
ఆసిఫాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో శనివారం రాత్రి ఓ భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన వడాయి మారుతితో సంగీత (26)కు 2015లో పెండ్లయ్యింది. వీరికి ఓ కొడుకు, బిడ్డ ఉన్నారు. తాగుడుకు బానిసైన మారుతి అనుమానంతో భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. దాబా గ్రామానికి చెందిన ఒకరితో సంగీతకు వివాహేతరం సంబంధం ఉందని మారుతి గొడవ చేసేవాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తాగి వచ్చిన మారుతి సంగీతతో గొడవ పడ్డాడు. ఆవేశంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో మెడ పై నరికాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకుని సముదాయించేందుకు మొర్లె పొచ్చు అనే వ్యక్తి అడ్డు రాగా అతడిపై కూడా గొడ్డలితో దాడి చేశారు. మెడ పై, ఎడమ చేతిపై నరకగా అతడు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు అతడిని హాస్పిటల్కు తరలించారు. మృతురాలి తండ్రి లెండిగురే బాబాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు.