తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణమేంటి?

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణమేంటి?

తెలంగాణలో గత 9 ఏండ్లలో 7007 రైతు ఆత్మహత్యలు జరగడం అత్యంత దురదృష్టకరం. తెలంగాణలో రైతు రాజ్యం, సిరులు కురిపిస్తున్న సేద్యం అంటూ బీఆర్​ఎస్ సర్కారు డబ్బా కొట్టుకుంటున్నా, రైతుల కష్టాలు మాత్రం అట్లే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు దొరక్క, పెట్టుబడి దొరక్క,  అప్పుకు వడ్డీ కట్టలేక, అకాల వర్షాలు, కరువులతో పంటనష్టపోతే, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఏటా కష్టనష్టాలే. రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు ప్రభుత్వ లెక్కలో  రైతులు కారు, రైతు బంధు రాదు. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. పంట పండినా పండకపోయినా భూమి యజమానికి కౌలు పైసలు ఇయ్యాల్సిందే. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2021 నాటికి 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, అందులో 55 శాతం జనాభా వ్యవసాయం మీద బతుకుతున్నారు. రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది కౌలు రైతులున్నారు. రాష్ట్రంలో సుమారు ఒక కోటి 45 లక్షల ఎకరాల సాగుభూమిని దాదాపు 59 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 64 శాతం మంది సన్నకారు రైతులు 28 శాతం భూమిని సాగుచేస్తుంటే, 2.3 శాతం పెద్ద రైతులు14 శాతం భూమిని సాగుచేస్తున్నారు. అంటే ఇప్పటికీ భూమి ఎవరి చేతుల్లో ఉందో అర్థమవుతున్నది. 

రాష్ట్రంలో కోటీ 45 లక్షల సాగు భూమికి 3.2 లక్షల టన్నుల విత్తనాలు అవసరం. ఏటా లక్షల మంది రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకు పరిమితం కావడం.. రైతులు ఇంకా నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్లేలా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విత్తన సబ్సిడీ, నాణ్యమైన విత్తన సరఫరా బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంది. విత్తనాలకు సంబంధించి ఒక సమగ్ర చట్టం, విధానం తీసుకురావాలి. ప్రస్తుతం విత్తన సబ్సిడీని పచ్చి రొట్ట ఎరువు పంటలకు మాత్రమే ఇస్తున్నది. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థను పూర్తిగా అభివృద్ధి చేసి అన్ని రకాల విత్తనాలను విత్తనోత్పత్తి రైతులతో పండించి నాణ్యమైన విత్తన సరఫరాను పటిష్ట పరచాలి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలు తప్ప మిగతా అన్ని విత్తనాలను రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాత్రమే అభివృద్ధి చేసి సరఫరా చేయాలి. జన్యుపర మార్పుల పంటల (ఉదాహరణకు - పత్తి, మక్క తదితర)కు సంబంధించిన విత్తనాల కంపెనీలతో విత్తన రైతుల సహకార సంఘాలతో ఒప్పందం చేసుకొని విత్తనాలు పండించేటట్లు ప్రభుత్వం చూడాలి. దీని వల్ల మధ్య దళారులు పోయి రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో సాగుచేసే ఏ పంటల్లోకి జన్యుమార్పిడి, కలుపు మందులు తట్టుకునే విత్తనాలను అనుమతించకూడదు.

వ్యవసాయ కమిషన్

రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికపుడు నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రభుత్వానికి సాయపడేందుకు రాజ్యాంగబద్ధ సంస్థ లాంటి ఒక వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. వ్యవసాయంలో అనుభవం ఉండి ఇప్పటికీ గ్రామంలోనే నివసిస్తున్న పట్టభద్రులైన ఇద్దరు రైతులు, ఒక రిటైర్డు ఐఏఎస్​అధికారి, వ్యవసాయ వర్సిటీలో పనిచేసిన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, వ్యవసాయశాఖలో పనిచేసిన ఒక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ పైస్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. వీరి జీతభత్యాలు, పదవీకాలం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులకు ఉన్నట్లు ఉండాలి. కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ ఒకరు బీసీ, ఒకరు మహిళ అయి ఉండాలి. వ్యవసాయ కమిషన్ అన్ని రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయిస్తుంది. కమిషన్ ప్రకటించిన ధరలకు ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించాలి. 

