
ఇష్టపడిన జాబ్, మంచి కెరీర్... సంతోషంగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి? అనిపిస్తుంది. అయితే, జీవితంలో ఒక పొజిషన్లో ఉండి, నలుగురిలో పేరు ఉన్నవాళ్లు కూడా మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటివాళ్లని చూశాక డబ్బు, పరపతి... ఇవేవి మానసిక ఒత్తిడి నుంచి బయటపడేయలేవు. అనిపిస్తుంది. అలాగని డిప్రెషన్ నుంచి కోలుకోలేమని అనుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ల ఆలోచనల్ని. ప్రవర్తనని గమనిస్తే వాళ్లని కాపాడుకోవచ్చు. అంటున్నారు సైకియాట్రిస్టులు.
ఈమధ్య హైదరాబాద్లోఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల సూసైడ్ చేసుకుంది. ‘అందమైన ప్రపంచాన్ని చూడాలనుకున్నా. కానీ, నేను అనుకున్న జీవితం ఇది కాదు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు మరో దారి కనిపించడం లేదు’ అని ఆమె సూసైడ్ నోట్లో రాసింది. ప్రత్యూష ఒక్కదానికే కాదు డిప్రెషన్లో ఉన్న వాళ్లందరికి వచ్చే ఆలోచనే ఇది. కానీ, ఏ సమస్యకైనా చావు అనేది పరిష్కారం కాదు.
అన్నీ ఉన్నా...
డబ్బులు, మంచి పొజిషన్, చదువు ఉన్నవాళ్లని ‘నీకు అన్నీ ఉన్నాయి. అయినా ఎందుకు బాధపడుతున్నావు?’ అని అంటారు చాలామంది. జాబ్, కెరీర్లో ఎదుగుతున్నవాళ్లు మానసిక ఒత్తిడికి లోనవ్వడానికి కారణాలు అనేకం. కుటుంబ పరిస్థితులు, చిన్నప్పటి అనుభవాలు, పోటీ వాతావరణం, యాంగ్జైటీ వంటివి వీళ్లని డిప్రెషన్లోకి నెట్టేస్తాయి. కోరుకున్న జాబ్ రాలేదని, కెరీర్ బాగాలేదని మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్లూ ఉన్నారు. శరీరం రంగు, బరువు, ఆకారం బాగాలేదని మానసికంగా బాధపడేవాళ్లు కూడా చాలామందే.
ఈ ఆలోచనలు వస్తాయి
మానసికంగా ఒత్తిడి అనుభవించేవాళ్లు ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తారు. ‘నేను ఏది చేసినా తప్పే. నేను బతికి ఉపయోగం లేదు. నేను దేనికీ పనికి రాను. నావల్ల ఇతరులు బాధపడుతున్నారు, నా జీవితం ఎప్పుడూ సెట్ అవ్వదు అనుకుని నిరాశలో ఉండిపోతారు. చావడం తప్ప వేరే దారి లేదనే నిర్ణయానికి వస్తారు. ఇలాంటి ఆలోచనలు, లక్షణాల్ని ‘సూసైడల్ బిహేవియర్’ అంటారు. కొందరైతే తాము చనిపోయిన తర్వాత ఇంట్లోవాళ్లు బాగుండాలని వాళ్ల పేరుమీద విల్లు కూడా రాస్తుంటారు. సూసైడ్ ఆలోచనల నుంచి బయటపడడానికి కొందరు ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు. మరికొందరైతే ప్రాణాల మీద లెక్కలేనట్టు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. నొప్పి తెలియకుండా చావడం ఎలా? అని ఆన్లైన్లో వెతికి సూసైడ్ చేసుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు.
చెప్పలేకపోవడానికి
డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు తమ సమస్యని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్‌కు చెప్పేందుకు భయపడతారు. కారణం.. మానసిక ఇబ్బంది ఉందని చెప్తే ‘అదొక రోగమ’ని అనుకుంటారనే భయం ఉంటుంది వీళ్లకు. ఒకవేళ చెప్పినా తక్కువగా చూస్తారని, ఎవరూ నమ్మరని అనుకుంటారు. దాంతో బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. ఫలితం నలుగురిలో కలవరు. అలా ఒంటరితనం వీళ్లని చుట్టుముడుతుంది.
