18 నెలలుగా జీతాల్లేవ్!..సమ్మె బాటలో కార్మికులు

18 నెలలుగా జీతాల్లేవ్!..సమ్మె బాటలో కార్మికులు
  •     ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్ల ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, పార్ట్​ టైం వర్కర్ల ఆకలి కేకలు 
  •     సమ్మె బాటలో కార్మికులు.. పస్తులుంటున్న విద్యార్థులు!
  •     కొన్ని హాస్టళ్లలో స్టూడెంట్సే వండుకున్న పరిస్థితి
  •     పరీక్షల టైంలో అవస్థలు పడుతున్న పిల్లలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్ల ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, పార్ట్​ టైం వర్కర్లకు నెలల తరబడి జీతాలు అందడం లేదు. దీంతో వారు కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  అప్పులు చేసి ఆశ్రమ స్కూళ్లు, గిరిజన హాస్టళ్లు, పోస్టుమెట్రిక్​ హాస్టళ్లలోని స్టూడెంట్స్​కు కడుపు నిండా అన్నం పెడుతూ తాము పస్తులుంటున్నామని వారు వాపోతున్నారు.

ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మూడు రోజులుగా సమ్మెబాట పట్టారు. దీంతో పరీక్షల టైంలో విద్యార్థులు ఖాళీ కడుపులతో ఇబ్బంది  పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల విద్యార్థులే వంటలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లు, గిరిజన హాస్టళ్లు, పోస్టు మెట్రిక్​ హాస్టళ్లలో ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్​, డైలీ వేజ్, పార్ట్​టైం పద్ధతిలో వర్కర్స్​పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పోస్ట్​ మెట్రిక్​ హాస్టళ్లలో దాదాపు 618 మంది, ఆశ్రమ పాఠశాలల్లో 3,070 మంది, హాస్టళ్లలో దాదాపు 400 మంది వర్కర్లు​ పనిచేస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 30 పోస్ట్​మెట్రిక్​హాస్టళ్లలో దాదాపు 100 మంది, దాదాపు 70 ఆశ్రమ స్కూళ్లలో 400 మంది పనిచేస్తున్నారు. హాస్టళ్లు​, ఆశ్రమ స్కూళ్లలో పర్మినెంట్​ కార్మికులు నామమాత్రంగానే ఉన్నారు.

కాంట్రాక్ట్​, పార్ట్​ టైం, డైలీ వేజ్​పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులే హాస్టళ్లు, ఆశ్రమ స్కూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పోస్ట్​ మెట్రిక్​ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లకు దాదాపు 18 నెలలుగా, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లకు ఏడు నెలలుగా జీతాలను చెల్లించాల్సి ఉంది.  జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టామని కార్మికులు గుర్తు చేశారు.

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయించుకుందని వాపోతున్నారు. నెలల తరబడి జీతాలు లేకుండా ఎలా బతకాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు. 

వండుకోవాలా.. చదువుకోవాలా? 

ఇంటర్మీడియట్​ ఎగ్జామ్స్​ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​ మొదలు కానున్నాయి. అయితే ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్లు, పోస్ట్​మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్స్​ మంగళవారం నుంచి సమ్మె బాట పట్టడంతో స్టూడెంట్స్​ ఇబ్బంది పడుతున్నారు. పలు పోస్ట్​ మెట్రిక్​ హాస్టళ్లలో స్టూడెంట్సే వంట చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్​ వేళల్లో చదువుకోవాలో, వంట వండుకోవాలో అర్థం కాక విద్యార్థులు సతమతమవుతున్నారు. 

నిరసనలు.. వినతులు.. 

  • వర్కర్స్​ సమ్మె చేస్తుండడంతో స్టూడెంట్స్​ సరిగా అన్నం తినడం లేదని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్​యూ నేతలు గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మను మంగళవారం ఇల్లెందులో అడ్డుకొని నిరసన తెలిపారు. వంట వండే వారు లేకపోవడంతో కొందరు పస్తులుంటుంటే..  మరి కొందరు హోటళ్లలో తింటున్నారని వాపోయారు. 
  •     హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అలకు వినతి పత్రం అందజేశారు. 
  •     వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని సీఐటీయూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి స్పష్టం చేశారు.