- భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భర్త
- భర్త ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న భయంతో..
- ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆందోళనకు గురై అఘాయిత్యానికి పాల్పడిన మహిళ
దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న అనుమానంతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో మంగళవారం జరిగింది.
కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన కుంచాల రమేశ్, నాగలక్ష్మి (27) దంపతులు, తమ పిల్లలు అవంతిక (10) , భవన్ సాయి (9)తో కలిసి నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లిలో ఉంటున్నారు. రమేశ్ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇటీవల కొండమల్లేపల్లిలోనే పెయింట్, ఐరన్ షాప్‌ను ప్రారంభించాడు. ఓ వైపు మేస్త్రీ పని, మరో వైపు షాపు నిర్వహణ కారణంగా రమేశ్ ఇంటికి రావడం లేదు. దీంతో అనుమానం పెంచుకున్న నాగలక్ష్మి భర్తతో తరచూ గొడవపడుతుండేది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో రమేశ్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత రమేశ్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ అని రావడంతో ఆందోళనకు గురైన నాగలక్ష్మి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించినా ఆదివారం రాత్రి వరకు రమేశ్ ఆచూకీ దొరకలేదు. దీంతో రమేశ్ జాడ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో రమేశ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భయపడిన నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లలు అవంతిక, భవన్‌సాయిని గొంతు నులిమి చంపిన అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, భార్యపై కోపంతో ఇంటి వెళ్లిన రమేశ్ తన సొంతూరికి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. భార్యపిల్లలు చనిపోయారన్న సమాచారం తెలియడంతో కొండమల్లేపల్లికి వచ్చి డెడ్‌బాడీలను తీసుకొని తమ గ్రామానికి వెళ్లిపోయాడు.
