
కవిత సస్పెన్షన్‌తో కేసీఆర్ అంతఃపుర యుద్ధానికి తెరపడినట్టు కాదు. ఈ కథ ముగింపునకు చాలా సమయం ఉంది. అంతఃపురంలో జరుగుతున్న యుద్ధం అనేక మలుపులు తిరుగుతోంది. కవితను సస్పెండ్ చేస్తే ఆమె మౌనంగా ఉండదని కేసీఆర్, కేటీఆర్ కు తెలుసు. కవిత 'అణుబాంబు' విసరాలనే వాళ్ళు కోరుకున్నారేమో? అసలు బీఆర్ఎస్ నుంచి 'ఎవరికి' పొగ బెట్టాలనుకుంటున్నారు? ఎవరిని బయటకు పంపించాలని అనుకుంటున్నారు? మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకొని కవిత ఎందుకు చెలరేగినట్టు? అవి ఆమె సొంత వ్యాఖ్యలా ? లేక ఇంకెవరయినా స్క్రిప్ట్ రాసిచ్చారా? కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా హరీశ్ రావు వాదనా పటిమను ప్రశంసిస్తూ 'ఆరడుగుల బుల్లెట్టు' అంటూ బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసింది. ఆరడుగుల బుల్లెట్టుపైనే కవిత బుల్లెట్లు కాల్చినప్పుడు ఆ పార్టీ తక్షణం స్పందించలేదు.
2018 ఎన్నికల సందర్భంగా 27 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు హరీశ్ రావు డబ్బు పంపించారని, కేటీఆర్ ను ఓడించేందుకు సిరిసిల్లలో ప్రత్యర్థులకు రూ. 60 లక్షలు పంపిణీ చేశారని కవిత చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. వీటిపై పార్టీ స్పందించవలసి ఉన్నది. ఇప్పుడు మొత్తం మీద ఇంటిగుట్టు రట్టయ్యింది. కేసీఆర్ పార్టీ పరువు బజారుకెక్కింది. ఈ పరిణామాలన్నీ కేసీఆర్ నాయకత్వ వైఫల్యానికి సూచన. నాయకత్వంపై ఆయన పట్టు సడలుతున్నదనే అనుమానాలకు బలం చేకూర్చే ఘటనలివి. లేకపోతే గోటితో పోయే వ్యవహారాన్ని గొడ్డలి దాకా ఎందుకు తెచ్చుకుంటారు? కేటీఆర్‌కు అనుభవరాహిత్యం ఉండవచ్చు. కానీ, కేసీఆర్ ఏంచేస్తున్నట్టు? బీఆర్ఎస్,- బీజేపీ విలీనం కుట్ర గురించి కవిత ఆరోపించగానే కేసీఆర్ మీడియా ముందుకు ఎందుకు రాలేకపోయారు? ఆయన నిస్సహాయత ఏమిటి?
బీఆర్ఎస్ను వెంటాడుతున్న కష్టాలు
‘ఫామ్ హౌస్‌లో జరుగుతున్న ప్రతి సమాచారం కాంగ్రెస్ నేతలకు వెళుతుంది. నాకు ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ గాయం చేసింది. తర్వాత మీకు కూడా ఆరడుగుల బుల్లెట్‌తో ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌తో హరీష్, సంతోష్ గ్యాంగులు కుమ్మక్కయ్యాయి' అని ఆమె ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రిపాలు కావడం, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఇదే సమయంలో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం వంటివి పార్టీని డైలమాలో పడేశాయి. ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. వీటికితోడు పార్టీలోని కీలక నాయకుల మధ్య విభేదాలు బయటపడటం పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో కేసీఆర్ నాయకత్వం తప్ప, కేసీఆర్ స్థాయిలో ఇంకెవరూ లేరంటూ ఆమె పరోక్షంగా కేటీఆర్‌పై కామెంట్స్ చేశారు. కవిత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య వాదోపవాదాలు వివాదాస్పదంగా మారాయి. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం పార్టీలో అంతర్గత గొడవలు మరింతగా పెరిగాయని సూచిస్తోంది.
బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫోకస్
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. పార్టీలోని కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని స్వయంగా కేసీఆరే గతంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తోపాటుగా హరీష్ లాంటి నేతలు అరెస్ట్ అయితే మాత్రం పార్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కాళేశ్వరం వంటి కీలక అంశాలపై చర్చ సమయంలోనూ కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ కూడా బీఆర్ఎస్ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటం బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ. ఇప్పటికే గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆయనతోపాటుగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయం పార్టీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ లోని కీలక నేతలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనే వార్తలను కూడా బీఆర్ఎస్ సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతున్నది. కవిత నుంచి ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వరకు విలీనం' అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
అధికారం అంతా ఒకే కుటుంబం దగ్గర
బీఆర్ఎస్ పార్టీకి చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ ఆ అవకాశాన్ని వదులుకుంది. పోరాటం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే భిన్నంగా ఉంటుందని ప్రజలు అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఉద్యమకారులను అధికారంలో భాగస్వాములను చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారమంతా కేసీఆర్ కుటుంబం చేతిలో కేంద్రీకృతమైన కారణంగానే ఈ సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్య సంస్కృతి నుంచి వచ్చింది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం అంతా ఒకే కుటుంబం దగ్గర ఉంది. ఏ శాఖ మంత్రి దగ్గరకు వెళ్లినా ముఖ్యమంత్రిని అడిగి చేస్తాననే చెబుతుండేవారు. వన్ మ్యాన్ షోగా వ్యవహారాలన్నీ సాగాయి. కేసీఆర్ పిల్లలు, బంధువులు తెలంగాణ ఉద్యమంలో పోరాడి, ఎన్నికల్లో గెలిచి పదవులు చేపట్టారని వాదించే కేసీఆర్ 'భజన మండలి' ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
అవినీతి ఆరోపణలు
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ‘ఏటీఎం’గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆరోపించారు. మరోవైపు తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ చేపడతామంటూ ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగానే పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించి, ఆ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం ముందు 'దోషులు'గా ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. మిషన్ భగీరథ, ఔటర్ రింగ్ రోడ్ టోల్ కేటాయింపులు వంటి వాటిలోనూ అవినీతిపై ఆరోపణలున్నవి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ధరణి వెబ్ సైట్ సవరణలను ఆధారం చేసుకుని వేల కోట్ల లావాదేవీలు తెలంగాణలో జరిగినట్లు కవిత ఆరోపణలే సాక్ష్యం.
బీఆర్ఎస్ కుటుంబ పార్టీ
కవిత ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన రావడం మరొక హాట్ టాపిక్. రేవంత్ కు హరీశ్ రావు లొంగిపోయారని ఆమె నేరుగా ఆరోపించారు. తనను కేసీఆర్ కుటుంబం గొడవల్లోకి లాగడాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పిగొట్టారు. ‘చెత్తగాళ్ళ వెనుక నేను ఎందుకు ఉంటా. ఆయన వెనుక ఈయన, ఈయన వెనుక ఆయన ఉన్నాడని అంటున్నారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఒకరు, కవిత వెనుక ఉన్నారని మరొకరు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ’ అని సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో అన్నారు. తెలంగాణలో ప్రతి అంశం కేసీఆర్ చుట్టూనే గతంలో తిరుగుతుండేది. భారత్‌లోని ప్రాంతీయ పార్టీలన్నింటిలో సాధారణంగా అధ్యక్ష స్థానం ఒకే కుటుంబం చేతిలో ఉంటుంది. పార్టీలో నంబర్ వన్ స్థానంలో ఆ కుటుంబం వారే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నంబర్ టూ స్థానంలో కూడా కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర నేతలు ఉంటారు.అయితే ఈ విషయంలో బీఆర్ఎస్‌కు ఒక మినహాయింపు ఉంది. బీఆర్ఎస్‌లో నంబర్ వన్ మాత్రమే కాదు, టూ, త్రీ, ఫోర్, ఫైవ్ కూడా.. అంటే పార్టీలో మొదటి అయిదు స్థానాలూ కేసీఆర్ కుటుంబ సభ్యులవే. వేరే ఎవరూ ఆ స్థానాల్లోకి వెళ్లలేకపోయారు.
- ఎస్.కే. జకీర్
సీనియర్ జర్నలిస్ట్