డాక్టర్ల ఖాళీలు నింపకుంటే ఆరోగ్య తెలంగాణ ఎట్లయితది?

డాక్టర్ల ఖాళీలు నింపకుంటే ఆరోగ్య తెలంగాణ ఎట్లయితది?

ఏ దేశ ప్రగతికైనా మానవ వనరులే కీలకం. వాటిని సమర్థవంతంగా తీర్చిదిద్దేవి విద్య, వైద్య రంగాలే. ప్రస్తుతం కీలకమైన విద్య, వైద్య రంగాలన్నీ ప్రైవేటు, కార్పొరేట్​ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిపోయాయి. ముఖ్యంగా వైద్య రంగంలో కార్పొరేట్​ కల్చర్​ పెరిగిపోయి.. సామాన్యులు దోపిడీకి గురవుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా వేలు, లక్షల రూపాయలను ప్రైవేట్​ హాస్పిటల్స్ దండుకుంటున్నాయి. గతేడాది కరోనా విజృంభించినప్పుడు కార్పొరేట్​ ఆస్పత్రుల దోపిడీకి ఎంతో మంది బలైపోయారు. వాటిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ప్రభుత్వ దవాఖాన్లను, హెల్త్​ సెక్టార్​ను అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. డాక్టర్లు, హెల్త్​ సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.

ఏ దేశం లేదా రాష్ట్రంలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే దానికి సూత్రధారులు డాక్టర్లు, హెల్త్​ సిబ్బందే. వీరంతా 24 గంటలు నిస్వార్థంగా సేవలు అందిస్తేనే ప్రజలు సుఖ:శాంతులతో బతకగలుగుతారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజారోగ్యం, శ్రేయస్సును కాపాడవలసిన బాధ్యత పాలకులదే. ప్రభుత్వ విధానాలకు ప్రజాప్రయోజనాలే గీటురాయి కావాలి. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో చెల్లిస్తున్న పైసలను హెల్త్​ సెక్టార్​ను బలోపేతం చేయడానికే ఎక్కువగా కేటాయించాలి. డాక్టర్, ఇతర హెల్త్​ సిబ్బంది పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. అలాగే ఆస్పత్రులకు కావాల్సిన ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ప్రజల డబ్బుతో ఖజానా నింపుకుంటున్న పాలకులు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సంక్షోభంతో ప్రజల జీవితాలు అతలాకుతలమై లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు జనాలను జలగల్లా దోచుకున్నాయి. ఒక దశలో ఆస్పత్రిలో బెడ్​ దొరకడానికే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి, లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రిలో చేర్చినా దక్కని ప్రాణాలెన్నో. డెడ్​ బాడీలను ఇవ్వడానికి కూడా డబ్బులు గుంజుకున్న ఘటనలు కోకొల్లలు. ఈ కార్పొరేట్​ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతోంది. అయినా కార్పొరేట్, బడా ఆస్పత్రులను కంట్రోల్​ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంతే. 

40 శాతంపైగా పోస్టులు ఖాళీ

వేతన సవరణ సంఘం(పీఆర్ సీ) నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో 59,906 పోస్టులకు గానూ, 22,396 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో 3,766(48 శాతం) డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంటే.. మరో 1,500 కొత్త డాక్టర్ల అవసరం ఉంది. 1,985(21.68%) స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి హెల్త్​ సెక్టార్​లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. గరిష్టంగా ఏడాదికి మించి పోస్టులను ఖాళీగా ఉంచకూడదు. ఇటీవల విడుదలైన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయకపోతే పనిచేస్తున్న వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సీజనల్​ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నందున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. వైద్య శాఖలో ఖాళీలను కాంట్రాక్ట్​ ప్రాతిపదికన భర్తీ చేయాలని పాలకులు నిర్ణయించడం వల్ల ఆర్థిక శాఖ అనుమతులు, రెన్యువల్​ లాంటి సమస్యలతో నిరుద్యోగులు ముందుకు రావడం లేదు. ఇవన్నీ అత్యవసర సేవలే కాబట్టి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. చిన్నారులకు పౌష్టికాహారం అందజేతలోనూ మన దగ్గర ఎనలేని నిర్లక్ష్యం కొనసాగుతోంది.

పీహెచ్​సీల్లో వసతుల కొరత

జులై 2020 మధ్యంతర జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య 2 కోట్లకుపైగా ఉంది. నిబంధనల ప్రకారం ఈ స్థాయి జనాభాకు 726 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్ సీ)ఉండాలి. అయితే మన రాష్ట్రంలో ప్రస్తుతం 636 మాత్రమే ఉన్నాయి. 4,744 ఆరోగ్య ఉపకేంద్రాలకుగానూ 4,450 ఉన్నాయి. 191 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు(సీహెచ్ సీ) 85 ఉన్నాయి. ఇవి కూడా మౌలిక వసతుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. 636 పీహెచ్​సీల్లో 24 గంటలు సేవలందించేవి సగం మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా 144 పీహెచ్​సీలు, 17 యూహెచ్​సీలు, 126 బస్తీ దవాఖానలు, 83 సీహెచ్​సీలు, 37 ప్రాంతీయ దవాఖానలు అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామాల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక పీహెచ్​సీ, పట్టణాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక యూహెచ్​సీ, మురికివాడల్లో ప్రతి 10 వేల జనాభాకు ఒక సీహెచ్​సీ, ప్రతి 6 లక్షల జనాభాకు ఒక ప్రాంతీయ దవాఖాన చొప్పున ఉండాలని చట్టం చెబుతోంది. 

ఖాళీల భర్తీ ఎప్పుడు చేస్తరో?

రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖలో అన్ని రకాల పోస్టులు కలిపి 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆరోగ్య తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది. సగటు ప్రజల సంపాదనలో ఎక్కువ భాగం వైద్యానికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కరోనా నేర్పిన గుణపాఠం నుంచైనా వైద్య రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి. జలగల్లా పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. అలాగే వైద్యరంగంలోని ఖాళీల భర్తీకి పూనుకోవాలి. కరోనా వైరస్​ థర్డ్​వేవ్​ భయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ, నగర ప్రాంతాల్లో డెంగి, టైఫాయిడ్, మలేరియా వ్యాధులతో రోగులు దవాఖానకు ఎక్కువగా వస్తున్నారు. మరోవైపు సీజన్ జబ్బులు కూడా విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి ప్రజారోగ్యానికి జవసత్వాలు నింపాలి. అలా కాక ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగించినట్లయితే భవిష్యత్​ తరాలను ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టిన వాళ్లమవుతామని గమనించాలి.

కరోనా నుంచి పాఠాలు నేర్చుకోలె

కరోనా కల్లోలం నుంచి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదు. చాలా ఆస్పత్రులు సరిపడా డాక్టర్లు, హెల్త్​ సిబ్బంది లేకుండానే నడుస్తున్నాయి. పాలకులు హెల్త్​ సెక్టార్​లోని ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. కరోనా మరణ మృదంగంలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది మాత్రమే ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు వైద్యాన్ని అందించారు. వారి సేవలకు వెలకట్టలేం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాలు కనీసం ఔట్ పేషెంట్స్​ను కూడా చూడకుండా అమానవీయంగా వ్యవహరించారు. కొన్ని ఆస్పత్రులైతే కరోనా రోగులకు ట్రీట్​మెంట్​పేరుతో ధనార్జనే లక్ష్యంగా మార్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ రాజకీయాలే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపే పరిస్థితులు కనిపించడంలేదు. 

- మేకిరి దామోదర్, వరంగల్