కమిషన్ సమగ్ర విత్తన విధానం తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుంది. దాన్ని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలి. రాష్ట్ర స్థాయిలో కమిషనర్(వ్యవసాయం), వ్యవసాయ విశ్వవిద్యా లయాలను, పండ్లతోటల విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వ విత్తన అభివృద్ధి, విత్తన పరీక్ష సంస్థలను, జిల్లా స్థాయి కలెక్టర్లను, జిల్లా స్థాయి వ్యవసాయ పండ్లతోటల అధికారులను రివ్యూ చేసి వారికి సలహాలను ఇచ్చే అధికారం సలహాలు తీసుకునే అధికారం కమిషన్​కు ఉంటుంది. వ్యవసాయ కమిషన్​కు ఏటా రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టాలి. కమిషన్ జిల్లాల వారీగా కౌలు రేట్లు నోటిఫై చేయాలి.

రైతు బంధు

రైతు బంధు పథకం వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులకు చాలా ఉపయోగకరం. దీన్ని కొనసాగిస్తూనే కొన్ని మార్పులు చేయాలి. పది ఎకరాలపైన ఉన్న రైతులకు ఇవ్వకూడదు. ఆదాయపు పన్నుకట్టే ఏ రైతు కుటంబానికి, భూ యజమానులకు రైతు బంధు ఇవ్వకూడదు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ విదేశీ భారతీయులకు ఇవ్వొద్దు. వ్యవసాయం చేయకుండా రెండేండ్ల కంటే ఎక్కువకాలం పడావు పెట్టిన భూ యజమానులకు కూడా రైతుబంధు ఇవ్వకూడదు. రైతు సహకార సంఘాలు, మార్కెటు కమిటీలు,  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలి. అన్ని రకాల ప్రభుత్వ వ్యవసాయశాఖ లావాదేవీలు పీఏసీఎస్ ల ద్వారానే జరగాలి. సహకార, సమాఖ్య సంఘాలు, మార్కెట్ కమిటీలు పారదర్శకతతో పనిచేయడానికి కావాల్సిన సంస్కరణలు చేపట్టేందుకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పరచాలి. రాష్ట్ర స్థాయిలో ఎఫ్​పీవోలను, పీఏసీలను, ఎంఏసీలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి సమన్వయం చేయడానికి సెర్ప్​లాంటి ఒక సౌలభ్య సంస్థను ఏర్పాటు చేయాలి. 

కస్టమ్ హైరింగ్ సెంటర్లు

వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు సహకార సంఘాలు వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు నడుపుతున్నాయి. వీటిలో చిన్న ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, ట్రేలర్లు, రకరకాల పనిముట్లు, నాట్లు వేసే, దుక్కిదున్నే, కోతకోసే యంత్రాలు, పిచికారీ చేసే మిషన్లు ఉంటాయి. ఇలాంటి కేంద్రాలను ప్రతి గ్రామంలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కస్టమ్ ​హైరింగ్ ​కేంద్రాలు రాష్ట్రంలో 40 వరకు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను 6 వేలకు పెంచాలి. 

కౌలు రైతులు

ఒకప్పుడు పెద్ద భూస్వామి భూముల్లో రైతులు పనిచేసేవారు. తర్వాత రైతులే వాళ్ల దగ్గర కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్లు. ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే వీరికి భూమిపై యాజమాన్యపు హక్కులు ఉండవు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి పేరు మీద ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాల వలన వీరికి ఎలాంటి ప్రయోజనం లేదు. కౌలుదార్లకు, అనుభవదారులకు కూడ ఈ పథకాలు అమలు చేయాలి. రైతు ఆత్మహత్యల్లో సుమారు80 శాతం ఆత్మహత్యలు కౌలు రైతులవే. ఏటా గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీల్లో కౌలు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకునే యంత్రాంగం పెడితే వారిని గుర్తించడం తేలిక. కౌలురైతులు 2011 చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. వారికి పంట రుణాలు ఇవ్వాలి. పంట బీమా పథకం అమలు చేయాలి. 

