క్రెడిట్​కార్డులతో ..క్రెడిట్​స్కోర్​ పెంపు

క్రెడిట్​కార్డులతో ..క్రెడిట్​స్కోర్​ పెంపు

క్రెడిట్​ కార్డుల వాడకం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. క్యాష్​ బ్యాక్​లు, రివార్డు పాయింట్లు పొందవచ్చు. అయితే వీటిని బాధ్యతగా వాడకుంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. సమర్థవంతంగా వాడుకుంటే మాత్రం క్రెడిట్ ​స్కోరు పెంచుకోవచ్చు.

బిజినెస్​డెస్క్​, వెలుగు : చాలా మందికి  క్రెడిట్ కార్డ్‌‌లు రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైనవిగా మారాయి. వీటితో  సౌలభ్యం ఎక్కువ. చాలా రీపేమెంట్ ఆప్షన్‌‌లను అందిస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవహారాలపై కన్జూమర్​కు కంట్రోల్​ వస్తుంది. వన్​ టైం సైనింగ్​ బోనస్​, క్యాష్‌‌ బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ఫ్రీక్వెంట్​ ఫ్లయర్​ మైల్స్​ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. క్రెడిట్​కార్డ్‌‌లను తెలివిగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్‌‌ను సాధించవచ్చు.  ఇతర ఆర్థిక సేవలను పొందేందుకు కూడా మంచి స్కోర్​ అవసరం. వినియోగదారుడు ఉపయోగించే ముఖ్యమైన క్రెడిట్ సాధనాల్లో క్రెడిట్ కార్డ్‌‌లు కూడా ఒకటి.  తెలివిగా ఖర్చు చేయడం,  సమయానుకూల చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. తదనంతరం లోన్లు పొందడం సులభతరం అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ స్పెండింగ్​ 47.4 శాతం పెరిగింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.14.32 లక్షల కోట్లుగా ఉంది. లావాదేవీలు అంతకుముందు సంవత్సరం 224 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 291 కోట్లకు పెరిగాయి. మీ క్రెడిట్ కార్డ్‌‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌‌ను మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

ఎక్కువ అప్లికేషన్లు వద్దు..

క్రెడిట్ కార్డ్‌‌ని పొందడం చాలా సులభంగా మారింది. దీనిని  తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి అప్లికేషన్​ను పరిశీలించేటప్పుడు క్రెడిట్ స్కోర్​ను చూస్తారు. ఒకేసారి చాలా కార్డ్‌‌ల కోసం దరఖాస్తు చేసేవారిని ‘క్రెడిట్​హంగ్రీ’ కస్టమర్​గా చూస్తారు. అంటే మీకు ఆర్థిక అవసరాలు ఎక్కువని భావిస్తారు. ఫలితంగా స్కోర్‌‌పై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ప్రతి ఆఫర్‌‌ను తొందరపాటుగా అంగీకరించకూడదు. ఎక్కువ సంఖ్య కార్డులను వాడటం కంటే  మీ ఖర్చులకు, అలవాట్లకు సరిపోయే కార్డ్‌‌ని ఎంచుకోండి.   

యుటిలైజేషన్ ​రేషియో తక్కువ ఉండాలి

మీ ఆర్థిక  క్రెడిట్ చరిత్ర ఆధారంగా క్రెడిట్​ లిమిట్​ ఇస్తారు. మీరు పూర్తి లిమిట్​ను ఉపయోగించగలిగినప్పటికీ, వాడకపోవడమే మంచిది. తక్కువ వినియోగం వల్ల స్కోరు ఎక్కువ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.  బాధ్యతాయుతమైన క్రెడిట్ మేనేజ్‌‌మెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వాడకం నిష్పత్తిని నిలకడగా నిర్వహించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌‌ను పెంచుకోవచ్చు.

క్రెడిట్​ రిపోర్ట్​పై కన్నేసి ఉంచండి..

 ఖర్చులు,  చెల్లింపు విధానాలను పరిశీలించడానికి మీ క్రెడిట్ రిపోర్టు,  స్టేట్‌‌మెంట్‌‌లను ఎప్పటికప్పుడు గమనించండి. అనధికార లావాదేవీలు ఉండే వెంటనే బ్యాంకుకు తెలియజేయవచ్చు. అంతేగాక  సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, స్థిరత్వం,  క్రెడిట్ బ్యూరోల్లో పరపతి చాలా ముఖ్యం.

బిల్లులను వెంటనే చెల్లించండి

క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించిన ప్రధాన నియమం బిల్లులను సకాలంలో చెల్లించడం. ఆలస్యంగా చెల్లిస్తే  క్రెడిట్‌‌స్కోర్​పై ప్రభావం పడుతుంది కాబట్టి కాలక్రమేణా మీ క్రెడిట్ స్కోర్‌‌ దెబ్బతింటుంది. కార్డ్‌‌పై ఉన్న బాకీ ఉన్న బిల్లులను సకాలంలో క్లియర్ చేయడానికి రికరింగ్​ పేమెంట్స్​ను సెట్ చేయడానికి ప్రయత్నించండి. బలమైన రీపేమెంట్ చరిత్ర ఉండేలా చూసుకుంటే మీ స్కోర్‌‌ పెరుగుతుంది.

పాత బాకీలన్నీ చెల్లించాలి...

కార్డులకు సంబంధించి ఏవైనా పాత బకాయిలు ఉంటే వీలైనంత త్వరగా చెల్లించాలి. దీనివల్ల క్రెడిట్​ రిపోర్ట్​లో ‘పెయిడ్​’ అని కనిపిస్తుంది.  ఫలితంగా మీ మొత్తం క్రెడిట్ స్కోర్లో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని రూల్స్​ను పాటిస్తే క్రెడిట్​స్కోర్​బాగుంటుంది. మంచి క్రెడిట్ స్కోర్‌‌ను నిర్మించడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి.