V6 News

విష రసాయనాల పరిశ్రమలపై నియంత్రణ ఏది ?

విష రసాయనాల పరిశ్రమలపై నియంత్రణ ఏది ?

వ్యవసాయంలో ప్రస్తుతం 1,000 కంటే ఎక్కువ రసాయన సమ్మేళనాలు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా పిచికారి చేసిన అనంతరం చాలా సంవత్సరాలు పర్యావరణంలో కొనసాగే అవకాశం ఉంది.  ప్రపంచ ఆహార సంస్థ ప్రకారం వ్యవసాయంలో ఉపయోగించే చాలా రసాయనాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు. 

అన్నీ కూడా మానవులకు, పర్యావరణానికి అత్యంత విషపూరితమైనవి. పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌‌‌‌వర్క్ అంచనా మేరకు  ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 4 మిలియన్ టన్నుల విష రసాయనాలు (పురుగు మందులు) అమ్ముడవుతున్నాయి. ఇందులో ఎక్కువగా కలుపు సంహారకాలు (50%), క్రిమిసంహా రకాలు (30%), శిలీంద్రనాశకాలు (17%), రోడెంటిసైడ్లు, నెమటిసైడ్లు (3%) వంటివి ఉన్నాయి.

ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ప్రకారం కేవలం ఐరోపా ఖండంలోనే 1990ల ప్రారంభం నుంచి  ఏటా 460,000 టన్నుల విష రసాయన వార్షిక వినియోగం అవుతున్నది.  అమెరికాలో  406,000  టన్నుల కంటే  ఎక్కువ  ఉపయోగిస్తున్నది.  అయితే ఇతర పారిశ్రామిక దేశాలు సంవత్సరానికి సగటున 24,000 టన్నులను ఉపయోగించాయి. మన దేశంలో దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల విష రసాయనాల ఉపయోగానికి చేరుకున్నాం. ఆహారం, ఇతర పంటల ఉత్పత్తికి ఈ రకమైన విష రసాయనాల ఉపయోగానికి స్పష్టంగా వాణిజ్యం, వ్యాపారం, లాభాపేక్ష మద్దతు ఉన్నది.

మన ఆహారంలో, తాగే నీటిలో, శ్వాసలో రసాయనాల పరిమాణం పెరుగుతూనే ఉన్నది. నిత్యం రసాయనాలు అనేక రూపాలలో మన శరీరంలోకి చేరడానికి ప్రధాన కారణం మనం తీసుకునే  నీరు, ఆహారం.  మన దేశంలో ఎప్పుడో  ప్రవేశపెట్టిన వ్యవసాయ రసాయనాల ఉపయోగం క్రమంగా పెరుగుతూ ఇప్పుడు విచ్చలవిడి ఉపయోగ స్థాయికి  చేరింది.  ఏది పడితే అది వాడడం వల్ల ఈ విష రసాయనాలు పర్యవరణమంతటా విస్తరించాయి. అయినా కూడా  విష రసాయనాల మీద నమ్మకం పెట్టుకుని  తమ ఆదాయం పెంచుకునే  ప్రయత్నం చేసే వ్యక్తులు, సంస్థలకు కొదవలేదు. 

శాస్త్రవేత్తలకు అయితే అసలే పట్టింపు లేదు. విష రసాయనాల పట్ల శాస్త్రీయత, వాటి ప్రభావం వంటి విషయాల పట్ల ఉదాసీనంగా ఉండడం వారికి అలవాటు అయిపొయింది. సామాజిక బాధ్యత పూర్తిగా విస్మరించి వ్యవహరిస్తున్నారు.  వ్యవసాయంలో  రోజురోజుకూ  పెరుగుతున్న  విష రసాయనాల వాడకం వల్ల కలుగుతున్న అనేక అనర్థాలను  అధ్యయనం చేసి  ప్రజలకు చెప్పే శాస్త్రవేత్తలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.

అడ్డు పడుతున్న విష రసాయనాల బేహారులు 
ఇన్సెక్టిసైడ్ 1968 చట్టం ప్రకారం ఏనాటి నుంచో  విష రసాయనాల అవశేషాలను పసిగట్టే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది.  దీని పనితీరు పేలవంగా ఉన్నది.  విష రసాయనాల బేహారులు  నివేదికలు విడుదల కాకుండా,  ప్రజల దృష్టికి చేరకుండా సఫలికృతులు అయ్యారు.  చట్టప్రకారం  రిజిస్ట్రేషన్  చేసిన విష రసాయనాల నిరంతర ఉపయోగం రీత్యా ఏర్పడే హాని అంచనా వేయడానికి సాంకేతిక సమీక్షలు కాలానుగుణంగా నిర్వహించాలి.  కానీ,  కేంద్ర ప్రభుత్వం  నిర్వహించడం లేదు. 

