పరీక్షలంటే ఏంది.. క్వశ్చన్ ​పేపరెట్లుంటది.. ఏం రాయాలే?

పరీక్షలంటే ఏంది.. క్వశ్చన్ ​పేపరెట్లుంటది.. ఏం రాయాలే?
  • ఇంటర్మీడియట్​ కౌన్సెలింగ్​ సెల్​కు స్టూడెంట్స్ ​ఫోన్లు
  • సైకాలజిస్టులకు రోజుకి వందల సంఖ్యలో కాల్స్

హైదరాబాద్, వెలుగు: ‘‘సార్ మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఎట్లుంటయో తెల్వదు.. టెన్త్​లో పరీక్ష రాయలే. ఇంటర్​ ఫస్టియర్​ నుంచి సెకండ్​ఇయర్​కు వచ్చినం. ఫస్టియర్​పరీక్షలు ఇప్పుడు పెట్టిన్రు. క్వశ్చన్ పేపర్ ఎట్లుంటది? ఎగ్జామ్స్ ఎట్ల రాయాలి? మీ దగ్గర మోడల్ పేపర్లుంటయా? మెటీరియల్​ఇస్తరా? పరీక్షలు పోస్ట్ పోన్ అయితయా? మేమేం చదవలేదు” అంటూ ఇంటర్ ​స్టూడెంట్స్ క్లినికల్ సైకాలజిస్టులకు ఫోన్ల మీద ఫోన్లు చేసి డౌట్లు అడుగుతున్నారు. సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. విద్యార్థులు పరీక్షల ఒత్తిడి, భయాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులతో స్పెషల్​ కౌన్సెలింగ్​సెల్​ఏర్పాటు చేసింది. ఈ నెల 22 నుంచి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. కాగా వారికి స్టూడెంట్స్​నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్​వస్తున్నాయి.  విద్యార్థులు ఫోన్​చేసి వారి డౌట్లు, భయాలను పంచుకుంటున్నారు.

బోర్డు ఎగ్జామ్​అనుభవం లేక..

ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రెండేళ్ల నుంచి ఎలాంటి పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అవుతూ వచ్చారు. టెన్త్​ బోర్డ్ ఎగ్జామ్ ఎక్స్ పీరియన్స్ లేదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్​వచ్చాక ప్రభుత్వం ఫస్ట్​ఇయర్​పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఎగ్జామ్స్​ఎలా రాయాలో తెలియక సతమతమవుతున్నారు. తక్కువ టైంలో చదవడం, రివిజన్ చేసుకోలేక పోతున్నామని చెప్తున్నారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లోని ప్రశ్నలకు సొంత మాటల్లో సమాధానాలు రాయొచ్చా అని అడుగుతున్నారు. ఇంకొంతమందైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని, పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రులు, టీచర్లు కూడా కౌన్సెలర్లకు కాల్స్ చేస్తున్నారు.

కౌన్సెలింగ్, టిప్స్..

స్టూడెంట్స్ అడుగుతున్న ప్రశ్నలకు, సందేహాలకు, భయాలకు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పడం, మెడిటేషన్, ఎగ్జామ్ హాల్​లో టెన్షన్ వస్తే బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌లు చేయాలని టిప్స్ ఇస్తున్నారు. ఇంపార్టెంట్ చాప్టర్లు చదివి వాటిని రివిజన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. టైమ్​టేబుల్ సెట్ చేసుకొని చదవమని చెప్తున్నారు. భయపడుతూ కాల్స్ చేసే విద్యార్థులకు ధైర్యం కల్పించేలా మాట్లాడుతూ టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ అటెండ్ చేయమని 
కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

మొదటిరోజు 100కి పైగా కాల్స్..

స్టూడెంట్స్​కి మా ఫోన్ నంబర్ తెలిసిన 24వ తేదీ నుంచి కాల్స్ వస్తున్నయ్​. ఫస్ట్ డే వందకి పైగా కాల్స్ మాట్లాడాను. ఒక కాల్ మాట్లాడుతుండగానే నాలుగైదు మిస్డ్​ కాల్స్ వచ్చేవి. కొందరు స్టూడెంట్స్​ఎగ్జామ్​ ఎలా రాయాలి? ఎందుకు రాయాలి? పోస్ట్ పోన్ చేయండని కోరుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా భయపడుతున్నారు. ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి అని అడుగుతున్నారు. కొంతమందైతే ప్రశ్నలు చెప్తారా? అని అడుగుతున్నారు. పిల్లలకు ప్రాపర్​గా గైడ్ చేస్తున్నాం... డాక్టర్​ అనిత ఆరే,  సైకియాట్రిస్ట్