చంద్రయాన్--3 మిషన్​లో మరో సక్సెస్

చంద్రయాన్--3 మిషన్​లో మరో సక్సెస్

చంద్రయాన్-3 మిషన్​లో ఇస్రో మరో కీలక విజయం సాధించింది. ల్యాండర్, రోవర్​ను మోసుకెళ్లిన ప్రొపల్షన్ మాడ్యూల్​ను మన సైంటిస్టులు తాజాగా వెనక్కి తీసుకురాగలిగారు.

బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్​లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మరో కీలక విజయం సాధించింది. చంద్రుడిపైకి ల్యాండర్, రోవర్​లను – పంపడమే కాదు.. మూన్ ఆర్బిట్ నుంచి స్పేస్ క్రాఫ్ట్​లను తిరిగి వెనక్కి రప్పించగలమని కూడా నిరూపించింది. చంద్రయాన్–3 మిషన్ లో భాగంగా ల్యాండర్, రోవర్​లను మోసుకెళ్లిన ప్రొపల్షన్ మాడ్యూల్​ను మన సైంటిస్టులు తాజాగా వెనక్కి తీసుకురాగలిగారు. ఏపీలోని శ్రీహరికోట నుంచి జులై 14న ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్​ను ఇస్రో పంపింది. భూకక్ష్య నుంచి ల్యాండర్, రోవర్​తో కూడిన మాడ్యూల్ ను ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య వరకూ మోసుకెళ్లింది.

 తర్వాత ల్యాండర్ మాడ్యూల్​ను విడిచిపెట్టి, చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఒక శాటిలైట్ మాదిరిగా సమాచారం సైతం పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ చరిత్ర సృష్టించింది. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి నేలపైకి దిగి కలియతిరుగుతూ, పరిశోధనలు చేసి కీలక డేటాను పంపింది. దీంతో మిషన్ సూపర్ సక్సెస్ అయింది. అయితే, కచ్చితమైన ప్రణాళికలతో మిషన్​ను పూర్తి చేయడంతో ప్రొపల్షన్ మాడ్యూల్ లో ఏకంగా 100 కిలోల ఫ్యూయెల్ ను సైంటిస్టులు ఆదా చేశారు. ఇప్పుడు షెడ్యూల్​లో లేకపోయినా ఈ మాడ్యూల్​ను తిరిగి భూకక్ష్యకు తీసుకొచ్చి మరో విజయంతో సత్తా చాటారు. 

శాంపిల్ రిటర్న్ మిషన్లకు మార్గం.. 

ప్రస్తుతం ఈ మాడ్యూల్ భూమి చుట్టూ 1.54 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో సోమవారం ప్రకటించింది. తదుపరి దశలో దీనిని 36 వేల కిలోమీటర్ల దూరంలోని భూస్థిర కక్ష్యలోకి తీసుకొస్తామని తెలిపింది. అక్కడి నుంచి స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్​ హ్యాబిటేబుల్ ప్లానెట్ ఎర్త్(షేప్) పరికరంతో భూమిని పరిశీలిస్తూ మరింత డేటాను పంపుతుందని పేర్కొంది. భవిష్యత్తులో చంద్రుడి నుంచి శాంపిల్స్​ను భూమికి తీసుకొచ్చేందుకు చేపట్టే మిషన్స్​కు ఈ డేటా మార్గం చూపుతుందని ఇస్రో వివరించింది.