తొక్కల దగ్గర్నించీ కాడల వరకు...

తొక్కల దగ్గర్నించీ కాడల వరకు...

వంటింటి నుంచి బయటకు వచ్చే వేస్ట్​ను వాడాలే కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వేస్ట్​ అంటేనే పనికిరాదని మళ్లీ దాన్ని వాడేది ఏంటి? అనేవాళ్లు ఉంటారు. నిజానికి వంట చేసుకున్న వాటిలో చాలావరకు తిరిగి వాడొచ్చు. కంపోస్ట్​ తయారీ దగ్గర్నించీ బ్యూటీ ప్రొడక్ట్స్​ తయారుచేసుకునే వరకు ఉపయోగపడుతుంది కిచెన్​ వేస్ట్​. అంతెందుకు చాలావరకు మీథేన్​ వాయువు విడుదలను ఆపేయొచ్చు! కొందరు ఇప్పటికే వేస్ట్​ని వేస్ట్​ చేయకుండా వాడుతూనే ఉండొచ్చు. మరొక్కసారి ఆ పద్ధతుల్లో కొన్నింటి గురించి...
    

ఫుడ్ వేస్ట్​ను కంపోస్ట్​గా చేస్తే... అది నేచురల్ ఫెర్టిలైజర్​గా పనిచేస్తుంది. అంతేనా ఇది మట్టికి బలాన్ని ఇస్తుంది. భూమ్మీద చెత్త పేరుకుపోదు. వాతావరణంలోకి మీథేన్​ వాయువులు విడుదల తగ్గుతుంది. 
    

పనికిరాదని పారేసే వంటింటి వ్యర్థాలతో బ్యూటీ ప్రొడక్ట్స్​ తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకి నిమ్మకాయ రసం పిండి చెక్కల్ని డస్ట్​బిన్​లో పారేస్తుంటారు. అలాకాకుండా ఆ నిమ్మ చెక్కల లోపలి భాగంతో చేతి వేళ్ల గోళ్ల మీద కొన్ని నిమిషాలు రుద్దాలి. అందులో ఉండే ఆమ్లాలు గోళ్లను మెరిసేలా చేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే... నిమ్మ చెక్కతో గోళ్లను రుద్దిన తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడగాలి.
    

ఇలానే ఇంకో బ్యూటీ ప్రొడక్ట్​ కాఫీ గ్రౌండ్స్​. అంటే... కాఫీ డికాషన్​​ వడకట్టాక మిగిలిపోయిన పొడి లేదా చక్కెర ఈ రెండింటిలో దేనికైనా సరే మీకు బాగా నచ్చే ఫ్లేవర్​​ లేదా సెంట్​ ఎక్స్​ట్రాక్ట్​ కలిపి ముఖానికి రాసుకోవచ్చు. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఇది చర్మం మీద ఉండే డెడ్​ స్కిన్​ను తీసేస్తుంది. 
    

ఇక మిగిలిపోయిన ఆహారం తీసుకుంటే దీంతో  మరో ఫుడ్​ తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే​... బ్రెడ్​ క్రస్ట్ అంటే బ్రెడ్​కి నాలుగు పక్కలా ఉండే గట్టి పదార్థాన్ని చాలా మంది కట్​ చేసి పారేస్తారు. నిజానికి వాటిని బేక్​ చేస్తే సూప్​లో వేసుకునే క్రూటాన్జ్​ రెడీ. ఎంచక్కా వాటిని సూప్​తో పాటు కరకరా నమిలేయొచ్చు. లేదంటే వాటిని పొడి పొడిగా చేసి సలాడ్​ లేదా క్యాస్​రోల్​ మీద క్రంబ్స్​గా వేసుకోవచ్చు. 
    

యాపిల్​ తొక్క, దాని మధ్య భాగాన్ని, స్ట్రాబెర్రీలో తినకుండా పడేసే పై భాగాన్ని, యాప్రికాట్​ తొక్కలతో జామ్​ చేసేయొచ్చు. అందుకు వాటికి కొన్ని ఇంగ్రెడియెంట్స్​ కలిపితే చాలు నేచురల్ ఫ్రూట్ టేస్ట్ జామ్​ రెడీ.
    

క్యారెట్ , ఆలుగడ్డల తొక్క లేదా సెలెరీ ఆకులు కలిపి ఉడికిస్తే ఫ్లేవర్డ్​ స్టాక్​ లేదా సూప్​ రెడీ.
     

