బస్తర్​లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మావోయిస్టులు మృతి

బస్తర్​లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది  మావోయిస్టులు మృతి
  • భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు
  • మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాళ్లు
  • కమాండర్ శంకర్ రావు, లలిత, సుజాతగా గుర్తింపు!
  • బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు  

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​లోని బస్తర్ ​ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. ఇందులో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నెల 19న తొలి విడత లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ సెగ్మెంట్​కు అదే రోజు ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్​అయ్యాయి. కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్, డీఆర్​జీ బలగాలు కూంబింగ్​ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు..  ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న బలగాలు ప్రతిదాడికి దిగాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు భీకరమైన కాల్పులు జరిగాయి. 

కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 29 మంది మావోయిస్టుల డెడ్​బాడీలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో తెలంగాణ క్యాడర్​కు చెందిన కమాండర్ శంకర్​రావు, లలిత, సుజాత ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. వీరిలో శంకర్​రావుది నల్గొండ జిల్లా. ఎన్ కౌంటర్ లో బీఎస్ఎఫ్​ఇన్​స్పెక్టర్, మరో ఇద్దరు డీఆర్​జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్​లో రాయ్​పూర్​కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనా స్థలంలో ఐదు ఏకే 47, 303 రైఫిల్స్, ఇన్సాస్​లు, రాకెట్​లాంఛర్లు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు, నిత్యావసర సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికాయి. కూంబింగ్​కు వెళ్లిన బలగాల కోసం బ్యాకప్​టీమ్స్ పంపించామని, వాళ్లు తిరిగొచ్చాక పూర్తి వివరాలు అందిస్తామని బస్తర్​ఐజీ సుందర్ రాజ్, కాంకేర్​ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు.

 5 రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్ 

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ రెడ్​అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్​గఢ్​, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ఐదు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు భద్రాచలంలో మకాం వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 

ఇటీవల కాలంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. చత్తీస్​గఢ్​లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్​క్యాంపు ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ.. మావోయిస్టులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నది. మావోయిస్టు పార్టీ మాస్టర్​మైండ్​హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కూడా ఇటీవల క్యాంపు ఏర్పాటు చేసింది. అక్కడ ఎయిర్​స్ట్రైక్స్ నిర్వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్​లో జరిగిన ఎన్​కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. కాగా, ఈ మధ్య కాలంలో ఇదే అతిపెద్ద ఎన్​కౌంటర్​గా చెప్పొచ్చు. 

గతంలో జరిగిన కొన్ని పెద్ద ఎన్​కౌంటర్ల  వివరాలివీ.. 

    2008 మార్చి 18న చత్తీస్​గఢ్ లోని బీజాపూర్​ జిల్లా కంచాలలో జరిగిన ఎన్​కౌంటర్​లో 17 మంది మావోయిస్టులు చనిపోయారు.  
    2011 జూన్ 26న చత్తీస్ గఢ్ లోని కాంకేర్​జిల్లా కోయిలీబేడా పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్​కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. 
    -2011 నవంబర్ 24న కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్​జీతో పాటు ఆరుగురు నక్సలైట్లను చత్తీస్​గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్​కౌంటర్​ చేశారు.
    2012 మార్చి 14న డేడాయ్​అడవుల్లో  మావోయిస్టు పార్టీ ప్లీనరీపై బలగాలు మెరుపుదాడి చేయగా15 మంది చనిపోయారు. 
    2012 జూన్​ 28, 29న సార్కెగూడ, కొట్టగూడ, రాజుపెంట గ్రామాల సమీపంలోని ఘనీ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్ లో 17 మంది చనిపోయారు.
    2013 ఏప్రిల్ 16న బీజాపూర్ జిల్లా పువ్వర్తిలో తెలంగాణకు చెందిన కేకేడబ్ల్యూ దళం సభ్యులు 9 మంది మృతి చెందారు. 
    2018 ఏప్రిల్ 22, 23 తేదీల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్​కౌంటర్ లో 42 మంది చనిపోయారు. 
    2018లోనే చత్తీస్​గఢ్ బీజాపూర్​జిల్లా ఇర్మెట్టలో జరిగిన ఎన్​కౌంటర్ లో 10 మంది మృతి చెందారు.