కౌన్సెలింగ్ కంటే ముందు
‘ఈమధ్య మనసేం బాగా లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏ పని చేయబుద్ధి కావట్లేదు’ అని ఎవరైనా పదేపదే చెప్తుంటే వాళ్లు మానసిక ఒత్తిడిలో ఉన్నారని గ్రహించాలి. డిప్రెషన్లో ఉన్నవాళ్లకు కౌన్సెలింగ్ ఇప్పించడం ముఖ్యమే. అయితే, అంతకంటే ముందు వాళ్లతో మాట్లాడాలి. వాళ్లు చెప్పేది వినాలి. వాళ్ల బాధని అర్థం చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలని చెప్పాలి. వాళ్లకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేయాలి. వాళ్లకు అందుబాటులో ఉండాలి.
రెండూ ఒకటి కావు
బాధ, డిప్రెషన్... రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ కావు. బాధ అనేది ఒక ఎమోషన్. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినప్పుడు, ఇంటర్వ్యూ బాగా చేయనప్పుడు ఆ రోజంతా బాధగా ఉంటుంది. దీన్ని ‘నార్మల్ శాడ్ నెస్’ అంటారు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపితే ఈ బాధ నుంచి బయటపడొచ్చు. కానీ, డిప్రెషన్ అనేది సైకియాట్రిక్ కిల్లర్. మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లకు పని మీద ఫోకస్ తగ్గిపోతుంది. తొందరగా అలసిపోతారు. సరిగా నిద్ర పట్టదు. ఆకలి తగ్గిపోతుంది. ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఈ లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. వీళ్లకు మెడికేషన్ చాలా అవసరం. సూసైడ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నవాళ్లని అడ్మిట్ చేయాల్సి వస్తుంది.
థెరపీతో బయటపడి...
డిప్రెషన్ అనేది ఎవరికైనా రావచ్చు. స్టూడెంట్లు, జాబ్ చేసేవాళ్లే కాదు హీరోలు, హీరోయిన్లు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీపికా పదుకోనె కూడా కొన్నాళ్లు డిప్రెషన్‌తో బాధపడింది. ‘థెరపీ ట్రీట్మెంట్ తీసుకుని డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’ అని అందరితో షేర్ చేసుకుంది కూడా. ఒకప్పుడు లావుగా ఉండడంతో ‘బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్’తో పాటు మానసిక ఒత్తిడికి లోనైంది ఇలియానా. అలాంటిది ఆమె ఇప్పుడు బరువు తగ్గి కాన్ఫిడెంట్‌గా ఉంది.
ఏం చేయాలంటే..
టెన్షన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే డాక్టర్ ను కలవాలి. టెన్షన్ తగ్గేందుకు ఎక్సర్సైజ్ చేయాలి. యోగా, ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. టైంకు ఫుడ్ తినాలి. రోజూ 8 గంటలు నిద్రపోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మానసిక ఒత్తిడి బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.
హెల్ప్‌లైన్ సాయం
డిప్రెషన్లో ఉన్నవాళ్లకు ధైర్యం చెప్పేవాళ్లు కావాలి. వాళ్ల బాధను అర్థం చేసుకొని, ఆ బాధని తగ్గించే వాళ్లు కావాలి. అందుకోసం గవర్నమెంట్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఉన్నాయి. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సమస్య చెప్పుకుంటే డిప్రెషన్, సూసైడ్ ఆలోచనల నుంచి బయటపడేందుకు సలహాలు చెప్తారు ఎక్స్పర్ట్స్. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆత్మహత్యల్ని అడ్డుకునేందుకు పనిచేస్తున్నాయి.
డాక్టర్. అస్ఫియా కుల్సుమ్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సైకోఅనలిటిక్ సైకోథెరపిస్ట్ రెనోవా హాస్పిటల్స్ హైదరాబాద్