
- గర్భవతి కావడం ఇష్టం లేక దారుణం, నలుగురు అరెస్ట్
జమ్మికుంట, వెలుగు : రెండో భార్య గర్భవతి కావడం ఇష్టం లేని ఓ వ్యక్తి మొదటి భార్య కుమారుడితో ఆమెను హత్య చేయించాడు. కరీంనగర్ జిల్లా టేకుర్తి గ్రామంలో శనివారం జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూరాబాద్ ఇన్‌చార్జి ఏసీపీ శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు.
టేకుర్తికి చెందిన ముద్రబోయిన రాములుకు 20 ఏండ్ల కింద రేణుకతో వివాహం కాగా.. అభిలాష్, బన్నీ తేజ కుమారులు ఉన్నారు. రాములు ఎనిమిదేండ్ల కింద చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలను రెండో వివాహం చేసుకొని టేకుర్తిలో ఉంటున్నాడు. తిరుమల గర్భవతి కావడంతో ఆమెకు పుట్టబోయే పిల్లలకు సైతం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. ఇది ఇష్టం లేని రాములు తన మొదటి భార్య కుమారులైన అభిలాశ్, బన్నీ తేజతో కలిసి తిరుమలను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో కత్తిని కొనుగోలు చేశారు. శనివారం తిరుమల ఒంటరిగా ఉండడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఈ కేసులో రాములు అతడి మొదటి భార్య రేణుకతో పాటు వారి కుమారులు అభిలాశ్, బన్నీతేజను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.