకు వచ్చింది. సాధారణంగా పేషెంట్ మెడికల్ ఖర్చులో 10–12 శాతం హాస్పిటల్ బెడ్ ఖర్చులే ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్‌ప్రెసిడెంట్ మిత్రీ మాచెర్ల అన్నారు. హాస్పిటల్స్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందే వీలు లేకపోవడంతో ఈ ట్యాక్స్ భారాన్ని పేషెంట్లకు బదిలీ చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మెడికల్ ఖర్చులను వివిధ ప్యాకేజిల కింద హాస్పిటల్స్ ఆఫర్ చేస్తున్నాయని, ఇక నుంచి హాస్పిటల్ రూమ్స్‌పై వేసే ఛార్జీలను సపరేట్‌గా చూపిస్తాయన్నారు.
ఇది పేషెంట్లపైన ట్యాక్స్..
‘ఉదాహరణకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ రోజుకి 200 మందికి సేవలందిస్తుందని అనుకుందాం. వీళ్లకు కేటాయించే రూమ్‌ల రెంట్ రూ. 6,000 ఉంటే, ఒక రోజులో ట్యాక్స్ కింద రూ. 60 వేలు చెల్లించాలి. అదే ఏడాదికి ఈ హాస్పిటల్‌పై రూ. 2.19 కోట్ల ట్యాక్స్ పడుతుంది’ అని ఎన్‌ఏ షా అసోసియేట్స్ నరేష్ సేత్ వివరించారు. హాస్పిటల్స్ ఈ అదనపు ట్యాక్స్ భారాన్ని భరించవని, కచ్చితంగా పేషెంట్లకు బదిలీ చేస్తాయని అన్నారు. నారాయణ హెల్త్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జే సంధ్య ఈ ట్యాక్స్ అంశంపై స్పందించారు. తప్పక హాస్పిటల్‌కు వచ్చేవారితో పాటు, ఎక్కువగా బాధపడేవారిపైన ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. ‘హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇంకా విస్తరించలేదు. చాలా మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ కోసం నగలు అమ్ముకోవడమో లేదా ప్రాపర్టీ అమ్ముకోవడమో చేస్తున్నారు. ప్రభుత్వం రెవెన్యూ సంపాదించుకోవడానికి 100 మార్గాలున్నాయి. వారు చివరిగా టచ్ చేయాల్సిన సెక్టార్ హెల్త్‌కేర్. మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అలానే ఉండాలి’ అని సంధ్య అభిప్రాయపడ్డారు. ఈ ట్యాక్స్ భారాన్ని పేషెంట్లకు బదలాయిస్తారా? అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఈ ట్యాక్స్ భారాన్ని పేషెంట్లకు బదలాయించాలనే ప్రభుత్వం కోరుకుంటోందని, లేకపోతే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడానికి వీలు కలిపించేదని వివరించారు. దేశంలో ట్యాక్స్ విధానాలు అసమర్ధంగా ఉండడం, ప్రభుత్వ స్కీమ్‌ల నుంచి రియంబర్స్‌మెంట్స్ తొందరగా రాకపోవడం వంటి కారణాలతో హాస్పిటల్స్ మార్జిన్స్ తగ్గుతున్నాయని ఆమె చెప్పారు. హెల్త్‌కేర్ ఖర్చులను తగ్గించడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నోళ్లు చాలా తక్కువ..
దేశంలోని 75 శాతం మంది హెల్త్‌కేర్ సర్వీస్‌ల కోసం సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నారని ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పెద్దగా విస్తరించలేదని వివరించింది. కఠినమైన రెగ్యులేటరీ పాలసీలు లేకపోవడం, ప్రభుత్వం హెల్త్ కేర్ కోసం చేసే ఖర్చులు తక్కువగా ఉండడంతో దేశ హెల్త్‌కేర్ సెక్టార్ అధ్వాన్నంగా ఉందని అన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 42 కోట్ల మందికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వాస్తవంలో ఈ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అంచనా. దేశంలోని 51.47 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి కింద ఉన్నారని, ఇందులో 66.62 శాతం మంది ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల ద్వారా కవరేజి పొందుతున్నారని నీతి ఆయోగ్ 2021లో రిలీజ్ చేసిన ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వాస్తవానికి ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్కీమ్‌ల కింద హాస్పిటల్ బెడ్ పొందాలంటే పేషెంట్ చాలా కష్టపడాల్సి వస్తోంది.
మెజార్టీ ప్రజలపై ఈ ట్యాక్స్ ప్రభావం తక్కువ
ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా హాస్పిటల్ ఫీజులను చెల్లించడానికి పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. హార్ట్‌లో స్టెంట్ వేయడం వంటి సీరియస్ ప్రాబ్లెమ్స్‌కి అయితే సొంతంగా డబ్బులు కట్టాలని కోరుతున్నారని పేషెంట్లు చెబుతున్నారు. మరోవైపు చాలా ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం హాస్పిటల్ బెడ్ ఛార్జీలను చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఇందులో కొంత భాగాన్ని తిరిగి పేషెంట్లతోనే కట్టిస్తున్నాయి. కాగా, హెల్త్‌కేర్ సర్వీస్‌లు అందుబాటు ధరల్లోనే దొరకడంపై ప్రభుత్వం విధించిన జీఎస్‌టీ ఎటువంటి ఎఫెక్ట్ చూపించదని రెవెన్యూ సెక్రెటరీ తరుణ్ బజాజ్ అన్నారు. మెజార్టీ ప్రజలపై ఈ ట్యాక్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ హాస్పిటల్ ఖర్చులు పెరిగితే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఇన్‌ఫ్లేషన్ పెరగడంతో పాలు నుంచి వంటనూనె వరకు వివిధ ప్రొడక్ట్‌లను కొనుక్కోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న ప్రజలపై తాజాగా పెరిగిన హాస్పిటల్ ఖర్చులు మరింత భారంగా మారతాయనడంలో సందేహం లేదు.