పరిశోధనల ఫలాలు రైతులకు అందాలి

రాష్ట్రంలోని వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీలను వ్యవసాయ శాఖ సహకారంతో రైతు సహకార సంఘాలకు అనుసంధానం చేయాలి. ప్రయోగశాల నుంచి క్షేత్రంలోకి కొత్త శాస్త్రీయ జ్ఞానాన్ని రైతులకు అందజేయాలి. వర్సిటీలోని ప్రతిశాఖ ఒక ఐదు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి సగటు పంట ఉత్పత్తులను ఏటా10 శాతం పెంచేటట్లు10 శాతం పెట్టుబడి ఖర్చు తగ్గించేటట్లు ఒక పటిష్ట విధానం డిజైన్ చేసి అమలు చేయాలి. దానికి కావాల్సిన రూ. 100 కోట్ల బడ్జెట్ ను వర్సిటీకి ఇవ్వాలి. మన టీవీ ద్వారా విశ్వవిద్యాలయం రోజుకు రెండు గంటలు చొప్పున ప్రతివారం రెండు రోజులు రైతులనుద్దేశించి మాట్లాడే కార్యక్రమాలు రూపొందించాలి.

వ్యవసాయ కూలీలు

వ్యవసాయ కూలీల గురించి మాట్లాడకుండా వ్యవసాయ అభివృద్ధిని మాట్లాడలేం. రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల మంది వ్యవసాయ కూలీలు వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయం ముమ్మరంగా లేని నెలలో వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పటిష్టంగా అమలు చేయాలి. మెట్ట ప్రాంతాలను ఉపాధి హామీ పథకంలో వాటర్​షెడ్ విధానంలో పూర్తిగా అభివృద్ధి చేయాలి. రాష్ట్ర కనీస వేతనాన్ని ఉపాధి హామీ వేతనంగా నోటిఫై చేయాలి. ఉపాధి హామీ కూలీలకు సాంఘిక భద్రత కింద రైతు బీమా లాంటి కూలీల బీమా పథకాన్ని అమలు చేయాలి. 

సమగ్ర సాఫ్ట్​వేర్​

వ్యవసాయానికి సంబంధించి అన్ని సంస్థల కార్యక్రమాలను అను సంధానించుకుంటూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని రకాల సమాచారాలను సేకరించుకుంటూ, విశ్లేషణలు, సమాచార రిపోర్టులతో ఒక సమగ్ర సాఫ్ట్​వేర్ విధానాన్ని ప్రభుత్వం తయారు చేయాలి. ఈ సాఫ్ట్​వేర్ ద్వారా రైతుల పూర్తి సమాచారాన్ని, వ్యవసాయశాఖ సిబ్బంది అధికారుల క్షేత్రస్థాయి సందర్శనల సమాచారాన్ని కూడా సేకరించాలి. ముఖ్యమంత్రి ప్రతినెలలో రెండు సార్లయినా వ్యవసాయ అధికారులతో రాష్ట్ర స్థాయి రివ్యూ మీటింగులు పెట్టి వ్యవసాయశాఖ, రైతుల సమస్యల మీద పూర్తిగా సమీక్షలు నిర్వహించాలి.

మౌలిక సదుపాయాలు

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కావాల్సిన గిడ్డంగులు/ గోదాములు, టార్పాలిన్లు, కాంక్రీట్ కల్లాలు, పంటల సేకరణ కేంద్రాలు తదితర వ్యవసాయ మౌలిక సదుపాయాల అవసరాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పండుతున్న అన్ని పంట ఉత్పత్తుల నిల్వకు.. ప్రస్తుతం ఉన్న 74 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు, 25 లక్షల టన్నుల మార్కెటింగ్ శాఖల గోదాములు పోను ఇంకా 31 లక్షల టన్నులకు అవసరమైన గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. వీటికి సుమారుగా రూ. 3,720 కోట్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 124 ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్​లు ఉన్నాయి. ఇంకో 1000 కోల్డ్ స్టోరేజీల అవసరం ఉంది. చింతపండు, కూరగాయలు, పచ్చిమిర్చి, పసుపు, వేరుశనగ, పండ్లు లాంటి అనేక పంట ఉత్పత్తులు కోల్డ్ స్టోరేజ్​లలో రైతులు గిట్టుబాటు ధరలు లేనప్పుడు దాచుకోవచ్చు. వీటికి కనీసం 30 శాతం సబ్సిడీ ఇవ్వగలిగితే ప్రైవేట్ వ్యాపారస్థులు కట్టడానికి ముందుకు వస్తారు. వీటికి రూ.1500 కోట్లు అవసరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి. కోతలు, నూర్పుడు సమయంలో వచ్చే చెడగొట్టువానల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులకు టార్పాలిన్లు చాలా అవసరం. 30 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు రెండు చొప్పున టార్పాలిన్లు ఇవ్వడానికి రూ. 6000 కోట్లు అవుతుంది. 

