ఇన్వెస్టర్ల చూపు ఇండియావైపు.. గ్లోబల్​ కార్పొరేషన్ల నుంచి భారీగా రాక

ఇన్వెస్టర్ల చూపు ఇండియావైపు.. గ్లోబల్​ కార్పొరేషన్ల నుంచి భారీగా రాక

న్యూఢిల్లీ: మనదేశానికి  కొత్త సంవత్సరంలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఆర్థిక వృద్ధి, జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయ సంస్థలు ఇండియావైపే చూస్తున్నాయని తాజా స్టడీ వెల్లడించింది. గోల్డ్‌‌‌‌‌‌‌‌మ్యాన్ శాక్స్ ‘అస్సెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఔట్‌‌‌‌‌‌‌‌లుక్ 2024: ఎంబ్రేసింగ్ న్యూ రియాలిటీస్’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... స్టీల్, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్,  ఆటోమోటివ్‌‌‌‌‌‌‌‌లలోకి భారీగా పెట్టుబడులు వస్తాయి. తమ సప్లయ్ చెయిన్‌‌‌‌ను బలోపేతం చేయడానికి గ్లోబల్ కార్పొరేషన్లు ప్రయత్నిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.3 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 

కొవిడ్​ను,  భౌగోళిక రాజకీయ సమస్యలను, ధరల సమస్యను ఇండియా సమర్థంగా ఎదుర్కొనడంతో ఇన్వెస్టర్లు మనవైపు చూస్తున్నారు.  యుద్ధాలు, ఇన్​ఫ్లేషన్​కు తగ్గట్టు పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా  భారతదేశంలోనే ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అవి రెండేళ్ల క్రితం కంటే ఎక్కువగా ఉన్నాయి.  కనీసం వచ్చే ఏడాది చివరి వరకు రేట్ల తగ్గుదలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.  2024లో మార్పులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పెట్టుబడిదారులకు డైనమిక్ సొల్యూషన్స్ అవసరమని అని గోల్డ్‌‌‌‌‌‌‌‌మన్ శాక్స్​ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లోని ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్నల్ ఇన్వెస్టింగ్ గ్రూప్  గ్లోబల్ కో-హెడ్,  కో-చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్ మైఖేల్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ మేయర్ అన్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడులకు కొత్త తరహా వ్యూహాలు, కొత్తదనం,  రిస్క్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమైనవని అన్నారు. 

పెరగనున్న ఉత్పాదకత..

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో .. ముఖ్యంగా భారతదేశంలో ఉత్పాదకత రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఫలితంగా 0.7 శాతం పెరుగుతుందని అంచనా. ఉత్పాదకత వృద్ధిలో ప్రపంచ సగటు 1.3 శాతం పాయింట్లు ఉంది. మనదేశంతోపాటు అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, తైవాన్  రష్యాతో సహా అనేక దేశాలలో కీలక పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున కొత్త సంవత్సరం రాజకీయంగానూ ముఖ్యమైనదేనని మైఖేల్​ అన్నారు. 2024లో ఇన్వెస్టర్లు  కంపెనీలు అనేక రకాల అవకాశాల కోసం సిద్ధం కావాలని గోల్డ్​మన్​శాక్స్​ సూచించింది. రాబోయే 12 నెలల్లో ఆర్థిక వ్యవస్థలు తమ ఆర్థిక భద్రతపై పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాయి. అభివృద్ధి చెందిన మార్కెట్లకు "రీ-షోరింగ్", "ఫ్రెండ్-షోరింగ్" కీలకంగా మారుతాయి.  చైనా,  భారతదేశం వంటి దేశాలు రాబోయే క్వార్టర్లలో పర్యావరణ పరిరక్షణ కోసం వాతావరణ ప్రోత్సాహకాలను జోడించే అవకాశం ఉంది. అందుకే సస్టెయినబుల్​ఇన్వెస్టింగ్​ పెరిగింది.