నిర్వహించిన సమీక్షలు ప్రజల  దృష్టికి రావడం లేదు. 1968 నుంచి విధిగా ప్రతి పెస్టిసైడ్ పట్ల చేయాల్సిన సాంకేతిక సమీక్షలు చేయకుండా ప్రభుత్వాన్ని కట్టడి చేయడంలో కూడా ఈ లాబీ సఫలీకృతం అయ్యింది.  గత 20 ఏండ్లుగా ప్రతి పార్లమెంట్ సెషన్లో  అనేకమంది సభ్యులు విష రసాయనాల హాని గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఉత్తుత్తి  సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది  కేంద్ర ప్రభుత్వం.

అందుబాటులో లేని నివేదికలు
భారతదేశంలో  పెస్టిసైడ్  మానిటరింగ్  నివేదికలు ప్రజలకు సులభంగా అందుబాటులో లేవు.   వీటివల్ల  జరిగే  హాని గురించి పర్యవేక్షణ పథకాలు ఉన్నప్పటికీ, వివరణాత్మక రసాయనాల అవశేషాల సమాచారం  చాలావరకు ప్రభుత్వ సంస్థలకు అంతర్గతంగా ఉంటుంది. పరిమిత సమాచారం మాత్రమే ప్రచురితమవుతున్నది. 

సమాచార చట్టం వచ్చిన తరువాత కూడా ఈ సమాచారం బహిరంగంగా లభ్యం కావడం లేదు. జాతీయస్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ  పథకం 2005–06లో ప్రారంభించి.. దేశవ్యాప్త పరీక్షలకు ఆస్కారం కల్పించినప్పటికీ,  చేసిన పరీక్షలకు సంబంధించిన సమగ్ర నివేదికలు ప్రజల ముందు విడుదల కావడం లేదు.

అడ్డుకుంటున్న లాబీ
ఏదైనా  ప్రభుత్వ సంస్థ తన రొటీన్ అధ్యయనాలలో  భాగంగా  ఏదైనా  పెస్టిసైడ్  దుష్ప్రభావాల గురించి అధ్యయన పత్రాలు,  నివేదికలు సమర్పిస్తే  వెంటనే  లాబీ రంగంలోకి దిగుతుంది.  అధ్యయన బృందాన్ని వెంటాడి, విసిగించి, బెదిరించి, అదిరించి, నయానో భయానో  మళ్లీ ఆ రకమైన అధ్యయనం వైపు  తొంగి చూడకుండా ఫలితం సాధిస్తున్నది. 

జాతీయ పోషకాహార సంస్థ గతంలో ఈ మధ్య చేసిన విష రసాయనాల పరిశోధనలకు, పరిశోధకులకు వ్యతిరేకంగా ఈ లాబీ ఒత్తిడి పెంచుతున్నది.  తగిన నిధులు లేక ఇప్పటికే అరకొరగా ఉన్న విష రసాయనల మీద క్షేత్రస్థాయి పరిశోధనలు ఈ రకమైన వేధింపుల వల్ల పూర్తిగా కనుమరుగు అవుతున్నాయి.

ఉన్నతాధికారులు తమ సంస్థలలో  పనిచేస్తున్న శాస్త్రవేత్తలు  స్వచ్ఛందంగా శాస్త్రీయ పరిశోధనలు చేసుకోనివ్వడం లేదు. ప్రభుత్వ పరిశోధన సంస్థలలో  ప్రైవేటు ప్రయోజనాలను కాపాడుతున్న ఉన్నతాధికారుల సంఖ్య పెరుగుతున్నది. ఇదొక రకమైన అవినీతి.  ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలను తొక్కిపెడుతున్న ధోరణి ఎక్కువ అయ్యింది. 

జలచరాలకు హాని
అమెరికాలో  గ్లైఫోసేట్ వలన కలిగే  క్యాన్సర్ కారక ప్రమాదాల గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు మోన్​శాంటో కంపెనీ  నుంచి వ్యాజ్యాలు, పరువునష్టం, పరిశోధనల ప్రచురణను అడ్డగించడం వంటి చర్యలను ఎదుర్కొన్నారు. ఈ రకమైన వేధింపులలో ప్రముఖంగా వినిపించేది  టైరోన్ హేస్ కేసు.  కలుపు  నాశక  రసాయనం అట్రాజిన్ వల్ల  జలచరాలకు కలిగే హాని గురించి పరిశోధన చేయమని సిన్జేంటా కంపెనీ స్వయంగా టైరోన్ హేస్ అనే పేరుగల శాస్త్రవేత్తను  పురమాయించింది. 

నీటి వనరులు అట్రాజిన్ వల్ల కలుషితమైతే  అందులో నివసిస్తున్న కప్పలలోని  హార్మోన్ల వ్యవస్థ దెబ్బ తింటుంది అని అయన కనుగొన్నారు. ఈ ఫలితం అట్రాజిన్ తయారీదారు అయిన సింజెంటా కంపెనీకి రుచించలేదు. అట్రాజిన్ వల్ల మగ కప్పలలో స్త్రీలింగీకరణకు కారణమవుతుందని హేస్ కనుగొన్న విషయాలు సంచలనం అయితే తమ వ్యాపారానికి విఘాతం అవుతుంది అని ఆ పరిశోధనను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది ఆ కంపెనీ. 

ఈ కలుపు నాశక రసాయనం వాడుతున్న మానవులలో కూడా విస్తృత ఎండోక్రైన్ వ్యవస్థకు హాని కలుగుతుంది అని టైరోన్ హేస్ ఈ పరిశోధనను ప్రపంచం ముందట పెడితే ఆ కంపెనీ అతనిని అనేక రకాల ఒత్తిడికి గురి చేసింది.

పటిష్టమైన నియంత్రణ చట్టం రావాలి
ఒక వైపు సహజ వ్యవసాయం ప్రోత్సహించాలని స్వయంగా ప్రధాని మోదీ పిలుపు ఇచ్చి ఆచరణలో విష రసాయనాల పరిశ్రమలను ప్రోత్సహించడం శోచనీయం. ఈ పరిశ్రమలు ఇప్పుడు ఏకంగా తమకు పన్నుల నుంచి రాయితీలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే  పెస్టిసైడ్ పరిశ్రమల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం  సరళీకృతం చేసింది.  పర్యావరణ చట్టం పూర్తిస్థాయిలో అమలుకాకుండా ఈ కంపెనీలకు వెసులుబాట్లు అనేకం ఉన్నాయి. 

విష రసాయనాల పరిశ్రమ ఎదుగుతున్నకొద్దీ  రైతులు, రైతు కూలీలు, గ్రామీణులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అనారోగ్యం పాలు అవుతున్నారు.  గ్రామీణ పేదరికానికి వ్యవసాయంలో వాడుతున్న విష కీటక నాశక, కలుపు నాశక రసాయనాలు ఒక కారణంగా పరిణమించాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే విష రసాయనాల నియంత్రణ చట్టం పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా వీటి ఉపయోగాన్ని తగ్గించే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విధాన కర్తల మీద ఉన్నది.

2025 కొత్త ముసాయిదా
భారతదేశంలో విష రసాయనాల నియంత్రణ చట్టం 1968లో వచ్చింది.  తదుపరి 2008లో ఒక ముసాయిదా వచ్చింది. దీనిలో విష రసాయనాల బాధితులకు ఉపశమన చర్యలు లేవు, ధరల నియంత్రణ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేకపోవడంతో  మేం దానిని వ్యతిరేకించాం. 

ముసాయిదా మీద ఒక పార్లమెంటు కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా అనేక సిఫారసులు చేసింది. 2020లో ఇంకొక  ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం.  ఇటు ప్రజలు, అటు పరిశ్రమ కూడా దీనిని వ్యతిరేకించింది. ఇప్పుడు 2025 కొత్త ముసాయిదా ప్రకటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం గత 30 ఏండ్ల విధ్వంసకర అనుభవాల నుంచి గుణపాఠాలను నేర్చుకుని కఠినమైన చట్టం  తెస్తుందని ఆశ ఉంది.

డా. దొంతి నరసింహారెడ్డి,  పాలసీ ఎనలిస్ట్