భార్యను పొడిచి చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణం

భార్యను పొడిచి చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణం
  • అనారోగ్యం చనిపోయిందని నమ్మించే కుట్ర..

జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో భార్యను కత్తితో పొడిచి చంపాడో భర్త. ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న టైంలో మహిళ ఒంటిపై గాయాలు కనపడటంతో హత్య విషయం బయటపడింది. సీఐ రమేశ్​బాబు తెలిపిన వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలం భట్టుపల్లికి చెందిన శేఖర్​గౌడ్, అనూష(22) భార్యాభర్తలు. జడ్చర్లలోని పద్మావతి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శేఖర్ కార్ మెకానిక్​కాగా, అనూష టైలరింగ్​షాపు నడుపుతోంది. భట్టుపల్లికి చెందిన, బంధువైన అరవింద్ తో అనూష వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు శేఖర్​గుర్తించాడు. భార్యపై నిఘా పెట్టాడు. అనూష బుధవారం తను షాపు నడుపుతున్న అపార్ట్​మెంట్లోని ఓ ఇంట్లో ఉన్నట్లు శేఖర్​కు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అనూష, అరవింద్ కలిసి ఉండటాన్ని చూసిన శేఖర్ కోపంతో రగిలిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు.

తీవ్ర గాయాలతో అనూష అక్కడికక్కడే చనిపోగా, అరవింద్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అనూష డెడ్​బాడీని భట్టుపల్లికి తీసుకెళ్లాడు. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిందని బంధువులు, కుటుంబ సభ్యులను నమ్మించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. గ్రామస్తులు మృతురాలి శరీరంపై రక్తపు మరకలు, గాయాలు గుర్తించి భూత్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా, అనూష శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శేఖర్ ను అదుపులోకి తీసుకొని డెడ్​బాడీని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. జడ్చర్ల పోలీసులు హత్య జరిగిన అపార్ట్​మెంట్ ను పరిశీలించారు. అనూష, అరవింద్​కు ఆశ్రయం ఇచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడిన అరవింద్​గౌడ్ ను అప్పటికే సదరు మహిళ మహబూబ్​నగర్​హాస్పిటల్​లో చేర్పించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.