భక్తజన గుడారం..లక్షలాది భక్తులతో కిక్కిరిసిన మేడారం

భక్తజన గుడారం..లక్షలాది భక్తులతో కిక్కిరిసిన మేడారం

మేడారం నెట్​వర్క్, వెలుగు : జనం.. జనం.. జనం.. ఏ తొవ్వ చూసినా జనం. ఏ తావు చూసినా జనం. మది నిండా తల్లులను తలుచుకుంటూ పిల్లాజెల్లా, ముళ్లె మూట, కోళ్లు, మేకలతో వెల్లువెత్తిన జనం. బుధవారం సాయంత్రానికి 25 లక్షలకు చేరిన జన సందోహంతో మేడారం మహాజాతర దుమ్మురేగుతున్నది. బండారు, కుంకుమ, మట్టి, బెల్లం కలగలిసిన వాసనతో గుబాళిస్తున్నది. పుణ్య స్నానాలు చేస్తున్న భక్తుల కేరింతలతో జంపన్నవాగు హోరెత్తుతున్నది. నిన్నటిదాకా అక్కడొక్కటి, ఇక్కడొక్కటి అన్నట్టు విసిరేసినట్లుగా ఉన్న కన్నెపల్లి, నార్లాపూర్‌‌, మేడారం లాంటి పల్లెలన్నీ ఇప్పుడు ఏకమైనయ్. భక్తులు వేసుకుంటున్న ఒక్కో గుడారం కలిసి మేడారం మొత్తం ఓ మహా నగరంగా మారిపోయింది. బుధవారం రాత్రి సారలమ్మ గద్దెకు చేరడంతో భక్తుల రాక మరింత పెరుగుతోంది. గురు, శుక్రవారాల్లో సంఖ్య కోటికి చేరుతుందనే అంచనాతో అధికారయంత్రాంగం అలర్ట్ ​అయ్యింది. 

జంపన్న వాగుల్లో అబయా.. 

‘జంపన్న వాగుల్లో అబయా.. జారాడు బండల్లో అబయా..’ అంటూ కొలిచే శివసత్తుల పూనకాల నడుమ భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. వాగులో  ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకొని సమ్మక్క, సారక్క, జంపన్న త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. కల్యాణ కట్ట దగ్గర తలనీలాలు సమర్పించుకొని పిల్లలు, యువతులు, యవకులు జంపన్నవాగులో ఈదుతూ కేరింతలు కొట్టారు. జంపన్నవాగు పొడుగునా, నల్లాల కిందా ఎటుచూసినా జనాలే కనిపించారు. పుణ్యస్నానాల  అనంతరం నిలువెత్తు బంగారం తూగి, తలపై బెల్లం బుట్టలతో గద్దెల వద్దకు వెళ్లి తల్లులకు సమర్పించారు. 

సకల కళల వేదిక

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారంలో తీరొక్క సంప్రదాయం పరిమళిస్తున్నది. తెలంగాణ, ఏపీ , మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా తదితర గిరిజనులు, గిరిజనేతరులు, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు,  ఒడిశా నుంచి సవర తదితర తెగల గిరిజనులు జాతరకు చేరుకున్నారు. వారివారి ప్రత్యేకమైన వేషధారణలు, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక రకరకాల వేషాల్లో లక్ష్మీదేవరలు, ఎరుక చెప్పే కోయదొరలు, అలంకరణలో మహిళలతో పోటీపడే ట్రాన్స్​జెండర్లు, ఇంకా చిత్రవిచిత్ర ముసుగులు, మాస్కులు ధరించిన వారి ఆటపాటలతో జాతర కోలాహలంగా మారింది. 

కిటకిటలాడుతున్న దుకాణాలు.. 

నిలువెత్తు బంగారం జోకించేవారితో బెల్లం దుకాణాలు, స్వీట్లు, బొమ్మల​షాపులు, ఉంగరాలు, రుద్రాక్షలు, వనమూలికల షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం రాత్రి సారలమ్మ గద్దెను చేరడంతో ఎదుర్కోళ్ల కోసం  ఉదయం నుంచే కోళ్లు, మేకల కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో ఆయా మండీల వద్ద, చికెన్​ షాపుల వద్ద సందడి కనిపించింది. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో పలువురు డబుల్​ రేట్లు వసూలు చేశారు. 

బంగారంతో నిండుతున్న గద్దెలు.. 

