జూరాల కెనాల్స్​కు రిపేర్లు చేస్తలే

 జూరాల కెనాల్స్​కు  రిపేర్లు చేస్తలే
  •  జూరాల కెనాల్స్​కు  రిపేర్లు చేస్తలే
  • మెయింటెనెన్స్​ లేక ప్రతి ఏటా భారీగా నీటి వృథా
  • పెండింగ్​లోనే రూ.2.80 కోట్ల ప్రపోజల్స్
  • వేసవిలో పనులు చేపట్టడంపై అనుమానాలు

వనపర్తి/ఆత్మకూర్, వెలుగు:  ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్  కుడి, ఎడమ కాల్వల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. లైనింగ్  పూర్తిగా శిథిలమైంది. జూరాల హెడ్ రెగ్యులేటర్  గేట్లు కూడా రిపేర్లకు నోచుకోక లీకేజీలతో నీరంతా వృథా అవుతోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 1.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మెయిన్​ కెనాల్​తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ సిమెంట్  లైనింగ్  పగుళ్లు తేలడం, గండ్లు పడడం, లైనింగ్ లేచిపోవడం, తూములు దెబ్బతిన్నా రిపేర్లు చేయించడం లేదు. అలాగే మెయిన్​ కెనాల్​లో రాళ్లు, మట్టి, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు చేరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 

ఎడమ కాలువ రామన్​పాడ్  జలాశయం నుంచి డిస్ట్రిబ్యూటర్  40 వరకు ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాల పరిధిలో 70 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే మరో 30 వేల ఎకరాలు కాల్వలపై మోటర్లు పెట్టుకొని పంటలు సాగు చేస్తున్నారు. కుడి కాలువ పరిధిలోని గద్వాల, అలంపూర్ లలో డిస్ట్రిబ్యూటర్  కెనాల్స్  పరిస్థితి అధ్వానంగా మారింది. 20 ఏండ్లుగా పూర్తి స్థాయి ఆధునికీకరణకు నోచుకోవటం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. కెనాల్స్​ రిపేర్లు పూర్తయితే మరో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని రైతులు చెబుతున్నారు. 

పెండింగ్​లో ప్రపోజల్స్..

ఫిబ్రవరిలో  సాగు నీటి శాఖ కాడా మెయిన్​ కెనాల్స్​ రిపేర్ల కోసం రూ.3.50 కోట్లతో ప్రపోజల్స్​ తయారు చేసి  సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. కాడా పరిధిలోని కమిటీ అంచనా వ్యయం ఎక్కువగా ఉందని ఆ ప్రపోజల్స్​ను తిరస్కరించింది. దీంతో తాజాగా మరోసారి కాడా నిబంధనల మేరకు రూ.2.80 కోట్లతో కొత్త ప్రపోజల్స్​ పంపించారు. ఈ ప్రపోజల్స్​పై చర్చించేందుకు రెండు రోజుల కింద ఈఎన్‌‌సీ, కాడా, ప్రాజెక్ట్ అధికారులు సమావేశమయ్యారు. తాజా అంచనాల విషయంలో మరో వారం రోజుల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఏడాది రిపేర్లు డౌటే?

ప్రస్తుతం పంపించిన ప్రపోజల్స్​ ఆమోదించి, టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లతో  ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం నెల పడుతుంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమైతే కెనాల్​ రిపేర్​ పనులు పెండింగ్​ పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పవని రైతులు చెబుతున్నారు.

కాల్వలు సరిగా లేవు..

జూరాల మెయిన్​ కెనాల్​ డిస్ట్రిబ్యూటరీ మైనర్, సబ్  మైనర్  కాల్వలు సరిగా లేవు. కంపచెట్లు, మట్టి పేరుకుపోయి నీళ్లు ముందుకు పోతలేవు. లైనింగ్  దెబ్బతినడంతో పంటలకు నీరు అందుతలేదు. కాల్వలను పూర్తి స్థాయిలో నిర్మిస్తేనే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయి. 

ఎ అశ్విన్ కుమార్, రైతు