
గోదావరిఖని,వెలుగు: రామగుండం కార్పొరేషన్లో అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ల భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. మండల పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో లక్కీడ్రా నిర్వహించారు. కొందరు మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలు స్టేజ్ మీద కూర్చున్నారు. ఆరో డివిజన్ కార్పొరేటర్ రమాదేవి స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్, ఏడో డివిజన్ కార్పొరేటర్ కాల్వ స్వరూప స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్, 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత స్థానంలో ఆమె భర్త రవీందర్, 43వ డివిజన్ కార్పొరేటర్ ధరణి స్వరూప స్థానంలో భర్త జలపతి, 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విజయ స్థానంలో లక్ష్మణ్ గౌడ్ కూర్చున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట మాధవరావు, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, తహసీల్దార్జాహెద్ పాష తదితరులు పాల్గొన్నారు. 2016లో 160 మంది లబ్ధిదారులను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎంపిక చేశారని, వారికి కేటాయించిన తర్వాతనే మిగిలిన వారికి ఇండ్లు ఇవ్వాలని 40వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దుబాసి లలిత, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుబాసి మల్లేశ్ డిమాండ్ చేశారు.