భార్యను వేధిస్తుండని.. యువకుడి హత్య

 భార్యను వేధిస్తుండని..  యువకుడి హత్య
  • భర్తతో పాటు మరో ముగ్గురు అరెస్ట్  
  • యాదాద్రి భువనగిరి జిల్లా గోపాలపురంలో ఘటన

యాదగిరిగుట్ట, వెలుగు : తన భార్యను వేధిస్తున్నాడని ఆమె భర్త మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఓ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. కేసుకు సంబంధించిన వివరాలను యాదగిరిగుట్ట రూరల్‌‌‌‌ సీఐ కొండల్‌‌‌‌రావు, తుర్కపల్లి ఎస్సై తాఖీయుద్దీన్‌‌‌‌ సోమవారం తుర్కపల్లి పీఎస్‌‌‌‌లో వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... తుర్కపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన దాసరం సాయికుమార్ (25) ఈ నెల ఒకటో తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తండ్రి దాసరం రాములు 2వ తేదీన తుర్కపల్లి పోలీస్‌‌‌‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులుపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. సాయికుమార్ కొంత కాలంగా తన భార్యను వేధిస్తున్నాడని, అందుకే గువ్వ రమేశ్‌‌‌‌, తలారి కొండయ్య, తలారి వెంకటేశ్‌‌‌‌ సాయంతో సాయికుమార్‌‌‌‌ను కొట్టి, డ్రిప్‌‌‌‌ పైప్‌‌‌‌, టవల్‌‌‌‌తో గొంతు నులిమి చంపేసినట్లు ఒప్పుకున్నాడు. డెడ్‌‌‌‌బాడీని ములుగు మండలం సింగన్నగూడెం శివారులోని ఓ బ్రిడ్జి కింద పడేసి కాల్చివేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.