V6 News

మహా నగరాలు గ్యాస్ చాంబర్లా ఎందుకు మారుతున్నాయి ?

మహా నగరాలు గ్యాస్ చాంబర్లా ఎందుకు మారుతున్నాయి ?

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ, ఇప్పుడు మనం పీల్చే గాలి ఆరోగ్యానికి హానికరం అనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పెరిగిన వాయు కాలుష్యం.  కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న 80 మందికి పైగా పద్మ అవార్డు గ్రహీతలైన వైద్యుల బృందం వాయు కాలుష్యం ఇకపై శీతాకాలానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది  ప్రజారోగ్యానికి నిరంతర ముప్పు అని ఒక హెచ్చరికతో కూడిన సలహాను జారీ చేశారు. అంటే భారతదేశం మహానగరాలలో  వాయు కాలుష్యం వల్ల ఇకపై  ప్రజలు పీల్చుకొనే గాలి హానికరమన్నమాట.  పిల్లలు,  గర్భిణీ  స్త్రీలు, వృద్ధులు.. గుండె సంబంధిత లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి వాయు కాలుష్యం నిరంతర ప్రాణాంతక  ప్రమాదం అని వారు హెచ్చరిస్తున్నారు. 

వాయు కాలుష్యానికి ఢిల్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుత వార్షిక డేటాను పరిశీలిస్తే  దేశంలోని ఇతర మహా నగరాలలో సైతం వాయు కాలుష్యం అనారోగ్యకరమైన  స్థాయిలోనే ఉంది. ఉత్తర భారతదేశంలో PM2.5 స్థాయిలు  ప్రపంచ ఆరోగ్య సంస్థ  భద్రతా పరిమితుల కంటే 20 నుంచి 40 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.  దాదాపు 70 శాతం జనాభా ప్రతిరోజూ అసురక్షిత గాలిని పీలుస్తున్నారు. వాయు  కాలుష్యం అనేక వ్యాధులకు కారణం అవుతుందని ఈ సంయుక్త జాతీయ సలహా సంస్థ తెలిపింది.

పీఎం 2.5 అంటే ఏమిటి ?
పీఎం 2.5  (పార్టిక్యూలేట్ మేటర్  2.5),  అంటే 2.5 మైక్రోమీటర్లకు  సమానమైన లేదా అంతకంటే  తక్కువ వ్యాసం కలిగిన  కణ పదార్థాన్ని   తెలియజేస్తుంది.  ఇది అతిపెద్ద ఆరోగ్య ముప్పును కలిగిస్తుంది.   దీనిని తరచుగా చట్టపరమైన గాలి నాణ్యతా  ప్రమాణాలలో  కొలమానంగా  ఉపయోగిస్తారు.   వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సంయుక్త  జాతీయ సలహా సంస్థ వైద్యులు పౌరులకు  వివరణాత్మక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు.  అవి..అధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉన్న  సమయాలలో  ‘హెపా’ ఎయిర్  ప్యూరిఫైయర్లు,  N95 మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించటం.  హెపా  ‘అధిక సామర్థ్యం గల  పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్’కు సంక్షిప్త రూపం.  ఈ రకమైన ఎయిర్ ఫిల్టర్  కనీసం 99.97%  దుమ్ము,  పుప్పొడి, బూజు,  బ్యాక్టీరియా,  0.3 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న ఏదైనా గాలిలో ఉండే కణాలను తొలగించగలదు. 

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
గాలి కాలుష్యం గరిష్టంగా ఉన్నప్పుడు బయటి కార్యకలాపాలను పరిమితం చేసుకొని  ఇండ్లలోనే ఉండిపోవటం శ్రేయస్కరం. ఎయిర్ ప్యూరిఫైయర్లు లేని కుటుంబాలు ప్రతిరోజూ నేలను  నీటితో శుభ్రం చేయాలి. వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ట్రిపుల్ -లేయర్ మాస్క్‌లను ఉపయోగించాలి.   నిర్మాణ  ధూళి,   పారిశ్రామిక ఉద్గారాలు,  వ్యర్థాలను తగలబెట్టడం నిషేధించాలి.  డీజిల్ జనరేటర్లపై  కఠినమైన నియంత్రణలను అమలు చేయాలి.  విద్యుత్  ప్రజా రవాణాను విస్తరించాలి.

ప్రపంచంలోని వివిధ  నగరాలలోని  గాలి నాణ్యతను  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా  తెలుసుకోవచ్చును.  ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం భాగస్వామి అయిన  ‘ఐక్యూ ఎయిర్’  ద్వారా   ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​ను  తెలుసుకోవచ్చును.  ఐక్యూ ఎయిర్  అనేది స్విస్ వాయు నాణ్యత సాంకేతిక సంస్థ.  గూగుల్ ప్లే స్టోర్ లో లభించే  ‘ఐక్యూ ఎయిర్ ఎయిర్ విజువల్’ యాప్ ద్వారా గాలి నాణ్యతను  తెలుసుకోవచ్చును.  గాలిలోకి  విడుదలయ్యే  కాలుష్య కారకాల పరిమాణం  బట్టి  ఎప్పటికప్పుడు ఒక ప్రదేశం గాలి కాలుష్య నాణ్యత మారుతూ ఉంటుంది.

గాలి నాణ్యతా ప్రమాణాలు
ఐక్యూ ఎయిర్  ప్రమాణాల  ప్రకారం  గాలి  నాణ్యతను  ఈ  కింది విధాలుగా విభజింపవచ్చును.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​ పరిధి 0–50 మంచిది.   51–100 మోస్తరు,  101–150  సున్నితమైన సమూహాలకు అనారోగ్యకరమైనది, 151–200 అనారోగ్యకరమైనది , 201–300 చాలా అనారోగ్యకరమైనది, 301–500+ ప్రమాదకరమైనది.  ఈ  ప్రమాణాల ఆధారంగా గాలి కాలుష్యం తీవ్రత తక్కువగా ఉన్నట్టు గాలి నాణ్యత పెరిగినట్లు  అర్థం చేసుకోవాలి.

నవంబర్‌ 2025లో ఘజియాబాద్  దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది, ఆ తర్వాత నోయిడా, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, ఢిల్లీ, హాపూర్,   గ్రేటర్ నోయిడా, బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పట్, సోనిపట్, మీరట్,  రోహ్‌తక్‌లు జాతీయ రాజధాని ప్రాంతం,  దాని పరిసర ప్రాంతాలలో టాప్ 10లో నిలిచాయి. రాష్ట్రాలలో కాలుష్యం విస్తృతంగా వ్యాపించింది.  నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2025లో  రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అత్యధికంగా కాలుష్య నగరాలు ఉన్నాయి. 34 నగరాల్లో 23 నగరాలు జాతీయ పరిమితులను  మించిపోయాయి.  

అధిక స్థాయిలో కాలుష్యం
హర్యానాలోని 25 నగరాల్లో 22 నగరాలు పరిమితుల కంటే ఎక్కువ స్థాయిలో కాలుష్యాన్ని కలిగి ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  20 నగరాల్లో 14 నగరాలు ఈ పరిమితిని దాటాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లలో కూడా అధిక కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి.  వేసవి కాలంలోని  వేడి  వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు,  సూర్యరశ్మి సమక్షంలో నైట్రోజన్ ఆక్సైడ్లు, అస్థిర సేంద్రియ సమ్మేళనాలు  మన చుట్టూ ఉండే వాతావరణంలో ఓజోన్ను ఏర్పరుస్తాయి. ఓజోన్ ఒక విష వాయువు.

ప్రకృతి సిద్ధంగా భూమి ఉపరితలం నుంచి 12 కి.మీ నుంచి దాదాపు 50 కి.మీ వరకు విస్తరించి ఉన్న స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుంది. కానీ, ఓజోన్ మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండటం  ప్రమాదకరం.  భారతదేశంలోని  అనేక నగరాలలో  శుభ్రమైన గాలిని  పీల్చుకోలేక పోవటం వలన ఊపిరితిత్తుల  కాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉన్నది.  అంటే ధూమపానం  చేస్తే వచ్చే ఊపిరితిత్తుల కాన్సర్,  వాయు కాలుష్యం వలన ధూమపానం చేయనివారికి కూడా వచ్చే అవకాశం ఉన్నది. 

భావితరాల ఆరోగ్యం కోసం..
బీజింగ్​ మార్పు అకస్మాత్తుగా జరగలేదు. 20 సంవత్సరాల (1998-–2017) నిరంతర కఠిన చర్యలు,   ప్రభుత్వం, ప్రజలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది.  భారతదేశంలో కాలుష్య నియంత్రణ చట్టాలు ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన ప్రభుత్వాలు వాటిని అమలు చేయలేకపోతున్నాయి, ఒకవేళ ప్రభుత్వాలు కఠినగా చట్టాలు అమలు చేద్దామనుకున్నా ప్రజలు సహకరించరు.

ప్రజలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నుంచి తమకు లభించే ఉచిత పథకాలు, ఆర్థిక ప్రయోజనాలపై మాత్రమే శ్రద్ధ చూపుతారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, కాలుష్య నియంత్రణ   గురించి డిమాండ్ చేయరు.  ప్రజలు తమ భావితరాలకు తాము సంపాదించిన ఆస్తులను వారసత్వంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ, భావితరాలు ఆరోగ్యవంతంగా  బతకడం కోసం స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని వారసత్వంగా ఇచ్చే విధంగా  ఆలోచిస్తే మంచిది.

బీజింగ్‌‌ తరహాలో గాలి కాలుష్య నియంత్రణ  
మనదేశంలో కాలుష్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. కాలుష్య నియంత్రణ అనేది తక్షణం పరిష్కారం అయ్యే సమస్య కాదు. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. 1998లో బీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటి అధికారిక మానిటరింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేనందున, కచ్చితమైన వార్షిక  ఏక్యూఐ  సగటు సంఖ్యలు అందుబాటులో లేవు. అయితే  అప్పటి కొలతల ప్రకారం స్థాయిలు చాలా అనారోగ్యకరమైన స్థాయిలలో ఉండేవి. 

గాలి కాలుష్య నియంత్రణ కోసం 1998వ  సంవత్సరంలో బీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేశారు. ఫలితంగా  2017 కల్లా  బీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్షిక సగటు గాలి నాణ్యత  80–90 (మోస్తరు)కు  చేరింది. అంటే గాలి నాణ్యత పెరిగి వాయు కాలుష్యం తగ్గింది.  ప్రపంచంలో మరే ఇతర నగరం లేదా ప్రాంతం ఇలాంటి ఘనతను సాధించలేదు. 

డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్