బండి సంజయ్​ పాద యాత్రకు భారీ స్పందన

బండి సంజయ్​ పాద యాత్రకు భారీ స్పందన

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​చేపట్టిన మహా సంగ్రామ పాద యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఆదివారం జిల్లాలోని చిట్యాల గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర తలవేద ఎక్స్ రోడ్డు, వెంగవాపేట్, మంజులాపూర్ గ్రామాల మీదుగా నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వరకు సాగింది. తాను షెల్టర్​ తీసుకున్న చిట్యాల గ్రామానికి వచ్చిన దాదాపు 20 మంది అభిమానుల పిల్లలతో బండి సంజయ్ మమేకమయ్యారు. వారితో దాదాపు అరగంటకుపైగా మాట్లాడారు. చదువుల్లో ఫస్ట్​ రావాలని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే అందరికీ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.

సైకిల్ కొనిచ్చిన సంజయ్​...

రెండు రోజుల క్రితం నందన్ గ్రామంలో ఓ పేద విద్యార్థికి సైకిల్​కొనిస్తానని మాటిచ్చిన బండి సంజయ్ ఆదివారం సదరు విద్యార్థికి సైకిల్ అందజేశారు. చదువుల్లో రాణించాలని సూచించారు. మార్గమధ్యంలో తల్వేద వద్ద బండి సంజయ్ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. నిర్మల్​కు చెందిన గీత కార్మికులు బండి సంజయ్​ను కలిసి సమస్యలు వివరించారు. పాదయాత్రలో అభిమానులు, కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో రోడ్డంతా కాషాయ మయమైంది.