ఇందులో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే 3000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. దేశంలో పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఏటా కరువు, అధిక వర్షాలు, వరదలు, అడవి జంతువుల దాడి వల్ల లక్షలాది మంది రైతులు పంట నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వ్యవసాయశాఖ ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం లేకుండానే రంగంలోకి దిగి రైతు వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సాఫ్ట్​వేర్​ద్వారా రిపోర్టు మర్పించే వ్యవస్థ కావాలి. ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్​ వ్యవస్థను నెలకొల్పాలి. సుమారుగా ఒకకోటి ఎకరాలకు పంట బీమా ప్రీమియం కట్టాలి.

రైతుల ఆత్మహత్యలకు కారణమేంటి?

ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు పెట్టుబడి ఖర్చు పెరగడం, పంటలకు మద్దతుధర రాకపోవడం, విద్య, వైద్యం ప్రైవేటుపరం కావడం తదితర కారణాల వల్ల రైతు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వస్తున్నది. ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బ్యాంకులు పంట రుణాలు సరిగా ఇవ్వకపోవడం, ఇచ్చినా.. పార్టీలు వాటిని మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏండ్లతరబడి చేయకపోవడం లాంటి కారణాలతో రైతులు డీఫాల్టర్లుగా మారుతున్నారు. బ్యాంకుల నుంచి లోన్​రాకపోవడం వల్ల 24% నుంచి 48% వరకు రైతులు బయట ప్రైవేటు వ్యాపారుల ద్గర వడ్డీకి అప్పు తెస్తున్నారు. పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడమో, వచ్చినా సరైన ధర దొరక్కనో.. ఆదాయం పెద్దగా రావడం లేదు.  దీంతో తెచ్చిన అప్పుకు వడ్డీ, అసలు చెల్లించలేక ఇబ్బందిపడుతున్నారు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతులను ఆదుకొని వారు గౌరవ ప్రదమైన వ్యవసాయ వృత్తిని చేపట్టేందుకు ఎస్​డీఎఫ్ ​కొన్ని సూచనలు చేసింది.  

ధరల స్థిరీకరణ నిధి

పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి మార్కెట్​ను స్థిరీకరిస్తే తప్ప రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండరు. కనీసం రూ. 20,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. సివిల్ పౌర సరఫరాల సంస్థ, మార్క్​ఫెడ్, మార్కెటింగ్ శాఖ, ఆయిల్ ఫెడ్, హాకా లాంటి సంస్థలను బలోపేతం చేసి ఈ నిధి ద్వారా అవసరమైనచోట ప్రభుత్వం బాధ్యత తీసుకొని పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో సేకరించాలి. ఈ ప్రక్రియ అంతా వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో పారదర్శకతతో అమలు చేయాలి. ఒక్కసారి మార్కెట్​లో ప్రభుత్వం చేరి సేకరణ ప్రారంభిస్తే ప్రైవేటు వ్యాపారులు రైతులకు మంచి ధరలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏటా ప్రభుత్వం ఏ గ్రామంలో ఏ పంట వేయాలో, ఏ పంటను కొంటామో నోటిఫై చేయాలి. నోటిఫై చేసిన పంటలను మాత్రమే ప్రభుత్వం సేకరణ చేస్తే రైతులు బీమాతో సహా అవే పంటలను పండిస్తారు. 

– సోషల్​ డెమొక్రటిక్ ​ఫోరం