హుజూరాబాద్‌లో భారీగా నగదు, మద్యం పట్టివేత

హుజూరాబాద్‌లో భారీగా నగదు, మద్యం పట్టివేత

కరీంనగర్:  ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా డబ్బు, మద్యం, గంజాయి మాత్రమే కాదు.. ఆభరణాలు, దుస్తులు అక్రమంగా పంచిపెడుతుంటే పట్టుకున్నారు. అంతే కాదు అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలు కూడా పట్టుపడడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. 
గత నెల 28 నుంచి ఇవాళ్టి అక్రమంగా నగదు తరలిస్తున్న, పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో 39 కేసులు నమోదు చేసి 1 కోటి 45 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అక్రమ కార్యకలాపాల్లో పట్టుపడినవాటిని కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 
నగదు:  39 కేసుల్లో రూ. 1.45 కోట్ల నగదు స్వాధీనం. 
మద్యం: 48 కేసుల్లో 4.38 లక్షల విలువైన 739.2 లీటర్ల మద్యం స్వాధీనం
గంజాయి: 3.51 కిలోల గంజాయి స్వాధీనం. ముగ్గురిపై కేసు నమోదు
పేలుడు పదార్థాలు: 4 కేసుల్లో  3414 జిలెటిన్ స్టిక్స్, 2164 డిటోనేటర్లు, 1500 మీటర్ల కార్డు వైర్ స్వాధీనం. వీటి విలు సుమారు 40 వేల రూపాయలు 
దుస్తులు: అనుమతి లేకుండా తరలిస్తున్న రూ. 2.21లక్షల రూపాయల విలువైన 67 చీరలు, 40 షర్టులు స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు
ఆభరణాలు: రూ.10.6 లక్షల విలువైన 30 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి స్వాధీనం ఒకరిపై కేసు నమోదు.
బైండోవర్: 132 కేసుల్లో 716 మంది బైండోవర్
ఆయుధాలు: కమిషనరేట్ పరిధిలో ఆయుధ లైసెన్స్ ఉన్నవారి నుంచి వెపన్స్ 75 స్వాధీనం.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద:  టీఆర్ఎస్ నేతలపై 16 కేసులు, బీజేపీ నేతలపై 14, కాంగ్రెస్ నేతలపై ఒకటి చొప్పున  కేసులు, ఇతరులపై 14 కేసులు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.