బుధవారం రాత్రి సారలమ్మ గద్దెను చేరుకోగా, ఉదయం నుంచే  జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు నిలువెత్తు బంగారంతో గద్దెలవద్దకు తరలివస్తున్నారు. దీంతో  మధ్యాహ్నానికే గద్దెలన్నీ సగానికి పైగా నిండిపోయాయి. గురు, శుక్రవారాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని పలువురు భక్తులు బంగారంతో పాటు ఒడిబియ్యం సమర్పించుకున్నారు.  బుధవారం  ఉదయం జంపన్నవాగు నుంచి ఒకేసారి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనానికి రాగా, ఒత్తిడి ఎక్కువైంది. అదే సమయంలో ట్రాఫిక్‌‌ జామ్‌‌ కావడంతో  భక్తులంతా రెండు గంటల  పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక బుధవారం రాత్రి  కన్నెపల్లి నుంచి  సారలమ్మను గద్దెలపైకి తీసుకొని వస్తుండగా భక్తులు  దారి పొడువునా తడి బట్టలతో వరం పట్టారు.  మహిళలు అడుగడుగునా మంగళహారులతో హారతిచ్చారు. సారలమ్మ రాకతో గద్దెల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో భక్తులను కంట్రోల్​ చేయడం పోలీసులు, సిబ్బందికి కష్టమవుతోంది.

ఆర్టీసీ బస్సుల్లో పూనకాలు​!

ములుగు, వెలుగు :  మేడారానికి వచ్చే ఆర్టీసీ బస్సులు భక్తుల పూనకాలతో దద్దరిల్లాయి. సారలమ్మ బుధవారం కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో వందల సంఖ్యలో భక్తులు శివం ఊగారు. ఒకరి తరువాత ఒకరు ‘నా తల్లి సమ్మక్క..నా బిడ్డ సారక్క..కొడుకా జంపన్న’ అంటూ ఊగిపోయారు. 

తాగునీటికోసం భక్తుల కష్టాలు

భూపాలపల్లి అర్భన్,  వెలుగు  మేడారంలో తాగునీటి కోసం భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. తల్లులు గద్దెలకు చేరకముందే లక్షలాది మంది మేడారం చేరుకోగా తాగునీటి కోసం తల్లడిల్లారు. ముఖ్యంగా చిలుకలగుట్ట పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా లేకపోవడంతో వాగులు, వంకలను ఆశ్రయిస్తున్నారు. క్యాన్లతో కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకుంటున్నారు. భక్తుల తాకిడి మరింత పెరిగితే నీటి తిప్పలు ఎక్కువైతాయని, అధికారులు సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

గద్దెలు శుద్ధి చేసిన మంత్రి సీతక్క

తాడ్వాయి(మేడారం), వెలుగు :  మేడారం మహాజాతరలో తొలిఘట్టం అయిన సారలమ్మ రాక రోజున వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలను శుద్ధి చేశారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద ఆడబిడ్డలతో కలిసి పసుపు, కుంకుమ, పవిత్ర జలంతో బయలుదేరి డోలు వాయిద్యాల నడుమ గద్దెలకు చేరుకున్నారు. మంత్రి సీతక్క పూజారులతో కలిసి ప్రత్యేక పోలీసు పహారా నడుమ గద్దెల వద్దకు వచ్చారు. సమ్మక్క, సారలమ్మల గద్దెలను శుద్ధి చేశారు.

క్యూ లైన్​లో భక్తుడికి గుండెపోటు

మేడారం (ఏటూరునాగారం), వెలుగు :  బుధవారం సారలమ్మ రాక సందర్భంగా తెల్లవారుజాము నుంచే  క్యూలైన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాకి చెందిన మల్లయ్యగిరి రాజుకు క్యూ లైన్ లో గుండెనొప్పి వచ్చింది. దీంతో  రెస్క్యూ టీం ముందుగా కృత్రిమ శ్వాస అందించి గద్దెల సమీపంలోని  కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.

గద్దెలకు వెళ్లే రూట్​లో ట్రాఫిక్​ జాం 

మేడారం (మహాముత్తారం) :  మేడారంలో బుధవారం ట్రాఫిక్ జాం అయ్యింది. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు చెల్లించడానికి గద్దెలకు వెళ్లే రూట్​లో రెండు 108 అంబులెన్సులతో పాటు మరో ప్రైవేట్​అంబులెన్స్​చిక్కుకున్నాయి. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్​ జామయ్యింది. చాలా సేపు తోపులాట జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. పిల్లలు, వృద్దులు సొమ్మసిల్లి పడిపోయారు. చివరకు రెండు గంటల తర్వాత అంబులెన్సులు బయటకు వచ్చాయి.