హెచ్‌‌యూఎల్‌‌ బ్యూటీ, పర్సనల్‌‌ కేర్‌‌‌‌ ఇక వేర్వేరు

హెచ్‌‌యూఎల్‌‌ బ్యూటీ, పర్సనల్‌‌ కేర్‌‌‌‌ ఇక వేర్వేరు
  • కొత్త తరం కంపెనీలతో పోటీ పడేందుకే

న్యూఢిల్లీ :  బ్యూటీ, పర్సనల్ కేర్ బిజినెస్‌‌లను వేరు చేయాలని  హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌‌యూఎల్‌‌) నిర్ణయించుకుంది. కొత్త తరం కంపెనీల నుంచి పోటీ పెరగడంతో ఈ బిజినెస్‌‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తోంది. ఈ సపరేట్ బిజినెస్‌‌లలో భారీగా ఇన్వెస్ట్‌‌ చేసే ఆలోచనలో ఉంది.  బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ డివిజన్  ‘బ్యూటీ అండ్ వెల్‌‌బీయింగ్‌‌’,  ‘పర్సనల్ కేర్‌‌‌‌’ బిజినెస్‌‌ల కింద మారుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. హిందుస్తాన్ యూనిలీవర్ పేరెంట్ కంపెనీ యూనిలీవర్‌‌‌‌ పీఎల్‌‌సీ ఇలాంటి విధానాన్నే ఫాలో అవుతోంది.  ఈ రెండు బిజినెస్‌‌లకు సపరేట్‌‌గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు.

స్కిన్‌‌ కేర్ సెగ్మెంట్‌‌కు హెడ్‌‌గా చేస్తున్న హర్మన్‌‌ ధిల్లన్‌‌ కంపెనీ బోర్డ్‌‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా(బ్యూటీ అండ్ వెల్‌‌బీయింగ్‌‌) ‌‌జాయిన్ అవుతారని హెచ్‌‌యూఎల్‌‌  వెల్లడించింది. పర్సనల్ కేర్ బిజినెస్‌‌కు కార్తిక్ చంద్రశేఖర్  హెడ్‌‌గా పనిచేస్తారని పేర్కొంది. ప్రస్తుతం చంద్రశేఖర్‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌కు వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా, ఓరల్ కేర్‌‌‌‌  అండ్ స్కిన్ కేర్‌‌‌‌ బిజినెస్‌‌లకు హెడ్‌‌గా పనిచేస్తున్నారు. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ డివిజన్‌‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన మధుసూధన్ రావు  రిటైర్ అవుతున్నారని కంపెనీ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి మొత్తం రెవెన్యూలో 37 శాతం  బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బిజినెస్‌‌ల  నుంచే వచ్చింది.