
- మే నెల నుంచే ఆస్పత్రులకు బాధితులు
- వరుస వర్షాలతో పెరుగుతోన్న కేసులు
- జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న డాక్టర్లు
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన
- బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీల్లో ముందస్తు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలో డెంగీ బెల్మోగుతోంది. వానాకాలం సీజన్మొదలవగా డెంగీ విజృంభిస్తోంది. సిటీలో నెల రోజులుగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వాన పడుతుండగా.. మే నుంచే ఇప్పటిదాకా100కు పైగా కేసులు వచ్చాయి. ఒక్క నల్లకుంటలోని ఫీవర్‌హాస్పిటల్ కే 29 వస్తే.. సిటీలో మొత్తంగా 40 వరకు కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి తెలిపారు. సాధారణంగా జూలై, ఆగస్టులో వర్షాల ఎక్కువగా కురిసేటప్పుడు డెంగీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈసారి మే నుంచే కేసులు నమోదవుతుండగా భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు జిల్లా వైద్యశాఖ అధికారులు, బల్దియా ఎంటమాలజీ అధికారులు అలర్ట్ అయ్యాయి. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెంగీ ర్యాపిడ్ కిట్లతో పాటు, మందులు సిద్ధంగా ఉంచినట్లు జిల్లా వైద్యాధికారులు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం కూడా సిటీలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఇంటింటి సర్వే నిర్వహించి నీరు నిల్వ ఉండే ప్రాంతలను గుర్తించి యాంటీ లార్వా, ఫాగింగ్ చేపడుతుంది. ఒక్క కేసు నమోదైతే డెంగీ బారిన పడిన వ్యక్తి ఇంటి చుట్టూ 50 ఇండ్లకు యాంటీ లార్వా, ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది.
జాగ్రత్తలు తప్పనిసరి...
వానాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇండ్లలో ఉండే ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు ఉండేలా చూసుకోవాలని, కూలర్లు, టైర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండొద్దని సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనే దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని నియంత్రిస్తేనే డెంగీని కట్టడి చేయొచ్చని చెబుతున్నారు.
వారానికి ఒకసారి ఫ్రై డే– డ్రై డే పేరుతో పాత్రలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాను క్లీన్ చేసుకోవాలని పేర్కొంటున్నారు. డెంగీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, జ్వరం వస్తే స్థానిక బస్తీ దవాఖాలు, యూపీహెచ్‌సీల్లో టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు. అయితే అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కావని, ఎక్కువ శాతం సాధారణ జ్వరాలే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే.. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు.
పీహెచ్ సీల్లో సిద్ధంగా కిట్లు, మందులు
ప్రస్తుతం సిటీలో 40 డెంగీ కేసులు నమోదయ్యాయి. జూలై నుంచిసెప్టెంబర్ వరకు డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మలేరియా ఎఫెక్ట్ అంతగా ఉండదు. గతేడాది కేవలం 4 మలేరియా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ముందస్తుగానే పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో డెంగీ ర్యాపిడ్ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచాం. ఎంటమాలజీ అధికారుల రిపోర్ట్ మేరకు సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని దవాఖానాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.
– డాక్టర్వెంకటి, డీఎంహెచ్ వో, హైదరాబాద్