అరటి తొక్కలను మొక్కలకు వేసి చూడండి. ‘మాకు పోషకాలు అందాయ’ని అవి తెగ సంతోషిస్తాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా అరటి తొక్కలను బకెట్​ లేదా మగ్గు​ నీళ్లలో వేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఆ నీళ్లను మొక్కలకు వాడాలి. అరటి, అరటి తొక్కల్లో పొటాషియం, ఫాస్ఫరస్​ పుష్కలంగా ఉంటాయి. అందుకని వాటిని నానబెట్టడం వల్ల ఆ నీళ్లలో ఆ న్యూట్రియెంట్స్​ నీళ్లలో కలిసి ఆ నీళ్లు పోషకాలతో నిండిపోతాయి.
     

సిట్రస్​ కాయలు, పండ్ల తొక్కలను చెత్త కుండీలో పారేయకుండా ఉంటే మంచి ఫ్లేవర్​తో మీ ఇంటిని నింపుతాయి అవి. తొక్కలను నీళ్లలో వేసి మరిగించి చూడండి. మీ ఇంట్లో తాజా సువాసనలు మనసును ఆహ్లాదంతో నింపుతాయి.
    

నారింజ​, నిమ్మ. ద్రాక్ష, బత్తాయిల వంటి సిట్రస్​ ఫ్రూట్స్​​ తొక్కలను వంటల్లో వాడొచ్చు. ఫ్లేవర్స్​ నింపుకున్న రెసిపీ రెడీ అయిపోతుంది.
    

లెట్టూస్​, అల్లం, అవకాడో, సెలరీ, ఉల్లికాడల్ని కిచెన్​ గార్డెన్​లో పెంచుకోవచ్చు. కావాల్సిందల్లా మట్టిలో నాటాక నీళ్లు సరిగా పోయడం. ఎండ సరిగా పడితే చాలు కొనాల్సిన అవసరం లేకుండానే కిచెన్​ గార్డెన్​లో ఫ్రెష్​గా రెడీగా ఉంటాయి ఇవి.
 

పీనట్ బటర్​నే తీసుకుందాం.​ బటర్​ అయిపోయి​ సీసా అడుక్కి వచ్చేస్తే దాన్ని బయటకు తీయడం కాస్త శ్రమ. అందుకని దాన్ని తీయాలనే ఆలోచన బుర్రలోకి రానీయరు. కానీ కాస్త ఆలోచిస్తే దాన్ని కూడా పూర్తిగా వాడొచ్చు. పీనట్ బటర్ బాటిల్​​లో ఓవర్​నైట్​ ఓట్స్​ తయారుచేసుకోవచ్చు. సల్సా జార్​లో అయితే స్క్రాంబుల్డ్ ఎగ్, కాయగూరలు వేసి కలిపి ఉడికిస్తే రిచ్​ టేస్ట్​తో, ఫ్లేవర్​ ప్రొడక్ట్​ రెడీ అవుతుంది.
    

బ్రెడ్​ ప్యాకెట్​లో అడుగున, పైన ఉండే బ్రెడ్​ ముక్కల్ని తినకుండా పారేస్తారు చాలామంది. వాటిని కూడా ఒక ఫుడ్​ ఐటమ్​గా మార్చేయొచ్చు. బ్రెడ్​ను బ్రౌన్​ షుగర్​ సీసాలో వేస్తే బ్రౌన్​ షుగర్​ గట్టిగా కాకుండా పొడి పొడిగానే ఉంటుంది.
    

కొత్తిమీర, సేజ్​ వంటి హెర్బ్స్​ ఆకుల్ని కూరల్లో వేసేందుకు వాడి మిగతా భాగాన్ని చెత్తలో వేస్తుంటారు. కానీ వాటిని ఆలివ్​ ఆయిల్​తో కలిపి ఐస్​ ట్రేల్లో వేసి పెట్టాలి. అలా పెడితే వాటిని నూనె లేదా బటర్​కి ప్రత్యామ్నాయంగా వంటల్లో వాడుకోవచ్చు. వంటకాలకు మంచి ఫ్లేవర్​ వస్తుంది. వంటల్లో వాడే మిగతా హెర్బ్స్​ కాడలు, కాడల చివర్లను ఎండబెట్టి మసాలాల్లో కలిపి వాడుకోవచ్చు. ఎండబెట్టినా వాటి ఫ్లేవర్​ ఎక్కడికీ పోదు.

మన దగ్గర ఇలాంటి టెక్నిక్స్ చాలానే వాడుతుంటారు. మీకు తెలిసిన వాటిని నలుగురితో పంచుకోండి. మరిన్ని కొత్త పద్ధతులు కనుక్కుని ఎన్విరాన్​మెంట్​ ఫ్రెండ్లీగా ఉండండి.