
కౌలాలంపూర్: ఇండియా సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్టార్ షట్లర్ పీవీ సింధు మాత్రం సెమీస్‌లో ఓడి నిరాశ పరిచింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 19–17తో తొలి గేమ్‌లో లీడ్‌లో ఉన్న సమయంలో ప్రత్యర్థి క్రిస్టియన్ అడినటా (ఇండోనేసియా) రిటైర్డ్ హర్ట్ అయి వైదొలిగాడు. జంప్ రిటర్న్ కొట్టే క్రమంలో కోర్టులో జారి పడ్డ అతని మోకాలికి తీవ్ర గాయం అయింది. వీల్‌చైర్‌లో బయటకు తీసుకెళ్లారు.
ఆదివారం జరిగే ఫైనల్లో ప్రణయ్.. చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌తో తలపడతాడు. మరోవైపుడబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు చుక్కెదురైంది. విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సింధు 14–21, 17–21తో ఇండోనేసియా షట్లర్ గ్రెగోరియా మరిస్కా చేతిలో ఓడింది. ప్రపంచ 9వ ర్యాంకర్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సింధుకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తనదైన దూకుడు చూపెట్టలేక నిరాశ పరిచింది.