- సెల్ ఫోన్లో స్టేటస్‌గా పెట్టి భర్త సూసైడ్
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో ఘటన
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(52), మొదటి భార్య సూసైడ్ చేసుకుంది. అనంతరం అదే మండలానికి చెందిన సంధ్య(42)ను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి రెండు నెలల కింద ప్రేమ పెండ్లి చేసుకుని వెళ్లిపోయింది.
కొద్దిరోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. రామాచారి నాలుగేండ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కుటుంబంలో గొడవల కారణంగా సంధ్య తల్లిగారింటి వద్ద ఉంటోంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈనెల11న సంధ్య సీతారాంపురం వెళ్లింది. భార్యను ఇంట్లో ఉండమని భర్త బతిమిలాడడంతో అక్కడే ఉండిపోయింది.
ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న భర్త శుక్రవారం రాత్రి ఆమెకు ఉరేసి హత్యచేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక సెల్ ఫోన్లో వీడియోతీసి గణపురం ఎస్ఐకి పంపించాడు. ఆ వీడియోను వాట్సప్ స్టేటస్‌లోనూ పెట్టాడు. అనంతరం తను కూడా వీడియో తీసుకుంటూ ఉరేసుకుని చనిపోయాడు. ఘటన స్థలాన్ని శనివారం గణపురం సీఐ కర్ణాకర్‌రావు, ఎస్ఐ అశోక్పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతితో జిల్లాలో చర్చనీయాంశమైంది.
