రాజ్‌కోట్: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు, జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని వెనుక ‘భారీ మోసం’ ఉన్నదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎయిర్‌లైన్స్‌తో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైనట్టు కనిపిస్తున్నదని అన్నారు. మంగళవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశం. కానీ మనం కనీసం సొంత విమానయాన సంస్థలను కూడా సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నాం’’ అని ఎద్దేవా చేశారు.
వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరకం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్వహణ లోపం కాదని, దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉన్నట్టు అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్ ముందు కేంద్రం తలవంచిందని, వారిని నియంత్రించడంలో విఫలమైందని మండిపడ్డారు. వీళ్లు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ అంతా మనల్ని మోసం చేయడానికేనని, ఇది ఓ భారీ స్కామ్ అని అన్నారు.

