కాలుష్యంతో దుర్గం చెరువు విలవిల... వందల సంఖ్యలో చేపలు మృత్యువాత

కాలుష్యంతో దుర్గం చెరువు విలవిల... వందల సంఖ్యలో చేపలు మృత్యువాత
  •     చుట్టుపక్కల నుంచి వచ్చి కలుస్తున్న డ్రైనేజీ నీళ్లు
  •     విషతుల్యమవుతున్న భూగర్భ జలాలు.. 
  •     పట్టించుకోని ఆఫీసర్లు

మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్​కు ఐకానిక్ గా మారిన దుర్గం చెరువు కంపుకొడుతోంది. చుట్టు పక్కల కాలనీల నుంచి మురుగునీరు, పలు హాస్పిటల్స్ నుంచి మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్ధాలు వచ్చి చేరుతుండడంతో చెరువు నుంచి భరించలేని దుర్వాసన వస్తున్నది. ఫలితంగా నీరు కలుషితంగా మారి ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో చేపలు చనిపోతున్నాయి. వేల సంఖ్యలో చనిపోయిన చేపలు ఒడ్డుకు వచ్చి చేరుతున్నాయి. 

చనిపోయిన వాటిని కనీసం తొలగించకపోవడంతో చెరువు పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఈ చెరువుపైనే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి ఉండడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చుట్టూ పక్కల నివాసం ఉండే వాకర్లు చెరువు ట్రాక్ మీదకు వాకింగ్ చేస్తుంటారు. అయితే, ఇందుకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక వసతులు లేవు. పైగా చెరువులో చేపలు చనిపోతున్నాయని అధికారులకు, అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని సందర్శకులు, వాకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ సమయంలో నీటి దుర్వాసనభరించలేకపో తున్నామని వాపోతున్నారు. 

చెరువులో  డ్రైనేజీ వాటర్ చేరడంతోనే..

దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడిన విషయం మా దృష్టికి వచ్చింది. చెరువు నీటిలో చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాల నుంచి డ్రైనేజీ నీరు వచ్చి చెరుతుండడంతో నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి చేపలు మృతి చెందుతున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేందుకు, డ్రైనేజీ వాటర్ కలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం.  

– శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ-