రిలేషన్షిప్లో ప్రేమే కాదు నమ్మకమూ ఉండాలి

రిలేషన్షిప్లో ప్రేమే కాదు నమ్మకమూ ఉండాలి

రిలేషన్​షిప్​లోకి అడుగుపెట్టడం, భాగస్వామితో గంటల కొద్దీ మాట్లాడడం వంటివి చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తాయి ఎవరికైనా. రిలేషన్​షిప్​ మొదలయ్యాక మొదటిరోజు ఎంత హ్యాపీగా ఉన్నారో మిగతా రోజుల్లోనూ అంతే హ్యాపీగా ఉండాలనుకుంటారు చాలామంది. 

అది నిజం కావాలంటే  ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరిపై ఒకరికి  ఎనలేని నమ్మకం ఉండాలి. ఎందుకంటే... ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తే, నమ్మకమనేది అన్నిరకాల పరిస్థితుల్లో వాళ్లను ఒక్కటిగా నడిపిస్తుంది. ‘నేనున్నాను’ అనే భరోసాను ఇస్తుంది కూడా. అలాంటిది  ఏ కారణం వల్లనైనా  పార్ట్​నర్ మీద  నమ్మకం పోయిందంటే అవతలివాళ్ల మనసు విరిగిపోతుంది. దాంతో వాళ్ల మధ్య ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత కరువవుతాయి. అందుకని ఇద్దరూ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయ త్నించాలని చెప్తున్నారు సైకోథెరపిస్ట్​లు. అంతే కాదు అందుకు ఏం చేయాలో చెప్తున్నారు కూడా. 

పొరపాటు చిన్నదైనా, పెద్దదైనా వెంటనే ‘సారీ’ చెప్పాలి. దాంతో అవతలివాళ్ల మనసు గెలుచుకోవచ్చు. అయితే, కొందరి తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అంతేకాదు  ప్రతిసారి పొరపాటు చేయడం, ‘సారీ’ చెప్పడం వీళ్లకు ఓ అలవాటుగా మారుతుంది. ఇలాంటివాళ్ల మీద భాగస్వామికి నమ్మకం పోతుంది. అలాకాకుండా  తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒకసారి చేసిన పొరపాటుని మళ్లీ చేయొద్దు. దాంతో, అవతలివాళ్లకు నమ్మకం కుదురుతుంది. 

బయటికి చెప్పాలి

అవతలివాళ్ల తీరు నచ్చకున్నా, తమకు ఏదైనా సమస్య ఉన్నా....  బయటకి చెప్పరు కొందరు. మౌనంగా ఉంటూ లోలోపల బాధ పడుతుంటారు. కారణం.. వీళ్లు అన్ని విషయాల్ని పార్ట్​నర్​తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడమే. దాంతో ఒంటరితనం పెరిగిపోతుంది. చివరకు రిలేషన్​షిప్​ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకని మనసులో ఏమీ దాచుకోవద్దు. చెప్పాలనుకున్న విషయాన్ని భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలి. దాంతో మనసు తేలికపడడమే కాకుండా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.  

బాధ్యత తీసుకోవాలి

రిలేషన్​షిప్​లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే బాధ్యతగా ఉండడం చాలా ముఖ్యం. అవతలివాళ్లకు  అవసరమైనవి కొనివ్వడం, అప్పగించిన పని చేయడం అనేది బాధ్యత మాత్రమే కాదు... ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది కూడా.  ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదంటే.. ఇద్దరూ బాధ్యతగా ఉండాలి. దాంతో  ఏదైనా పొరపాటు జరిగినా  ఒకరినే నిందించరు. 

నిజాయితీ ముఖ్యం

‘ఏం జాబ్ చేస్తున్నారు? ఎంత సంపాదిస్తు న్నారు?’... అని అడిగినప్పుడు కొందరు గొప్ప కోసం అబద్ధాలు చెప్తారు. కానీ, ఒక అబద్ధాన్ని దాచడానికి మరొక అబద్ధం. ఇలా ప్రతిసారి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. తీరా.. నిజం తెలిశాక ఇద్దరూ బాధపడతారు. రిలేషన్​షిప్ కూడా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే .. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అప్పుడే అవతలివాళ్లకు నమ్మకం ఏర్పడుతుంది.

జ్ఞాపకాలు పోగేసుకోవాలి

రిలేషన్​షిప్ అనేది ఒక జర్నీ. ఆ జర్నీ ఎంత అందంగా ఉందనేది...  ఎన్ని అందమైన జ్ఞాపకాలు పోగేసుకున్నారనే దానిపై ఆధారపడుతుంది. కాబట్టి.. జాబ్, కెరీర్​లో పడి అవతలివాళ్లని పట్టించుకోకుండా ఉండొద్దు. టైం దొరికినప్పుడల్లా... ఇద్దరికీ నచ్చిన ప్లేస్​కి టూర్​కి పోవాలి. ఇవేకాకుండా ఇంటి పనులు కలిసి చేస్తూ,  కబుర్లు చెప్పుకోవడం వల్ల కూడా  ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది.