ఇంటర్​లో ఇంకా 680 కాలేజీలకు గుర్తింపు రాలె

ఇంటర్​లో ఇంకా 680 కాలేజీలకు గుర్తింపు రాలె

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్టియర్​లో చేరిన లక్షన్నర మంది విద్యార్థుల చదువులు ఆగమైతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వందల కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వకపోవడమే దీనికి కారణం. వివిధ కారణాలతో సుమారు 680 సర్కారు, సర్కారు అనుబంధ, ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ రాలేదు. దీంతో ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాయాలనే దానిపై సస్పెన్స్ నెలకొంది. 2022–23 విద్యా సంవత్సరానికి సర్కారు, సర్కారు అనుబంధ, ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల కోసం మార్చి నెలలో ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,800 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 680 కాలేజీలకు అఫిలియేషన్ రాలేదు. వీటిలో ఈ ఏడాది టెన్త్ నుంచి ఇంటర్​కు అప్​గ్రేడ్​అయిన సర్కారు అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు 130 దాకా ఉన్నాయి. మరో 550 ప్రైవేటు కాలేజీలు ఉండగా, వీటిలో 340 మిక్స్ డ్ ఆక్యుపెన్సీ సమస్యతో ఉన్న కాలేజీలున్నాయి. సర్కారు అనుబంధ కాలేజీలు గడువు ముగిసిన తర్వాత అప్లై చేయడంతో వాటిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రైవేటు కాలేజీలకు మాత్రం మిక్స్​డ్ ఆక్యుపెన్సీతో పాటు పలు కారణాలతో ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. మరోపక్క  అక్టోబర్15 కే అఫిలియేషన్లు, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అడ్మిషన్ల లాగిన్ కూడా క్లోజ్ చేశారు.  ప్రతి ఏడాది ఇంటర్ ఫస్టియర్​లో నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల అడ్మిషన్లు జరుగుతాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 3.30 లక్షల అడ్మిషన్లే అయినట్టు సమాచారం. దీంతో ఇంకో లక్షన్నర మంది స్టూడెంట్లు అడ్మిషన్లు పొందాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఆ స్టూడెంట్ల పరిస్థితి ఎట్ల..? 
రాష్ట్రంలో సుమారు 680 కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వకపోవడంతో ఆ కాలేజీలకు ఇంటర్ బోర్డు అడ్మిషన్ లాగిన్ ఇవ్వలేదు. దీంతో వాటిలో చదివే స్టూడెంట్లకు ఇప్పటికీ అధికారికంగా అడ్మిషన్ లేనట్టే. వాస్తవానికి ఇంటర్ అఫిలియేషన్ల ప్రక్రియ మొదలై ఏడు నెలలు దాటింది. అయినా మిక్స్​డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిఏటా చివరి వరకూ కఠినంగా ఉంటామంటూ ప్రగల్భాలు పలికి, చివరి నిమిషంలో విద్యార్థుల భవిష్యత్​ దృష్ట్యా ఈ ఒక్క ఏడాదే కండిషన్ అఫిలియేషన్ ఇస్తున్నట్టు సర్కారు ప్రకటించడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందనే భావనలో ప్రైవేటు కాలేజీల మేనేజ్​ మెంట్లు ఉన్నాయి. నిజంగానే సర్కారు కఠినంగా ఉంటే, ఆయా కాలేజీల్లో ముందుగానే అడ్మిషన్లు జరగకుండా చూడాలి. కానీ, ఆ పనిచేయలేదు. అయితే అఫిలియేషన్లపై మేనేజ్​ మెంట్ల ప్రతినిధులు ఇంటర్ బోర్డు అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయింది. పైగా ప్రైవేటుగా రాయించుకోవాలని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. సర్కారు అనుబంధ గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకూ గుర్తింపు ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

సీఎం జోక్యం చేసుకోవాలె..
ప్రైవేటు జూనియర్ కాలేజీలు 15..  20 ఏండ్ల కింద పెట్టినవి. వీటికి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదు. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి. కాలేజీలకు అడ్మిషన్ లాగిన్ ఇచ్చి, స్టూడెంట్ల వివరాలు ఆన్ లైన్​లో పొందుపర్చాలి. గుర్తింపు ఇవ్వకపోతే వాటిలో చదివే స్టూడెంట్ల సదువులు ఆగమైతయి. 
- గౌరీ సతీశ్​, టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు

ఎగ్జామ్ ఫీజు డేట్లు అందుకే ఇవ్వట్లే..
ప్రస్తుతం లక్షన్నరకు పైగా స్టూడెంట్ల అడ్మిషన్లపై అయోమయం కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు అధికారులు.. ఆ కాలేజీలకు గుర్తింపు, అడ్మిషన్లు ఇవ్వబోమని, సర్కారు నుంచి ఏమైనా ప్రత్యేక పర్మిషన్ వస్తేనే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఇంటర్ ఎగ్జామ్ ఫీజు డేట్లను బోర్డు ప్రకటించలేదు. ఈ 680 కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు, వారి పేరెంట్స్​కు వాటికి గుర్తింపు లేదనే విషయం తెలియదు. ఎగ్జామ్ ఫీజు టైమ్​లో ఈ విషయం బయటపడే అవకాశం ఉండడంతో, కావాలనే అధికారులు షెడ్యూల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.