జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 25 గేట్లు ఎత్తివేత

 జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 25 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే  మహారాష్ట్ర, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిపోవడంతో వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. గద్వాల సమీపంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు లక్షా 75 వేల క్యూసెక్కులకుపైగా భారీ వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 
జూరాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో: 1,72,589 క్యూసెక్కులు ఉండగా.. నిల్వ చేసే సామర్థ్యం లేక.. వరద ఒత్తిడిని తగ్గించేందుకు 1,90,548 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.145 టీఎంసీలు నిల్వ చేస్తూ వరద ప్రవాహాన్ని నియంత్రిస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం: 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం: 317.760 మీటర్లు ఉంది.